Gujarath Paper Leak : గుజరాత్‌లో పరీక్ష…హైదరాబాద్‌లో లీక్….-gujarath panchayati junior clerk recruitment exam cancelled paper leaked in hyderabad printing press ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Gujarath Panchayati Junior Clerk Recruitment Exam Cancelled Paper Leaked In Hyderabad Printing Press

Gujarath Paper Leak : గుజరాత్‌లో పరీక్ష…హైదరాబాద్‌లో లీక్….

హైదరాబాద్‌లో పేపర్ లీక్ గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల రద్దు
హైదరాబాద్‌లో పేపర్ లీక్ గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల రద్దు (unsplash)

Gujarath Paper Leak గుజరాత్‌లో ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రాలను హైదరాబాద్‌లో లీక్ చేయడంతో పరీక్షలు రద్దయ్యాయి. గుజరాత్ పంచాయితీ జూనియర్ క్లర్క్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రాలను హైదరాబాద్‌ ప్రింటింగ్ ప్రెస్‌లో లీక్ చేసినట్లు గుజరాత్ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన పరీక్షను రద్దు చేశారు.

Gujarath Paper Leak ప్రశ్రాపత్రాలను ముద్రించే సంస్థ నుంచి పత్రాలు ముందే బయటకు రావడంతో అదికారులు పరీక్షల్ని రద్దు చేశారు. గుజరాత్‌లో పంచాయతీ జూనియర్‌ క్లర్క్‌ నియామకాల కోసం చేపట్టిన పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం హైదరాబాద్‌లో ముందే లీక్‌ అయింది.

ట్రెండింగ్ వార్తలు

మొత్తం 1,181 పోస్టులకు సుమారు 9.53 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఆదివారం ఈ పరీక్ష జరగాల్సి ఉంది. ఆదివారం తెల్లవారు జామున ఓ ముఠా దగ్గర ప్రశ్న పత్రం ఉందని పోలీసులు గుర్తించారు. దీంతో పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. హైదరాబాద్‌ ఐడీఏ బొల్లారంలోని కేఎల్‌ హైటెక్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌‌కు ప్రశ్నాపత్రాల ముద్రణ కాంట్రాక్టు ఇచ్చారు. ఇక్కడి నుంచి ప్రశ్నపత్రం బయటకొచ్చినట్లు గుర్తించారు.

గుజరాత్‌ ఉగ్రవాద వ్యతిరేక దళానికి చెందిన పోలీసు అధికారులు ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో మొత్తం 15 మందిని అరెస్టు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు ప్రదీప్‌ నాయక్‌‌తో పాటు, కేతన్‌ బరోట్‌, హైదరాబాద్‌లోని కేఎల్‌ హైటెక్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉద్యోగి జీత్‌ నాయక్‌, భాస్కర్‌ చౌదరి, రిద్ధి చౌదరి ఉన్నారు. వీరిలో 10 మంది గుజరాత్‌కు చెందిన వారు ఉన్నారు. ప్రదీప్‌ నాయక్‌ ఒడిశాకు చెందిన వ్యక్తి. ప్రదీప్‌ నాయక్‌ నుంచి రాబట్టిన సమాచారంతో ప్రశ్నపత్రాల లీక్‌కు కేఎల్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ ఆపరేటర్‌ సర్దార్కర్‌ రోహా సహకరించినట్లు ఏటీఎస్ పోలీసులు నిర్ధరించుకున్నారు.

గుజరాత్‌కు చెందిన కేతన్‌ బరోట్‌ స్వరాష్ట్రంలో దిశా, ఇండోక్టినేషన్‌ కన్సల్టెన్సీల పేరుతో బోగస్‌ అడ్మిషన్లు, ప్రశ్నపత్రాల లీకేజీ కార్యకలాపాలు సాగిస్తున్నాడు. గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు ఆదివారం 10-11 గంటల మధ్య కేఎల్‌ హైటెక్‌ సెక్యూర్‌ ప్రింటింగ్‌ లిమిటెడ్‌ సంస్థలో తనిఖీలు నిర్వహించారు.

ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగి సర్దార్కర్‌ రోహాతో పాటు జీత్‌ నాయక్‌, మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నపత్రాలు నగరంలో తయారవుతున్న విషయం ఎలా బయటకు పొక్కింది? ప్రధాన నిందితులతో ఆపరేటర్‌కు ఉన్న పరిచయాలు, సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగుల ప్రమేయం తదితర అంశాలపై వారు కూపీ లాగుతున్నారు. జూబ్లీహిల్స్‌లోని కేఎల్‌ హైటెక్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ ప్రధాన కార్యాలయంలోనూ తనిఖీ చేపట్టారు. గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగల్ని కూడా ఈ వ్యవహారంలో ప్రశ్నించనున్నారు.

WhatsApp channel

టాపిక్