IT Raids On Malla Reddy : మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఏం దొరికాయి?
IT Raids On Minister Malla Reddy : మంత్రి మల్లారెడ్డి లక్ష్యంగా ఐటీ అధికారులు దాడులు చేశారు. మంత్రికి చెందిన విద్యాసంస్థలు, కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు చేశారు అధికారులు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
మంత్రి మల్లారెడ్డి(Minister Malla Reddy), ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు(IT Officials) ఏకకాలంలో దాడులు చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే అధికారుల సోదాలు మెుదలయ్యాయి. సుమారు 50 బృందాలుగా ఏర్పడి.. ఆయనకు సంబంధించిన సంస్థలు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు. సోదాల్లో భారీగా డబ్బు కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. మంత్రి మల్లారెడ్డి సన్నిహితుల నుంచి ఐటీ అధికారులు డబ్బు సీజ్ చేశారని, సుచిత్రలో మల్లారెడ్డి అనుచరుడైన త్రిశూల్ రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లను సీజ్ చేసినట్టుగా సమాచారం.
మరోవైపు మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ కు సన్నిహితుడైన రఘునాథ్ రెడ్డి ఇంటిపైన ఐటీ అధికారులు సోదాలు చేశారు. అతడి వద్ద నుంచి. రూ.2 కోట్లకు పైగా నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రఘునాథ్ రెడ్డి ఉండే ఏరియాలోనే.. మల్లారెడ్డికి వరుసకు అల్లుడు అయ్యే సంతోష్ రెడ్డి ఇంటికి కూడా అధికారులు వెళ్లారు. ఉదయం నుంచి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ డోర్లు వేసి ఉన్నాయి. దీంతో మధ్యాహ్నం తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో సంతోష్ రెడ్డి(Santhosh Reddy) కుటుంబ సభ్యులు ఇంటి తలుపులు తీశారు. దీంతో అధికారులు ఇంట్లోకి వెళ్లి సోదాలు చేశారు.
మెుత్తం సోదాల్లో భాగంగా కొత్త విషయాలు బయటకు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. క్యాసినో(Casino)లో ఇన్వెస్ట్ చేసిన జైకిషన్ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. జైకిషన్, మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్(Chikoti Praveen) కలిసి క్యాసినోలో పెట్టుబడులు పెట్టారని అధికారులు తెలుసుకున్నట్టుగా సమాచారం. జైకిషన్ తండ్రి నరసింహ, మంత్రి మల్లారెడ్డి బిజినెస్ పార్టనర్స్ గా ఉన్నారు. మరోవైపు కాలేజీల ఆర్థిక లావాదేవీలను సైతం పరిశీలించారు అధికారులు. క్రాంతి బ్యాంక్ ఛైర్మన్ ఇంట్లోనూ ఐటీ అధికారులు(IT Officials) సోదాలు చేశారు. ఇదే బ్యాంకులో మల్లారెడ్డి ఇంజినీరింగ్(Malla Reddy Engineering) కాలేజీకి సంబంధించిన లావాదేవీలు ఉన్నట్టుగా గుర్తించారు. నాలుగు మెడికల్ కాలేజీల(Medical Colleges) లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇంకా సోదాలు కొనసాగే అవకాశం ఉంది.
మల్లారెడ్డి కుటుంబం నిర్వహిస్తున్న ఇంజినీరింగ్, వైద్య, డెంటల్, ఇతర రియల్ ఎస్టేట్(Real Estate) వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలపై అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. మల్లారెడ్డి కుమారులు, సోదరుడు, అల్లుడు, వియ్యంకుడు, స్నేహితులు, మల్లారెడ్డి వ్యాపార భాగస్వామ్యులు.. ఇలా అనేక మంది ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు.
మల్లారెడ్డికి చెందిన సంస్థల డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేశారు. సోదాల్లో దొరికిన కీలక పత్రాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. ఆస్తులు, ఆదాయ వనరులు, పన్ను చెల్లింపుల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు, పన్ను చెల్లింపుల్లో తేడాలు ఉన్నట్టుగా దృష్టికి రావడంతో తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పది సంవత్సరాల ఐటీ రిటర్న్స్(IT Returns) చెల్లింపుల గురించి ఆరా తీస్తున్నట్టుగా సమాచారం.