Hyderabad Police : ట్రోలర్స్ కు షాక్.. 20 ఛానళ్లపై కేసులు, 8 మందికి నోటీసులు
Cases Against Trolling channels : సోషల్ మీడియాలో అసభ్యకర ట్రోల్స్ చేస్తున్న పలు ఛానళ్లపై చర్యలు చేపట్టారు హైదరాబాద్ పోలీసులు. 20 మందిపై కేసులు నమోదు చేశామని.... 8మందికి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా వివరాలను వెల్లడించారు.
Cases against Trolling Channels: పలు ట్రోలింగ్ ఛానళ్లకు షాక్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. అసభ్యకరమైన పోస్టులు చేసిన 20 ఛానళ్లపై కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా వెల్లడించారు. మరో 8 మందికి 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ 'ట్రోలర్స్'లో ఎక్కువ మంది 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువకులేననీ చెప్పారు.
కొందరు ప్రజాప్రతినిధులపై మార్ఫింగ్ వీడియోలతో అభ్యంతరకర, పరువు నష్టం కలిగించే కంటెంట్ ను పోస్ట్ చేస్తున్నారని డీసీపీ స్నేహా మెహ్రా పేర్కొన్నారు. సబ్‌స్క్రైబర్లను పెంచుకోవడం, ఎక్కువ వ్యూస్ రావటం కోసం ఇలాంటివి చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. మార్ఫింగ్ చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ కవితను కించపర్చే విధంగా ట్రోలింగ్ జరిగిందని... ఆ ట్రోలర్ ను కూడా గుర్తించామని చెప్పారు.
అరెస్ట్ అయినవారిలో అట్టాడ శ్రీనివాస రావు, చిరసాని మణికంఠ, బద్దంజి శ్రవణ్, మోతం శ్రీను,పెరిక నాగవెంకట కిరణ్, వడ్లూరి నవీన్, బొల్లి చంద్రశేఖర్, బిల్ల శ్రీకాంత్ ఉన్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఉండగా… మరికొందరు తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. ప్రధానంగా మహిళలను కించపరిచే విధంగా ట్రోల్స్, మీమ్స్ చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.