Marriage Cancel : చికెన్ లేదా? అయితే పెళ్లి క్యాన్సిల్.. తర్వాత ఏమైందంటే?-marriage called off for not serving chicken by bride family in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Marriage Called Off For Not Serving Chicken By Bride Family In Hyderabad

Marriage Cancel : చికెన్ లేదా? అయితే పెళ్లి క్యాన్సిల్.. తర్వాత ఏమైందంటే?

HT Telugu Desk HT Telugu
Nov 29, 2022 05:19 PM IST

Chicken Curry Issue : చికెన్ కర్రీ లేదని పెళ్లి క్యాన్సిల్ అంటే ఎలా ఉంటది.. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. కేవలం చికెన్ పెట్టలేదనే కోపంతో పెళ్లి రద్దు చేస్తామని ఓ వధువు కుటుంబానికి వరుడి కుటుంబం షాక్ ఇచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ఆడ పెళ్లి వారు, మగ పెళ్లి వారి మధ్య గొడవలు వస్తే కూర్చొని మాట్లాడుకోవాలి. ఎంతపెద్ద విషమైనా మాట్లాడితే సెట్ అయిపోద్ది. కానీ ఓ వరుడి కుటుంబం చికెన్ కర్రీ వండలేదని.. పెళ్లి క్యాన్సిల్ చేసేందుకు రెడీ అయింది. ఈ ఘటన ఎక్కడో కాదు.. హైదరాబాద్ పరిధిలోనే జరిగింది. ఈ విషయం తెలిసిన వాళ్ళంతా.. చికెన్ లేదని పెళ్లి క్యాన్సిల్ అనడమేంటని ముక్కున వేలేసుకుంటున్నారు.

తెలంగాణకు చెందిన వరుడి కుటుంబం బీహార్‌కు చెందిన మార్వాడీ కుటుంబానికి షాక్ ఇచ్చింది. జీడిమెట్లలో ఈ ఘటన జరిగింది. పెళ్లికి ముందు జరిగిన డిన్నర్ పార్టీలో వధువు కుటుంబం చికెన్ ఐటమ్స్ వడ్డించలేదు. దీంతో అతిథులు గొడవ పడడం, రాత్రి భోజనం చేయకుండా వెళ్లిపోవడం, పెళ్లికొడుకు స్నేహితులు లొల్లి చేయడంతో మరుసటి రోజున జరగాల్సిన వివాహం రద్దు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్‌లోని జీడిమెట్లలోని షాపూర్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. వరుడు జగద్గిరిగుట్టలోని రింగ్‌బస్తీకి చెందినవాడు. వధువు బీహార్‌లోని మార్వాడీ కుటుంబానికి చెందినది. పెళ్లికి ముందు తెలంగాణలోని షాపూర్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. షాపూర్‌నగర్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో విందు ఏర్పాటు చేశారు. వధువు కుటుంబం శాకాహారం తింటారు. ఒక్క నాన్‌వెజ్ ఐటమ్‌ కూడా మెనూలో పెట్టలేదు.

పెళ్లికొడుకు స్నేహితులు డైనింగ్ హాల్‌కి వచ్చారు. నాన్ వెజ్ ఏర్పాటు చేయలేదని గ్రహించి నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. తర్వాత ఈ విషయం వధువు కుటుంబానికి తెలిసింది. కాస్త అడ్జస్ట్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. మాటమాట పెరిగి గొడవ మెుదలైంది. ఆగ్రహంతో ఊగిపోయిన పెళ్లికొడుకు ఫ్రెండ్స్.. రాత్రి భోజనం చేయకుండానే వెళ్లిపోయారు. ఈ విషయంపై పెళ్లికొడుకుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ స్నేహితులు రాత్రి భోజనం చేయకుండా వెళ్లిపోవడాన్ని చూసిన వరుడు అలిగాడు. పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వధువు కుటుంబ సభ్యులతో ప్రస్తావించారు. చివరకు నాన్ వేజ్ పెట్టలేదని.., వివాహం రద్దు చేసేవరకు వెళ్లింది. వరుడి కుటుంబం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి వివాహాన్ని రద్దు చేయాలని నిర్ణయించుకుంది.

అసలే ఆడపిల్ల.. పెళ్లి రద్దు అంటున్నారని.. వెళ్లి జీడిమెట్ల పోలీసులను కలిశారు వధువు కుటుంబ సభ్యులు. అక్కడ సీఐకి విషయాన్ని వివరించారు. ఇరు కుటుంబాలను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు పోలీసులు. ఈ నెల 30న పెళ్లి చేయాలని వధూవరుల కుటుంబీకులు నిర్ణయించారు. అలా విందులో చికెన్ లేకుండా.. ఆగిపోయిన వివాహం.. ఆలస్యంగా జరగనుంది.

IPL_Entry_Point