Virat Kohli Records: కోహ్లీ అరుదైన ఘనత.. ద్రవిడ్, గవాస్కర్‌ను అధిగమించిన రన్నింగ్ మెషిన్-virat kohli surpasses rahul dravid and sunil gavaskar with long awaited fifty against australia ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Virat Kohli Surpasses Rahul Dravid And Sunil Gavaskar With Long Awaited Fifty Against Australia

Virat Kohli Records: కోహ్లీ అరుదైన ఘనత.. ద్రవిడ్, గవాస్కర్‌ను అధిగమించిన రన్నింగ్ మెషిన్

Maragani Govardhan HT Telugu
Mar 11, 2023 07:18 PM IST

Virat Kohli Records: అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో 4 వేల పరుగుల మైలురాయిని వేగంగా అందుకున్న మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (PTI)

Virat Kohli Records: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత ఆటగాళ్లు నిలకడగా రాణిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు నష్టపోయిం 289 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ అద్భుత సెంచరీతో ఆకట్టుకోగా.. టీమిండియా రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. దీంతో కోహ్లీ 14 నెలల తర్వాత టెస్టుల్లో అర్ధశతకం చేసినట్లయింది. జనవరి 2022 తర్వాత కోహ్లీ ఇంతవరకు టెస్టుల్లో హాఫ్ సెంచరీ చేయలేదు. దాదాపు 16 ఇన్నింగ్సుల తర్వాత ఈ ఘనత సాధించాడు. గతేడాది జనవరిలో సౌతాఫ్రికాపై అర్ధశతకం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

ఇది కాకుండా విరాట్ ఈ మ్యాచ్‌లో మరో అరుదైన ఘనత అందుకున్నాడు. స్వదేశంలో 4 వేల పరుగులు చేసిన భారత క్రికెటర్ల జాబితాలో చేరిపోయాడు. ఈ ఘనత సాధించిన ఐదో ఇండియన్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. కోహ్లీ కంటే ముందు సచిన్ తెందూల్కర్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ ఈ ఘనత సాధించారు. అంతేకాకుండా స్వదేశంలో వేగంగా 4 వేల పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి కంటే ముందు సెహ్వాగ్, తెందూల్కర్ ఉన్నారు. అయితే సగటు విషయంలో మాత్రం కోహ్లీదే అగ్రస్థానం. అతడు 58.82 సగటుతో ఈ రికార్డు అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ 235 బంతుల్లో 128 పరుగులతో ఆకట్టుకోగా.. కోహ్లీ 59 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు రవీంద్ర జడేజా ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. అంతేకాకుండా తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 480 పరుగుల లక్ష్యాన్ని అధిగమించేందుకు మరో 191 పరుగుల దూరంలో ఉన్నారు. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(180), కామెరూన్ గ్రీన్ శతకాలు సాధించడంతో ఆ జట్టు భారీ స్కోరు చేయగలిగింది.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఒకవేళ నాలుగో టెస్టులో టీమిండియా గెలిస్తే ఫలితం 3-1గా మారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు దూసుకెళ్తుంది. ఒకవేళ ఓడితే ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంక-న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌పై ఫలితం ఆధారపడి ఉంటుంది. శ్రీలంక కానీ 2-0 తేడాతో సిరీస్ గెలిస్తే ఆ దేశం ఆస్ట్రేలియాతో కలిసి డబ్ల్యూటీసీ ఫైనల్ అడుతుంది. అలా కాకుండా భారత్ డ్రాగా సిరీస్‌ను ముగించి, లంక 2-0 తేడాతో గెలవకపోతే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడుతుంది.

WhatsApp channel