Teachers Protests : ఆగని టీచర్ల ఆందోళనలు.. స్థానికత ఆధారంగా బదిలీలకు డిమాండ్-government teachers in telangana protest for spouse transfers and against 317 go ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Teachers Protests : ఆగని టీచర్ల ఆందోళనలు.. స్థానికత ఆధారంగా బదిలీలకు డిమాండ్

Teachers Protests : ఆగని టీచర్ల ఆందోళనలు.. స్థానికత ఆధారంగా బదిలీలకు డిమాండ్

Thiru Chilukuri HT Telugu
Jan 23, 2023 06:27 PM IST

Teachers Protests : స్పౌజ్ ట్రాన్స్ ఫర్స్.. 317 జీవో రద్దు కోసం డిమాండ్ చేస్తూ.. రాష్ట్రంలో టీచర్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని కోరుతూ.. ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి రోడ్డెక్కుతున్నారు. మరోవైపు.. టీచర్ల ఆందోళనలకు విపక్షాలు మద్దతు పలికాయి. 317 జీవోను రద్దు చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాయి.

టీచర్ల ఆందోళనలు
టీచర్ల ఆందోళనలు

Teachers Protests : రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల వ్యవహారం రచ్చ రేపుతోంది. జనవరి 27 నుంచి ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం సమాయత్తం అయిన వేళ... ఉపాధ్యాయులు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కుతున్నారు. స్పౌజ్ బదిలీలు చేపట్టాలని.. 317 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. శనివారం 13 జిల్లాల ఉపాధ్యాయ దంపతులు... హైదరాబాద్ లోని విద్యాశాఖ కమిషనర్, సంచాలకుల కార్యాలయం ముట్టడికి యత్నించిన విషయం తెలిసిందే. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన టీచర్ దంపతులు... పిల్లలతో కలిసి నిరసనకు దిగారు. స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని కోరుతూ ఉపాధ్యాయులు తమ పిల్లలతో కలిసి ఆదివారం మరోసారి ఆందోళనకు దిగారు. జీవో 317ను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేస్తూ... ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకోవడంతో... ఆ ప్రాంతంలో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది.

ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించాయి. బడిలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు.. ఒడిలో బిడ్డలతో సహా గోషామహల్ పోలీస్ స్టేషన్ లో బందీలయ్యారని.. 317 జీవో రద్దు కోసం డిమాండ్ చేయడమే వారు చేసిన నేరమా అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణకు ఈ నియంత పాలన అవసరమా ? అని ప్రశ్నించారు. స్పౌజ్ టీచర్లు.. 317 బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ... సోమవారం బీజేవైఎం ప్రగతి భవన్ ముట్టడికి యత్నించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేవైఎం శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనకారులను అరెస్టు చేసి గోషామహల్ పీఎస్ కు తరలించారు.

ఉపాధ్యాయుల ఆందోళనల నేపథ్యంలో 317 జీవోను తప్పనిసరిగా సవరించాల్సిందే అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. జీవో వల్ల టీచర్లు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్న ఆయన... ఆవేదనతో ఇప్పటికే 34 మంది టీచర్లు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు జీతాలు అడ్డుకునే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. పాఠశాలల్లో స్కావెంజర్లను తీసేశారని... టీచర్లు బాత్‌రూమ్‌లు కడగాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో పీఆర్సీలు లేవు.. డీఏలు లేవు.. పదోన్నతులు లేవని మండిపడ్డారు. టీచర్ల విషయంలో కేసీఆర్ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ బదిలీలో అక్రమాలు జరుగుతున్నాయన్న సంజయ్... మరోసారి సకల జనుల సమ్మె తరహా పరిస్థితులు వస్తున్నాయని హెచ్చరించారు. జీవో 317పై టీచర్ల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసు ఉద్యోగాల నియామకాలు సరిగ్గా జరగడం లేదని ఆరోపించారు.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న టీచర్లు... స్పౌజ్ విభాగంలో బదిలీల కోసం కొంతకాలంగా నిరీక్షిస్తున్న విషయం తెలిసిందే. 2021లో స్పౌజ్ ట్రాన్స్ ఫర్లు చేపట్టిన ప్రభుత్వం.. కేవలం 19 జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకే అవకాశం కల్పించింది. మిగతా 13 జిల్లాల వారీగా అప్పట్లో స్పౌజ్ ట్రాన్స్ ఫర్స్ కి ఛాన్స్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో.. సుదీర్ఘకాలంగా వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ దంపతులు.. ప్రభుత్వం ఈసారి చేపట్టనున్న బదిలీల్లో తమకూ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ అంశంలో సర్కార్ నుంచి స్పష్టత లేకపోవడంతో... ఆందోళన బాట పట్టారు.

ఇక గత సంవత్సరం జీవో 317 అమలులో భాగంగా.. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సర్దుబాటు చేసిన సర్కార్.. కొంత మందిని ఇతర జిల్లాలకు కేటాయించింది. సర్దుబాటులో తమ స్థానికతను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం బదిలీలకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం... 317 జీవో కింద ఇతర జిల్లాలకు ట్రాన్స్ ఫర్ అయిన వారి అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. వీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అయి ఏడాది కూడా పూర్తికాలేదు. ట్రాన్స్ ఫర్స్ కి దరఖాస్తు చేసుకోవాలంటే రెండేళ్ల కనీస సర్వీసు ఉండాలన్న నిబంధన ఉంది. అలా ఉన్న వారే బదిలీలకు అర్హులవుతారు. ఈ నేపథ్యంలో... ఇప్పుడు చేపట్టబోయే బదిలీల్లో తమను కూడా పరిగణలోకి తీసుకోవాలని, రెండేళ్ల కనీస సర్వీసు నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని.... స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

బదిలీల నియమ, నిబంధనలతో కూడిన షెడ్యూల్ ను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోన్న ప్రభుత్వం... స్పౌజ్ ట్రాన్స్ ఫర్స్, 317 జీవో రద్దు డిమాండ్ల విషయంలో ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. షెడ్యూల్ వెలువరించిన తర్వాత అందులో పేర్కొన్న నిబంధనలను బట్టి ఇలాంటి మరికొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. వాటితో ఎవరైనా కోర్టుకి వెళితే మొత్తం ప్రక్రియకు ఇబ్బంది అవుతుందని.. సాధ్యమైనంత వరకు ఆ పరిస్థితి రాకుండా చూసేందుకు సర్కార్ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోందని తెలుస్తోంది.

IPL_Entry_Point