Governor Tamilisai | గవర్నర్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం.. ఈ దూరానికి కారణాలేంటి?-is telangana govt maintain distance with governor tamilisai soundararajan ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Governor Tamilisai | గవర్నర్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం.. ఈ దూరానికి కారణాలేంటి?

Governor Tamilisai | గవర్నర్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం.. ఈ దూరానికి కారణాలేంటి?

HT Telugu Desk HT Telugu
Mar 06, 2022 11:09 AM IST

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై ఇప్పుడు దుమారం రేగుతోంది. బడ్జెట్లో గవర్నర్ ప్రసంగం షెడ్యూల్ చేయకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు గవర్నర్ తమిళిసై కూడా ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. ఇంతకీ ప్రభుత్వం ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఇతర పార్టీలు ఏమంటున్నాయి?

గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్(ఫైల్ ఫొటో)
గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్(ఫైల్ ఫొటో)

గవర్నర్ ప్రసంగం లేకుండా.. బడ్జెట్ సమావేశాలు.. ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోంది. దీనిపై.. గవర్నర్ తమిళిసై ప్రకటన విడుదల చేశారు. గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి గవర్నర్ తో ఇంత దూరం ఎందుకు పెరిగిందని అంతా చర్చ నడుస్తోంది. అయితే తెలంగాణకు తమిళి సై గవర్నర్ గా వచ్చినప్పటి నుంచీ.. కేసీఆర్ దూరంగానే ఉంటున్నారనే ప్రచారం కూడా ఉంది. అంతకుముందు గవర్నర్ నరసింహన్ తో కేసీఆర్ కు సఖ్యత ఉండేది. ఉమ్మడి గవర్నర్ గా ఉన్నా.. చంద్రబాబు కంటే.. కేసీఆర్ తోనే ఎక్కువ దగ్గరగా ఉండేవారు.

కానీ, గవర్నర్ గా తమిళి సై వచ్చినప్పటి నుంచి.. కేసీఆర్ రాజ్ భవన్ కు దూరంగా ఉంటున్నారనే.. వాదనలు ఉన్నాయి. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన మెుదట్లో.. వివిధ శాఖల అధికారులతో గవర్నర్ మాట్లాడారు. వాటికి సంబంధించిన.. సమాచారం తెప్పించుకున్నారు. అయితే సంబంధిత శాఖల వివరాలను తెప్పించుకోవడంపై కేసీఆర్.. కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారని.. అప్పట్లో హాట్ టాపిక్ అయింది. లాక్ డౌన్ సమయంలోనూ ప్రభుత్వంపై పరోక్షంగా చురకలు వేసినట్టు వార్తలొచ్చాయి. ఇలాంటి ఘటనలతో రాజ్ భవన్ కు కేసీఆర్ దూరమయ్యారని ఇప్పుడు చర్చ నడుస్తోంది. దూరం పెరిగేందుకు కారణాలున్నాయంటూ.. ప్రచారం సాగుతోంది. మరోవైపు బడ్జెట్ లో తన ప్రసంగం లేకపోవడంపై.. తమిళి సై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్ఎస్ నుంచి వస్తున్న వాదనలు..

కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫార్సు చేస్తూ రాష్ట్ర మంత్రివ‌ర్గం సిఫార్స్ చేసింది. ఈ సిఫార్సుల‌ను గవర్నర్.. ఆమోదించలేదు. తిరస్కరించలేదు. ప్రభుత్వ వ‌ర్గాలు కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆమోదించాల‌ని కోరిన సమయంలో.. కౌశిక్ రెడ్డిపై కేసులున్నాయ‌ని చెప్పారు. అలా గవర్నర్ అనుకుంటే.. దాన్ని రిజ‌క్ట్ చేయాల‌ని చెప్పినా ఆమె చేయ‌లేదు. గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే.. ప్రభుత్వ సిఫార్సు తొక్కిపెట్టిందనే వాదనలు వినిపించాయి.

శాస‌న‌మండ‌లికి ప్రొటెం ఛైర్మన్ గా ఎంఐఎం స‌భ్యుడు, సీనియ‌ర్ జ‌ర్నలిస్ట్ అమీనుల్ జాఫ్రీని రిక‌మండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ ను గవర్నర్ పంపించింది. అయితే, గవర్నర్ దీనిపై నిర్ణయం తీసుకోకుండా.. డైరెక్ట్‌గా ఛైర్మన్ ఎన్నిక పెట్టాలని.. సలహా ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై.. ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లోని.. ప్రోటెం ఛైర్మన్ గా కొన్ని నెలల పాటు.. ఉన్న సమచారాన్ని.. ప్రభుత్వం.. గవర్నర్ కు ఇచ్చింది. అప్పుడు జాఫ్రీని ప్రొటెం ఛైర్మన్ గా నియమిస్తూ.. ఆమోదం తెలిపారు.

జనవరి 26న సైతం.. కరోనా కారణంగా.. బహిరంగ సభ నిర్వహించొద్దనుకున్నారు. ఇక దీనికి సంబంధించి.. ప్రభుత్వం కూడా.. గవర్నర్ ప్రసంగాన్ని పంపలేదు. అయితే అనూహ్యంగా గవర్నర్ తమిళి సై.. ప్రసంగించారు. ఈ విషయంలోనూ కాస్త దూరం పెరిగినట్టు చెబుతున్నారు.

2021-2022 గ‌వర్నర్ బడ్జెట్లోనూ.. మంత్రిమండ‌లి ఆమోదించ‌ని కొన్ని పేరాల‌ను సొంతంగా చ‌దివారని తెలుస్తోంది. అప్పుడు ప్రభుత్వం కూడా సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించ‌లేదు. ఇలాంటి కొన్ని కారణాల వలనే.. దూరం పెరిగిందని ప్రభుత్వ వర్గాల నుంచి సమాధానం వినిపిస్తోంది.

తమిళి సై ఏమంటున్నారంటే..

"5 నెలల తర్వాత శాసనసభ సమావేశమవుతోంది. సాధారణంగా ఇంత వ్యవధి వస్తే.. దానిని కొత్త సెషన్​ కిందే పరిగణిస్తారు. కానీ ప్రభుత్వం మాత్రం.. ఇది పాత సెషన్​ అని చెబుతోంది. సాంకేతిక కారణాల చెప్పి.. గవర్నర్​ ప్రసంగాన్ని పక్కనపెట్టేసింది. గవర్నర్​ ప్రసంగం అంటే మామూలు విషయం కాదు. ఇదేమీ గవర్నర్​ కార్యాలయానికి సంబంధించిన ప్రసంగం కాదు. ప్రభుత్వంపై గవర్నర్​ ఇచ్చే నివేదిక. ఏడాది కాలంలో.. ప్రభుత్వ ఘనతలు, కార్యకలాపాలపై గవర్నర్​ తన ప్రసంగం ద్వారా రిపోర్ట్​ కార్డు సమర్పిస్తారు. ప్రసంగంలోని అంశాలు, ప్రభుత్వ యంత్రాంగంపై అన్ని పక్షాలు అర్థవంతమైన చర్చలు జరిపేందుకు ఇదే మూలం. అలాంటి గవర్నర్​ ప్రసంగాన్ని టీఆర్​ఎస్​ ప్రభుత్వం పక్కనపెట్టేసింది," అని తమిళిసై అన్నారు.

బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై లేకపోవడంపై ప్రతిపక్షాలు సైతం మండిపడుతున్నాయి. కేసీఆర్ నియంతృత్వ ధోరణికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నాయి. ఏది ఏమైనా.. ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు మధ్య.. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండి.. సఖ్యతతో పని చేసుకుంటేనే మంచిది. ముందు ముందు.. ఇక చూడాలి.. రాజ్ భవన్ కు ప్రగతి భవన్ కు ఇంకా దూరం పెరుగుతుందో.. లేదా.. అన్నీ సమసిపోయి.. దగ్గరవుతుందో..!

IPL_Entry_Point