Khammam Politics: పొంగులేటి దారెటు? నేడు బీజేపీ నేతలతో భేటీ-bjp leaders to meet ponguleti srinivasa reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam Politics: పొంగులేటి దారెటు? నేడు బీజేపీ నేతలతో భేటీ

Khammam Politics: పొంగులేటి దారెటు? నేడు బీజేపీ నేతలతో భేటీ

HT Telugu Desk HT Telugu
May 04, 2023 09:10 AM IST

Khammam Politics: ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సస్పెన్స్ కొనసాగుతోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోకి ఎంట్రీ ఖాయమని ప్రచారం జరిగినా, అది ఆచరణలోకి రాలేదు. మరోవైపు నేడు బీజేపీ నేతలు పొంగులేటితో భేటీ కానుండటంతో ఖమ్మం పాలిటిక్స్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది

బీజేపీ నేతలతో భేటీ కానున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి
బీజేపీ నేతలతో భేటీ కానున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Khammam Politics: మాజీ ఎంపీ పొంగులేటి పొలిటికల్ జర్నీపై ఉత్కంఠ కొనసాగుతోంది. గత కొద్ది నెలలుగా ఈ విషయంలో సస్పెన్స్ వీడటం లేదు. బిఆర్‌ఎస్ పార్టీ నుంచి పొంగులేటి, జూపల్లి కృష్ణారావులను సస్పెండ్ చేసిన తర్వాత పొంగులేటి ఏదొక జాతీయ పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్, బీజేపీలలో పొంగులేటి ఎందులో చేరుతారనే దానిపై రకరకాల ప్రచారాలు జరిగాయి. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందంతో కూడా పొంగులేటి చర్చలు జరిపినా అవి కొలిక్కి రాలేదు.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతాపార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. బిఆర్ఎస్‌ వ్యతిరేక శక్తులను తమవైపు తిప్పుకునేలా అడుగులు వేస్తోంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీజేపీ గూటికి రప్పించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో ముఖ్యనేతల బృందం గురువారం ఖమ్మానికి వచ్చి పొంగులేటితో భేటీ కానుంది.

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటితో గురువారం భేటీ కానున్నారు. బిఆర్‌ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత బీజేపీలోకి రావాలని ఈటల రాజేందర్‌ పలుమార్లు పొంగులేటిని ఆహ్వానించినట్లు గతంలోనే ప్రచారం సాగింది. రెండు జాతీయ పార్టీల ముఖ్యనేతలు తనను సంప్రదిస్తున్నారంటూ మాజీ ఎంపీ పలుమార్లు ప్రకటించారు.

తెలంగాణలో బిఆర్‌ఎస్‌ మూడోసారి అధికారంలోకి రానివ్వకుండా.. కేసీఆర్‌ను సీఎం కాకుండా చేసే పార్టీలో చేరుతానని పొంగులేటి గతంలో ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలకు సంబంధించి బిఆర్‌ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని శపథం చేశారు. సునీల్ కనుగోలుతో భేటీ తర్వాత ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతల నుంచి పొంగులేటిపై విమర్శలు వచ్చాయి.

పొంగులేటి పెట్టే షరతులకు తమకు అమోదయోగ్యం కాదని పలువురు నేతలు బహిరంగంగానే తేల్చి చెప్పారు. భట్టి, రేణుకా చౌదర వంటి నాయకులు పొంగులేటి షరతుల్ని తప్పు పట్టారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని ఖమ్మం కాంగ్రెస్‌ నేతలు వ్యతిరేకిస్తున్నారు. పొంగులేటి అవసరం పార్టీకి ఏమాత్రం లేదని, తమకొద్దని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రేణుక చౌదరి సమక్షంలో పొంగులేటికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. తమ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఆయన్ను పార్టీలో చేర్చుకుంటే భవిష్యత్తులో అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

కాంగ్రెస్ నేతల నుంచి భిన్నాభిప్రాయాలు రావడంతో ఆ పార్టీలో చేరే విషయంలో పొంగులేటి పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఖమ్మం నగరంలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం బీజేపీ ముఖ్యనేతలు పొంగులేటితో భేటీ అవుతున్నారు. పొంగులేటి పొలిటికల్ ఎంట్రీపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

IPL_Entry_Point