Amit Shah @ Muchintal| సనాతనధర్మ పరిరక్షణకు సమతామూర్తి విగ్రహమే ప్రేరణ: అమిత్ షా-amit shah visits statue of equality at hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Amit Shah Visits Statue Of Equality At Hyderabad

Amit Shah @ Muchintal| సనాతనధర్మ పరిరక్షణకు సమతామూర్తి విగ్రహమే ప్రేరణ: అమిత్ షా

HT Telugu Desk HT Telugu
Feb 08, 2022 09:39 PM IST

ముచ్చింతల్‌లో జరుగుతున్న రామానుజాచార్య సహస్రాబ్ది సమరోహంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈరోజు పాల్గొన్నారు. ఇక్కడకు రావడం అదృష్టంగా భావిస్తున్నాని ఆయన అన్నారు. సమతామూర్తి దర్శనం తనకు ఆత్మానందాన్ని కలిగించిందన్నారు.

ముచ్చింతల్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా
ముచ్చింతల్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Twitter)

Hyderabad |ముచ్చింతల్‌లో జరుగుతున్న రామానుజాచార్య సహస్రాబ్ది సమరోహంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈరోజు పాల్గొన్నారు. ఆశ్రమంలో కొలువుదీరిన సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. అలాగే 108 దివ్యదేశాలను సందర్శించారు. శ్రీరామానుజుల జీవితచరిత్రకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం త్రీడీ లేజర్‌ షోను వీక్షించారు. సమతామూర్తి ప్రాంగణానికి సంబంధించిన అన్ని విశేషాలను చిన్నజీయర్ స్వామి, మైహోంగ్రూప్‌ అధినేత రామేశ్వరరావు దగ్గరుండి మరీ అమిత్ షాకు వివరించారు. ఈ సందర్భంగా రామానుజాచార్యుల విగ్రహం దగ్గర టికెట్ కౌంటర్‌ను, థియేటర్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు.

ఇక యాగశాలలో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువులో భాగంగా నిర్వహించే నిత్య పూర్ణాహుతిలో అమిత్‌ షా పాల్గొన్నారు . ప్రధాన యాగశాలలో పూజలు చేశారు. అనతంతరం అమిత్‌ షాను చిన్నజీయర్ స్వామి సన్మానించి ఆయనకు మంగళ శాసనాలు అందించారు.

అనంతరం ప్రవచన మండపంలో భక్తులను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించారు. రామనగరం సందర్శన తనకు సరికొత్త అనుభవాన్ని ఇచ్చిందని, ఇక్కడకు రావడం అదృష్టంగా భావిస్తున్నాని షా అన్నారు. సమతామూర్తి దర్శనం తనకు ఆత్మానందాన్ని కలిగించిందన్నారు. సమతామూర్తి విగ్రహం ప్రపంచానికి ఏకతా సందేశం ఇస్తోందన్నారు. యుగయుగాల వరకు సనాతనధర్మ పరిరక్షణకు సమతామూర్తి విగ్రహం ప్రేరణగా నిలుస్తుందని హోంమంత్రి చెప్పారు. ప్రాణకోటి అంతా సమానమేనని రామానుజచార్యుల జీవితం ఇచ్చే సందేశం.. ఈ సమతామూర్తి సందేశం విశ్వవ్యాప్తం కావాలి అని ఆకాంక్షించారు. రామానుజాచార్యుల బోధనలు అన్ని వర్గాలకు ఆదర్శమని అమిత్‌ షా అన్నారు.

రామానుజాచార్యులు మధ్యే మార్గంగా విశిష్టాద్వైతాన్నిసూచిస్తూ.. దేశంలో ఐక్యతను సాధించేందుకు కృషిచేశారన్నారు అమిత్‌ షా. సర్వస్వం భగవంతునికి సమర్పించిన వారందరికీ మోక్షం పొందే హక్కు ఉందని రామానుజాచార్యులు బోధించారన్నారు. సమతామూర్తి భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. దేశంలోని అన్నిభాషల్లో సమతామూర్తి సందేశాలను అందించాలన్నారు. రామానుజాచార్యులు రాసిన శ్రీ భాష్యం, వేదాంత సంగ్రహం సహా తొమ్మిది గ్రంథాలు అత్యంత ఆదరణ పొందాయన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషిచేస్తోన్న చిన్నజీయర్ స్వామిని తాను అభినందిస్తున్నట్లు అమిత్‌ షా చెప్పారు. ఆయన చేపట్టిన ఈ మహాయాగం వేల ఏళ్లు నిలిచిపోతుందదన్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం