Amit Shah : మార్చి 11న హైదరాబాద్ కు అమిత్ షా.. ఇదే నెలలో కీలక నేతల పర్యటనలు ?
Amit Shah : కేంద్ర మంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణకు రానున్నారు. మార్చి 11న హైదరాబాద్ కు రానున్న ఆయన... 12న హకీంపేటలో అధికారిక కార్యక్రమంలో పాల్గొనున్నారు. పర్యటనలో భాగంగా రాష్ట్ర పార్టీ కోర్ కమిటీతో షా భేటీ కానున్నారు.
Amit Shah : బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి రాష్ట్రానికి రానున్నారు. మార్చి 11న ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. మార్చి 12న ఉదయం హకీంపేటలో జరిగే అధికారిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ టూర్ లోనే.. రాష్ట్ర పార్టీ కోర్ కమిటీతో అమిత్ షా భేటీ అవుతారని సమాచారం. మేధావులతోనూ ప్రత్యేకంగా సమావేశమవుతారని... ఈ కార్యక్రమం సంగారెడ్డి వేదికగా జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 10న జాతీయ పోలీస్ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొనేందుకు అమిత్ షా హైదారాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన ఆయన.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై నేతలను ఆరా తీశారు. గత నెల చివరి వారంలో ముఖ్య నేతలను ఢిల్లీకి పిలిపించి.. మాట్లాడారు. కీలక నేతలంతా సమన్వయంతో ముందుకు సాగాలని... బీఆర్ఎస్ పై ఐక్యంగా పోరాడలని దిశానిర్దేశం చేశారు.
ట్రెండింగ్ వార్తలు
ఇక.. ఇదే నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ లో పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని తెలుస్తోంది. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని... రాష్ట్ర నూతన సచివాలాయన్ని ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నేతలు కూడా పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రధాని మోదీ సభ ఏ తేదీన ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. సచివాలయం ప్రారంభోత్సవానికి ముందే బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తారా లేక... ఆ తర్వాత నిర్వహించి బీఆర్ఎస్ కి కౌంటర్ ఇస్తారా అన్నది చర్చనీయాంశమైంది.
మరోవైపు.. మార్చి, ఏప్రిల్ లో జాతీయ, రాష్ట్ర ముఖ్య నాయకులు ముమ్మరంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్ర పార్టీలో ముఖ్య నేతల మధ్య సమన్వయం తీసుకురావడంపై ప్రధానంగా దృష్టి సారించిన జాతీయ నాయకత్వం.. ఈ మేరకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ పై వ్యతిరేకత ఉందని... బీజేపీకి అవకాశాలు పెరుగుతున్నాయని.. వాటిని అందిపుచ్చుకునేందుకు నేతలంతా ఐక్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే.. రాష్ట్రానికి రానున్న ముఖ్య నేతలు.. పార్టీ కార్యక్రమాల అమలు తీరుపై మరింత పరిశీలన చేయనున్నారు. పార్టీలో చేరికలపై కొంతకాలంగా స్తబ్దత నెలకొన్నందున... ఈ అంశంలోనూ వేగం పెంచడంపై దృష్టి సారించనున్నారు.