Telangana BJP : తెలంగాణలో గెలవాల్సిందే..బీజేపీ నేతలకు అమిత్‌షా మార్గనిర్దేశం-bjp top leader amith shah meets with telangana bjp leaders in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Bjp Top Leader Amith Shah Meets With Telangana Bjp Leaders In Hyderabad

Telangana BJP : తెలంగాణలో గెలవాల్సిందే..బీజేపీ నేతలకు అమిత్‌షా మార్గనిర్దేశం

HT Telugu Desk HT Telugu
Mar 13, 2023 07:36 AM IST

Telangana BJP ఈ ఏడాది చివరిలో జరిగే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణలో రాజకీయ వాతావరణం అనుకూలంగా ఉన్నందున దానిని సద్వినియోగం చేసుకోవాలని, ఇతర పార్టీల నుంచి చేరికల్ని ప్రోత్సహించాలని సూచించారు.

తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా మంతనాలు
తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా మంతనాలు (Hindustan Times)

Telangana BJP తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి పని చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడటంతో పాటు కేంద్రం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణ బీజేపీ నేతలతో ప్రత్యేకంగా చర్చలు జరిపిన అమిత్ షా పలు సూచనలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్‌లతో చర్చించారు. బీజేపీ రాష్ట్ర పార్టీ బాద్యులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్‌ స్థానికంగానే పూర్తి సమయం అందుబాటులో ఉంటున్నందున వారితో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు

బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించడంపై కూడా అమిత్ షా బిజేపీ నేతలతో చర్చించారు. కవితను ఈడీ విచారణకు పిలిచిన నేపథ్యంలో రాజకీయ పరిణామాలపై నేతలతో సమాలోచనలు జరిపారు. బిఆర్‌ఎస్ విమర్శల్ని తిప్పి కొట్టాల్సిందిగా నేతలకు సూచించారు. తెలంగాణలో బీజేపీకి సానుకూల పరిస్థితులు ఉన్నాయని, ప్రణాళిక ప్రకారం ముందుకెళితే గెలుపు కష్టం కాదని వివరించారు. అన్ని నియోజక వర్గాల్లో బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి ప్రణాళికను సిద్దం చేయాలని సూచించారు.

జాతీయ స్థాయిలో పార్టీ నిర్దేశించే కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో ప్రధానంగా రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. జీవో 317కు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన కార్యక్రమాలను బండి సంజయ్ అమిత్‌షాకు వివరించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో బిఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యామ్నయం బీజేపీ అనే అంశాన్ని నేతలంతా దృష్టిలో ఉంచుకోవాలని అమిత్ షా సూచించారు. ఢిల్లీలో జరిగిన సమావేశం తర్వాత రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎలా ఉందనే దానిపై అమిత్ షా ఆరా తీసినట్లు తెలుస్తోంది. త్వరలో మరోసారి రాష్ట్రానికి వస్తానని అప్పుడు విస్తృత స్థాయి సమావేశంలో అందరు నాయకుల అభిప్రాయాలు తెలుసుకుంటానని చెప్పారని బీజేపీ రాష్ట్ర నేతలు తెలిపారు.

మరోవైపు తెలంగాణ బీజేపీ వ్యతిరేక ప్రచారం జరిగితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో సీఐఎస్‌ఎఫ్‌ రైజింగ్‌డేలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర హోంమంత్రి తిరుగు ప్రయానంలో కొచ్చికి వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం కారణంగా నాలుగున్నర గంటలు ఇక్కడే ఉండిపోయారు. ఆ సమయంలోనే సంజయ్, లక్ష్మణ్, కిషన్‌రెడ్డిలతో మంతనాలు జరిపారు.

సీబీఐ, ఈడీ తదితర దర్యాప్తు సంస్థల విచారణలు, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి అరెస్టులు వంటివి అనివార్యంగా జరిగే అవకాశాలు ఉన్నాయని.. అప్పుడు బీజేపీకి ప్రతికూలంగా జరిగే ప్రచారాన్ని ఎండగట్టేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా సూచించినట్టు తెలిసింది. జాతీయ దర్యాప్తు సంస్థల విచారణ, బయటపడుతున్న వాస్తవాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పినట్టు తెలుస్తోంది. కవిత వ్యవహారం నేపథ్యంలో ఎలా వ్యవహరించాలనే దానిపై అమిత్ షా నేతలకు మార్గదనిర్దేశం చేశారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించడం, ఢిల్లీలో, హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ నిరసనలు, కేంద్రాన్ని, ప్రధాని మోదీని తప్పుబడుతూ జరుగుతున్న ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టాలని అమిత్‌షా ఆదేశించినట్టు తెలిసింది. ఈ నెల 16న కవిత మరోసారి ఈడీ విచారణకు హాజరవుతున్నందున.. కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్‌ నేతలపై అవినీతి, అక్రమ ఆరోపణలను విస్తృతంగా ప్రచారం చేసి, బీజేపీకి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని కూడ గట్టాలని సూచించినట్టు తెలుస్తోంది.

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో దర్యాప్తు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించ లేదన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని, .. ఈ కేసులో వాస్తవాలు, ఆధారాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర నేతలకు అమిత్‌షా సూచించినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో బీజేపీకి, ప్రధాని మోదీకి ఎలాంటి సంబంధం లేదని వివరించాలని ఆదేశించినట్టు సమాచారం. నేతలంతా సమష్టిగా ముందుకు సాగాలని, మెరుగైన సమన్వయం అవసరమని నొక్కి చెప్పారని తెలిసింది.

IPL_Entry_Point

టాపిక్