MLAs Trap: కీలకంగా మారనున్న ఆడియో, వీడియో క్లిప్పులు-audio clips would be crucial in trs mlas trap case in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Audio Clips Would Be Crucial In Trs Mlas Trap Case In Telangana

MLAs Trap: కీలకంగా మారనున్న ఆడియో, వీడియో క్లిప్పులు

HT Telugu Desk HT Telugu
Oct 27, 2022 08:15 AM IST

MLAs Trap: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ ప్రయత్నించిందని టీఆర్ఎస్.. ఇదంతా డ్రామా అని బీజేపీ నిన్న అర్ధరాత్రి వరకు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి.

నిన్న రాత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బండి సంజయ్
నిన్న రాత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బండి సంజయ్

MLAs Trap: నిన్న రాత్రి మొయినాబాద్‌లోని ఫామ్ హౌజ్‌లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కొందరు బేరసారాలు ఆడారని, ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొల్హాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డిలతో మధ్యవర్తులు ఫామ్‌హౌజ్‌లో చర్చలు జరిపారు.

అయితే ఈ మొత్తం వ్యవహారంపై అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 100 కోట్లు ఇచ్చి నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ ప్లాన్ చేసిందని టీఆర్ఎస్ ఆరోపించింది. పోలీసులు ప్రకటన వెలువడిన కొద్దిసేపటికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ చేరుకుని ముఖ్యమంత్రితో మాట్లాడారు.

అయితే ఇదంతా టీఆర్ఎస్ ఆడిన డ్రామా అని, మునుగోడు ఎన్నికల్లో గెలిచేందుకు సానుభూతి అస్త్రాలు ప్రయోగిస్తోందని బీజేపీ నేతలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, రామచంద్రరావు తిప్పికొట్టారు. దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ఈ స్క్రీన్ ప్లేను తీర్చిదిద్దారని, అన్ని ఫుటేజీలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ‘ఫామ్‌హౌజ్‌లో ఉన్న వాళ్లు అంతా టీఆర్ఎస్ వాళ్లే. ఆ నలుగురు ఎమ్మెల్యేలను అర్ధరూపాయికి కూడా ఎవరూ కొనరు. తన పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించేందుకు కేసీఆర్ ఆడిన నాటకమిది.. ఈ నాటకం అంతా త్వరలో కేసీఆర్ మెడకు చుట్టుకుంటుంది.. ’ అని వ్యాఖ్యానించారు.

‘ఆ ఫామ్ హౌజ్ రోహిత్ రెడ్డిదే. మరి పట్టుబడిందని చెబుతున్న ఆ డబ్బు ఎటు వెళ్లింది?’ అంటూ బీజేపీ నేతలు ప్రశ్నించారు.

ఇక మునుగోడులో టీఆర్ఎస్ శ్రేణులు హైవే పై బుధవారం రాత్రి రాస్తారోకో చేశాయి. బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందంటూ మండిపడ్డాయి. చౌటుప్పల్ వద్ద మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు రాస్తారోకోలో పాల్గొన్నారు. దీంతో విజయవాడ రహదారిపై పెద్ద ఎత్తున్న వాహనాలు నిలిచిపోయాయి.

అయితే ఈ కేసులో ఎమ్మెల్యేలు, మధ్య వర్తుల మధ్య సాగిన సంభాషణలతో కూడిన ఆడియో క్లిప్పులు, వీడియో క్లిప్పులు కీలకం కానున్నాయి. ఈ మధ్యాహ్నం పోలీసులు వాటన్నింటినీ బయటపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

నిన్న రాత్రి పలు వీడియో క్లిప్పులు వెలుగులోకి వచ్చినప్పటికీ వాటిలో సంభాషణలు ఏవీ లేవు.

కాగా ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక సభలో మాట్లాడుతూ వరంగల్లు, రంగారెడ్డి, తదితర జిల్లాల నుంచి నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని, మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వెలువడగానే వారి రాకను ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు.

IPL_Entry_Point