WPL Players Auction: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం కోసం 1000 మంది క్రికెటర్లు
WPL Players Auction: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం కోసం 1000 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ వేలం ఫిబ్రవరి 13న జరగనుండగా.. తొలి డబ్ల్యూపీఎల్ (WPL) మార్చిలో జరిగే అవకాశం ఉంది.
WPL Players Auction: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభానికి ముందే విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తోంది. మీడియా హక్కుల వేలమైనా, తర్వాత ఫ్రాంఛైజీల కోసం వచ్చిన బిడ్లు అయినా సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ఇప్పుడు అందరి కళ్లూ ఫిబ్రవరి 13న జరగబోయే ప్లేయర్స్ వేలంపై ఉన్నాయి. ఈ వేలంలో ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో చూడాలన్న ఆసక్తి నెలకొంది.

అయితే ఈ వేలం కోసం ప్రపంచవ్యాప్తంగా సుమారు 1000 మంది మహిళా క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు న్యూస్18 క్రికెట్ నెక్ట్స్ వెల్లడించింది. కానీ వీళ్లలో నుంచి కేవలం 100 నుంచి 120 మంది ప్లేయర్స్ మాత్రమే అమ్ముడయ్యే అవకాశం ఉంది. తొలి డబ్ల్యూపీఎల్ లో కేవలం ఐదు టీమ్స్ మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్లేయర్స్ వేలం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో జరగనుంది.
ఇక గతేడాది ఐపీఎల్ మెగా వేలం జరిగినప్పుడు కూడా ఇలాగే మొత్తం 1214 మంది ప్లేయర్స్ నమోదు చేసుకున్నారు. ఆ లిస్ట్ ను 600 మందికి పరిమితం చేయగా.. చివరికి అన్ని ఫ్రాంఛైజీలు కలిపి 278 మంది ప్లేయర్స్ ను మాత్రమే కొనుగోలు చేశాయి. తొలి డబ్ల్యూపీఎల్ కు మాత్రం ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. డబ్ల్యూపీఎల్ వేలం కోసం 1000 మంది ప్లేయర్స్ నమోదు చేసుకున్నారని, ఇండియా నుంచే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ విపరీతమైన స్పందన వచ్చినట్లు లీగ్ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటికైతే బీసీసీఐ నుంచి అధికారికంగా వేలం ఏ రోజు అన్న ప్రకటన వెలువడలేదు. అయితే ఫిబ్రవరి 13న జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 13 మధ్య తేదీల కోసం తాము సిద్ధమవుతున్నామని, దీనిపై బీసీసీఐ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని ఓ ఫ్రాంఛైజీ అధికారి చెప్పినట్లు న్యూస్18 వెల్లడించింది.
ఇక ఇప్పటికే మీడియా హక్కులు, ఫ్రాంఛైజీల కోసం బిడ్లు పూర్తవగా.. టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం కూడా బీసీసీఐ చూస్తోంది. ఐదేళ్ల కాలానికిగాను ఈ హక్కులు విక్రయించనున్నారు. డబ్ల్యూపీఎల్ లో అహ్మదాబాద్ టీమ్ గుజరాత్ జెయింట్స్ తో పాటు ముంబై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో టీమ్స్ ఉన్న విషయం తెలిసిందే.
సంబంధిత కథనం
టాపిక్