Inter Student Suicide :ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధి ఆత్మహత్య…తల్లిదండ్రుల ఆందోళన-junior inter student suicide in hyderabad and student protest against sri chaitanya management ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Junior Inter Student Suicide In Hyderabad And Student Protest Against Sri Chaitanya Management

Inter Student Suicide :ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధి ఆత్మహత్య…తల్లిదండ్రుల ఆందోళన

HT Telugu Desk HT Telugu
Mar 01, 2023 09:58 AM IST

Inter Student Suicide హైదరాబాద్‌ నార్సింగిలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్ది ఆత్మహత్య ఉద్రిక్తతకు దారి తీసింది. తరగతి గదిలోనే విద్యార్ది ఆత్మహత్య చేసుకున్నా, విద్యార్దిని కాపాడేందుకు సిబ్బంది ప్రయత్నించకపోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్ధి బంధువులు సిబ్బందిపై దాడికి యత్నించారు.

నార్సింగిలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్ధి
నార్సింగిలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్ధి

Inter Student Suicide హైదరాబాద్ నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధి తరగతి గదిలోనే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విద్యార్ధి కొన ప్రాణాలతో ఉండగా కాపాడాల్సిన సిబ్బంది గదికి తాళాలు వేశారు. చివరకు తోటి విద్యార్ధులే అతడిని కాపాడేందుకు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంపై విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

నార్సింగ్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థి చదువులో వెనుకబడ్డాడని కాలేజీ యాజమాన్యం ఒత్తిడి చేయడం, సిబ్బంది చేయి చేసుకోవడాన్ని తట్టుకోలేక షాద్ నగర్ ప్రాంతానికి చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిది కేశంపేట మండలం కొత్తపేట గ్రామంగా గుర్తించారు.

విద్యార్ధి మృతితో పాఠశాల ప్రిన్సిపల్, వార్డెన్‌లపై బంధువుల దాడి చేశారు. దీంతో పోలీసుల రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్చుకొని ప్రయోజకుడు అవుతాడని భావించిన తల్లిదండ్రులకు విషాదాన్ని మిగిల్చాడు.

హైదరాబాద్ లోని నార్సింగ్ ప్రాంతంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఈ దారుణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన నాగుల రాజు కుమారుడు నాగుల సాత్విక్ తరగతి గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి క్లాస్ గదిలో ఉరివేసుకోవడం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళాశాల ముందు ఆందోళనకు దిగారు. కళాశాల ప్రిన్సిపల్ వార్డెన్ ఎక్కువ వేధింపులకు గురి చేశారని విద్యార్ధులు ఆరోపించారు. గత రాత్రి 10 గంటలకు స్టడీ అవర్స్ అయిపోయాక విద్యార్థులందరూ హాస్టల్ గదికి చేరుకున్నారు. సాత్విక్ మాత్రం హాస్టల్ కు వెళ్లకుండా క్లాస్ గదిలోనే బట్టలు ఆరవేసే వైరుతో ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు.

దీనిని గమనించిన కొంతమంది విద్యార్థులు గోల చేయగానే వార్డెన్ అక్కడికి వచ్చాడు. కొన ఊపిరితో ఉన్న సాత్విక్ ను రక్షించే ప్రయత్నం వార్డెన్ చేయలేదని, విద్యార్థులపై అరిచి వారిని అక్కడ నుండి వెళ్లగొట్టి గదికి తాళం వేసినట్లు చెబుతున్నారు. కొన ఊపిరితో ఉండగానే గదికి తాళం వేయడంతో దాదాపు పావుగంట ఆలస్యం అయ్యిందని ఆరోపించారు. సకాలంలో ఆసుపత్రికి తరలించి ఉంటే సాత్విక్ బ్రతికేవాడన్నారు.

ఆ తర్వాత విద్యార్థులు రెచ్చిపోయి ఆందోళన చేపట్టడంతో వార్డెన్ గది తాళం తీశాడు. అప్పటికీ సాత్విక్ కొనఊపిరితోనే ఉన్నాడని, విద్యార్ధులు స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. వార్డెన్ రక్షించే ప్రయత్నం చేయకపో వడంతో సాత్విక్ మృత్యువాత పడ్డాడని ఆరోపిస్తూ మృతుడి బంధువులు వార్డెన్ మరియు ప్రిన్సిపల్ పై దాడికి దిగారు. కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రాత్రి 8 గంటలకే తండ్రి నాగుల రాజు తన కుమారుని చివరిసారిగా కలిసినట్టు చెప్పారు. పరీక్షలు అయిపోయాక ఇంటికి రావాలని కోరారు. అంతకుముందు విద్యార్థి సాత్విక్ ఇంట్లో తన నానమ్మకు తనపై ఒత్తిడి పెడుతున్నారని బాగా కొడుతున్నారని చెప్పి వాపోయినట్లు చెబుతున్నారు.

సాత్విక్ ను పెద్ద ఎత్తున ఒత్తిడికి గురిచేయడం తిట్టడం, కొట్టడం వల్లే మనస్థాపాన్ని గురై ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. యాజమాన్య వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని, కళాశాల యాజమాన్యంతో పాటు ప్రిన్సిపాల్, వార్డెన్‌పై హత్య కేసు నమోదు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

IPL_Entry_Point