Siddipet Accident : సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి-five killed one injured after car crashes into huge pit in siddipet district
Telugu News  /  Telangana  /  Five Killed, One Injured After Car Crashes Into Huge Pit In Siddipet District
సిద్ధిపేటలో ప్రమాదం
సిద్ధిపేటలో ప్రమాదం

Siddipet Accident : సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి

10 January 2023, 21:51 ISTHT Telugu Desk
10 January 2023, 21:51 IST

Siddipet Accident : సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగదేవ్ పూర్ మండలం మునిగడపలో కారు గుంతలో పడి... ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Siddipet Accident : సిద్ధిపేట జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. జగదేవ్ పూర్ లో ప్రమాదవశాత్తూ కారు గుంతలో పడి ఐదుగురు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మండలంలోని మునిగడప శివారు మల్లన్న గుడి మూల మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. టర్నింగ్ వద్ద అదుపు తప్పిన కారు.. గుంతలో పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు... వెంటనే గుంతలోకి దిగి ప్రయాణికులని రక్షించే ప్రయత్నం చేశారు. కారులో చిక్కుకున్న వారందరినీ బయటకి తీసుకొచ్చారు. అయితే... అప్పటికే ఐదుగురు మృతి చెందారు. మరొక వ్యక్తి... ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా.. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన వారందరూ.. ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. మృతి చెందిన వారిలో దంపతులు, ఇద్దరు పిల్లలు, మరో మహిళ ఉన్నారు.

నల్గొండ జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని ఆరు మంది.. మంగళవారం వేములవాడ దర్శనానికి వచ్చారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత నల్గొండకు తిరుగు ప్రయాణమయ్యారు. జగదేవ్ పూర్ మండలంలోని మునిగడప శివారులో ఉన్న మల్లన్న గుడి మూల మలుపు వద్దకు రాగానే కారు అదుపు తప్పి... పక్కనే ఉన్న పెద్ద గుంతలో పడిపోయింది. లోతు ఎక్కువగా ఉండటం కారణంగా అడుగు భాగాన్ని కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు... కారులో ఉన్న వారిని రక్షించేందుకు వెంటనే గుంతలోకి దిగారు. అయితే.. కారులో ఉన్న సమ్మయ్య, రాజమణి, స్రవంతి, భవ్య శ్రీ, లోకేశ్ అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్ ని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాద ఘటనపై మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపిన మంత్రి.. గాయపడిన వెంకటేశ్ కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్, పోలీస్ కమిషనర్ కు ఆదేశించారు. పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాలను స్వగ్రామం తరలించాలని చెప్పారు.