KCR | దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పగలరా? ఇంతకీ దేశ్ కి నేతా ఎవరు? రాహుల్ గాంధీకి మద్దతు దేనికి?!-kcr ready to play crucial role in national politics ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Kcr Ready To Play Crucial Role In National Politics

KCR | దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పగలరా? ఇంతకీ దేశ్ కి నేతా ఎవరు? రాహుల్ గాంధీకి మద్దతు దేనికి?!

HT Telugu Desk HT Telugu
Feb 20, 2022 06:08 PM IST

తెలంగాణ సాధించిన.. ఉద్యమకారుడు కేసీఆర్. ఆయన పట్టు వదలని విక్రమార్కుడు.. ఏదైనా అనుకుంటే.. పని అయ్యేదాకా వదిలిపెట్టరు? ఇప్పుడు బీజేపీపై పోరు కూడా పట్టువదలకుండా చేస్తున్నారా? బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో సమావేశం వెనక వ్యూహం అదేనా? జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పగలరా?

కేసీఆర్(ఫైల్ ఫొటో)
కేసీఆర్(ఫైల్ ఫొటో)

దేశ రాజకీయాల్లో ఇప్పుడు కేసీఆర్ అడుగులు.. ఇంట్రస్టింగ్ టాపిక్. బీజేపీకి చెక్ పెట్టేందుకే కేసీఆర్ మాటలు, ఇతర నేతలతో సమావేశాలు.. జరుగుతున్నాయని అర్థమవుతుంది. ఇప్పటికే.. దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలతో మాట్లాడారు. మరోవైపు బీజేపీ వ్యతిరేక పోరులో కేసీఆర్ విపక్షాల నుంచి మద్దతు సైతం లభిస్తుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా, మాజీ ప్రధాని దేవగౌడ మద్దతు.. తాజాగా ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవర్ తో భేటీ.. ఇవన్నీ చూస్తుంటే.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషించనున్నట్టు తెలుస్తోంది. కానీ.. చివరి వరకూ ఆయనకు మద్దతు ఉంటుందా? అందరూ కలిసి కేసీఆర్ తో నడుస్తారా?

ట్రెండింగ్ వార్తలు

కొన్ని రోజులుగా.. ప్రధాని మోడీ, బీజేపీపై కేసీఆర్ స్వరం పెంచారు. బీజేపీని బంగాళాఖాతంలో కాలిపేసే టైమ్ వచ్చిందని.. కేంద్రంలో అధికార పార్టీని చీల్చిచెండడారు. అప్పటి నుంచి బీజేపీయేతర పార్టీలతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. కేసీఆర్ స్వరం పెంచాక.. బీజేపీ అంటే పడని.. పార్టీలు.. కేసీఆర్ కు బహిరంగంగానే మద్దతు ప్రకటించాయి. కేసీఆర్ పోరాటం భేష్ అంటూ చెప్పాయి. అయితే బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలు కలిసి.. కేంద్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్నాయా? దీని వెనక ఉన్నది ఎవరు? ఇటీవలే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. టీఆర్ఎస్ పార్టీతో చర్చలు ఇందులో భాగమేనా? గతంలోనూ.. ప్రశాంత్ కిషోర్ సైతం.. బీజేపీ, కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు చేశారు.

రాహుల్ గాంధీకి కేసీఆర్ మద్దతు ఎందుకు?

ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్థులెక్కువ. టీఆర్ఎస్-కాంగ్రెస్ 2004లో పొత్తుపెట్టుకుంది. ఆ తర్వాత మారిన పరిస్థితుల కారణంగా తెలంగాణలో శత్రువు అయిపోయింది. కేసీఆర్.. మాటల ధాటికి.. తెలంగాణలో కాంగ్రెస్ పాతాళానికి వెళ్లింది. కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరైనా.. కేసీఆర్ విమర్శించారు. అంతకుముందు.. పార్లమెంట్ లో ప్రధాని మోడీని రాహుల్ కౌగిలించుకుంటే సైతం విమర్శించారు. అయితే ఇటీవల సర్జికల్ స్ట్రైక్స్ పై రాహుల్ గాంధీ చేసిన విమర్శలను మాత్రం కేసీఆర్ సమర్థించారు. తనకు కూడా సర్జికల్ స్ట్రైక్స్ పై ఆధారాలు కావాలని కోరారు. రాహుల్ అడిగిన ప్రశ్నలో తప్పులేదని కేసీఆర్ చెప్పారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించడంలో భాగంగా.. వీలైతే.. కాంగ్రెస్.. పార్టీ మద్దతు కూడా తీసుకుంటారేమోనని ఊహగానాలు సైతం వచ్చాయి.

దేశ్ కి నేత ఎవరు?

ఒకవేళ ప్రాంతీయ పార్టీలన్నీ.. కలిసి వెళ్తే.. ప్రధాని అభర్థిగా ఎవరిని చూపిస్తాయి. ఓ వైపు కేసీఆర్ బర్త్ డే సందర్భంగా.. ముంబయి, డిల్లీ, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ఫ్లెక్సీలు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. దేశ్ కి నేతా కేసీఆర్.. అని చూపించడంలో భాగంగానే.. ఈ ఫ్లెక్సీలు వచ్చాయనే వారూ ఉన్నారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి సైతం.. ప్రధాని పదవిపై ఆశ ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే.. దక్షిణాది నేతలకు ఉత్తరాది నేతలు సహకరిస్తారా? అనే చర్చ ఎప్పటికీ ఉంటూనే ఉంది. గతంలో.. దేవెగౌడ లాంటి వారు ప్రధాని పదవి చేపట్టినా.. తర్వాత.. కొన్ని రోజులకై పదవి వదలుకోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ప్రధానిగా పీవీ నరసింహారావు చేసినా.. సోనియా గాంధీ.. చెప్పినట్టు నడుచుకునేవారనే అపవాదు కూడా ఉంది. అయితే ఇంతకీ దేశ్ కి నేత ఎవరు అనేది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. వేరే ఎవరినైనా ముందు పెట్టి.. వెనక నుంచి నడిపిస్తారో చూడాలి.

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎదుగుదల మమతాకు సవాలేనా?

నిజానికి బీజేపీకి బద్ధ వ్యతిరేకి.. మమతా బెనర్జీ. ఆమె మాటలను సంధించడంలో నేర్పరి. ఆమె బీజేపీపై చేసే కామెంట్స్ జాతీయ స్థాయిలో చర్చ అవుతాయి. బీజేపీపై ఆమెది బలమైన గొంతుక. అయితే కేసీఆర్ మాటలు మాత్రం.. హేతుబద్ధంగా ఆసక్తి కలిగించేలా ఉంటాయి. హిందీపై కేసీఆర్ కు పట్టు ఉండటం కలిసొచ్చే అంశమే. ఇలాంటి పరిస్థితుల్లో మమత కంటే.. ఎక్కువగా.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేలా.. అడుగులు వేస్తున్నారు. మరోవైపు ప్రాంతీయ పార్టీల నేతలు సైతం.. కేసీఆర్ కు మద్దతు తెలుపుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ కేసీఆర్ ముందు ఉండి నడిస్తే.. జాతీయ రాజకీయాల్లో మమతాకు మైనస్ అయ్యే అవకాశం కూడా ఉంది. సరైన పాయింట్ పట్టుకుని.. కేంద్రాన్ని కేసీఆర్ విమర్శించినట్టు జాతీయ రాజకీయాల్లలో విమర్శించే నేతలు తక్కువే ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పడితే.. దానికి ఎవరు కన్వీనర్ గా ఉంటారో వేచి చూడాలి.

గతంలో కేసీఆర్ ఏం చేశారు?

అయితే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే.. కేసీఆర్ ఆలోచన ఇప్పటిది కాదు. గతం నుంచి ఉన్నట్టు.. ఆయన కామెంట్స్ చూస్తుంటే అర్థమవుతోంది. గతంలోనూ.. 'ఢిల్లీలో గత్తర లేపుతా' అంటూ వ్యాఖ్యానించారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్లీ అధికారంలోకి వచ్చాక.. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన రాష్ట్రంలోని పాలనపైనే దృష్టి పెట్టారు. అయితే సమయం దొరికినప్పుడల్లా.. బీజేపీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. మళ్లీ వెళ్లి.. కేంద్రంతో రహస్య మంతనాలు చేస్తున్నారనే.. ఆరోపణలు సైతం కేసీఆర్ పై ఉన్నాయి.

అయితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకే.. ఇప్పుడు బీజేపీపై పడ్డారని విమర్శలు ఉన్నాయి. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్.. రెచ్చగొట్టి.. అధికారంలోకి రావాలనే ఉద్దేశంతోనే.. కేసీఆర్ జాతీయ రాజకీయాలు అంటున్నారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కేంద్రంతో పోరాడుతున్న.. కేసీఆర్ ను రాష్ట్ర ప్రజలు ఆశీర్వాదిస్తారనే ప్లాన్ వేశారని ఆరోపణలున్నాయి. దేశ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర ఎలా ఉంటుందో.. ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే..

IPL_Entry_Point