CBI on MLAs Case : సీబీఐ ఢిల్లీ విభాగానికి ఎమ్మెల్యేలకు ఎర కేసు.. తదుపరి ఏం జరగనుంది ?-cbi handovers telangana mlas poaching case to delhi cbi wing ts high court orders to wait till january 9th for sit files ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cbi Handovers Telangana Mlas Poaching Case To Delhi Cbi Wing Ts High Court Orders To Wait Till January 9th For Sit Files

CBI on MLAs Case : సీబీఐ ఢిల్లీ విభాగానికి ఎమ్మెల్యేలకు ఎర కేసు.. తదుపరి ఏం జరగనుంది ?

Thiru Chilukuri HT Telugu
Jan 06, 2023 08:01 PM IST

CBI on MLAs Case : ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు ఆదేశాలతో ఇప్పటికే కేసు స్టడీ ప్రారంభించిన సీబీఐ.. విచారణ బాధ్యతలను ఢిల్లీ విభాగానికి అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. సిట్ నుంచి వివరాలు కావాలని సీఎస్ కు లేఖ రాశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం కోర్టు దృష్టి తీసుకెళ్లగా.. సోమవారం వరకు సిట్ ఫైళ్ల కోసం ఒత్తిడి చేయవద్దని సీబీఐని ఆదేశించింది.

ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐ ఢిల్లీ విభాగానికి అప్పగింత
ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐ ఢిల్లీ విభాగానికి అప్పగింత

CBI on MLAs Case : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తుని తన ఆధీనంలోకి తీసుకొని... విచారణ ప్రారంభించేందుకు సీబీఐ రంగం సిద్ధం చేస్తోంది. కేసుని కేంద్ర దర్యాప్తు బృందానికి అప్పగిస్తూ.. హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.... కేసు పూర్వాపరాలు పరిశీలించిన సీబీఐ డైరెక్టర్.... ఈ కేసు బాధ్యతలను ఢిల్లీ విభాగానికి అప్పగించారు. దీంతో.. వివరాల సేకరణ కోసం ఢిల్లీ ఎస్పీ నేతృత్వంలోని బృందం.. హైదరాబాద్ కు వచ్చింది. ఈ కేసుని దర్యాప్తు చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి కేసు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. అయితే.. కేసుని సీబీఐకి అప్పగించడాన్ని సవాలు చేస్తూ.. డివిజన్ బెంచ్ లో సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం... సీబీఐ అధికారులు కేసు సమాచారం అడుగుతున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. దీంతో... సోమవారం వరకు కేసు ఫైళ్ల కోసం ఒత్తిడి చేయవద్దని హైకోర్టు సీబీఐని ఆదేశించింది.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్రంలో కలకలం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసుని సీబీఐకి అప్పగిస్తూ ఇటీవల హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీంతో.. రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఉనికి కోల్పోయింది. ఏక సభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం, సిట్ హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీలు చేశాయి. ఈ పటిషన్ పై విచారణ జరుగుతోంది. ఈ సమయంలోనే... గత తీర్పు ఆధారంగా ఇప్పటికే కేసు స్టడీని మొదలు పెట్టిన సీబీఐ... పూర్తి సమాచారం కోసం సిట్ నుంచి ఫైళ్లు సేకరించాలని భావించింది. ఇందులో భాగంగా... 3 రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకున్న సీబీఐ బృందం... ఈ కేసులో ఇప్పటి వరకు ప్రత్యేక దర్యాప్తు బృందం సేకరించిన సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు లేఖ రాసింది. వాటి ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. కేసు దర్యాప్తులో తదుపరి చర్యలు ప్రారంభించాలని భావించింది.

ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పై శుక్రవారం విచారణ జరుగగా... కేసు ఫైల్స్ కోసం సీఎస్ కు లేఖ రాసిన విషయాన్ని సీబీఐ కోర్టుకు తెలిపింది. సిట్ సేకరించిన పత్రాలు, ఆధారాలు, ఇతర సమాచారం ఇస్తే విచారణకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ప్రభుత్వం, సిట్ చేసిన అప్పీల్ హైకోర్టు డివిజన్ బెంచ్ లో విచారణలో ఉండగానే.. సీబీఐ కేసు ఫైళ్లు కోరడంపై .. అడ్వకేట్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు ఫైల్స్ కోసం సీబీఐ ఒత్తిడి చేస్తోందని తెలిపారు. ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదిస్తోన్న సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనల కోసం ప్రభుత్వం సోమవారం వరకు గడువు కోరింది. ఈ నేపథ్యంలో... సోమవారం వరకు ఫైళ్ల కోసం ఒత్తిడి చేయవద్దని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా.. ఇరు పక్షాల న్యాయవాదులు ప్రస్తావించిన అంశాలపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం... బీజేపీ, బీఆర్ఎస్ అంశాలు బయటే చూసుకోవాలని వ్యాఖ్యానించింది. అనంతరం.. విచారణను జనవరి 9(సోమవారం)కి వాయిదా వేసింది. కేసు దర్యాప్తు మొదలుపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకున్న సీబీఐ... సోమవారం స్పష్టత వచ్చాక ఎఫ్ఐఆర్ నమోదు చేసే దిశగా కసరత్తు చేస్తోంది.

IPL_Entry_Point