Virat Kohli best t20 innings: టీ20ల్లో విరాట్ కోహ్లి బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఇవే-virat kohli best t20 innings so far ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli Best T20 Innings: టీ20ల్లో విరాట్ కోహ్లి బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఇవే

Virat Kohli best t20 innings: టీ20ల్లో విరాట్ కోహ్లి బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఇవే

Hari Prasad S HT Telugu
Oct 24, 2022 07:56 PM IST

Virat Kohli best t20 innings: టీ20ల్లో విరాట్ కోహ్లి బెస్ట్‌ ఇన్నింగ్స్‌ చాలానే ఉన్నాయి. తన వరకూ మొహాలీలో ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్‌ ఇప్పటి వరకూ బెస్ట్‌గా ఉండేదని, అయితే ఇప్పుడు పాకిస్థాన్‌పై ఆడిన ఇన్నింగ్స్‌ దానిని అధిగమించినట్లు చెప్పాడు.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (AFP)

Virat Kohli best t20 innings: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్థాన్‌పై విరాట్‌ కోహ్లి ఆడిన ఇన్నింగ్స్‌ ఇండియన్‌ క్రికెట్‌ చరిత్రలోనే బెస్ట్‌ అని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. నిజానికి అందులో అతిశయోక్తి ఏమీ లేదు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌.. అందులోనూ చేజింగ్‌లో 31 రన్స్‌కే 4 వికెట్లు పడిపోయాయి.

ఇలాంటి సమయంలో హార్దిక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించడం, చివరికి అసాధ్యమనుకున్న విజయాన్ని అందించడంతో తన టీ20 కెరీర్‌లోనూ ఇదే బెస్ట్‌ ఇన్నింగ్స్‌ అని విరాట్‌ కోహ్లియే చెప్పాడు. నిజానికి టీ20ల్లో ఇంతకంటే ముందు కూడా విరాట్‌ కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

82 నాటౌట్‌ vs ఆస్ట్రేలియా, టీ20 వరల్డ్‌ కప్‌ 2016

పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లి చెప్పింది ఈ ఇన్నింగ్స్‌ గురించే. 2016 టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై మొహాలీ వేదికగా తాను ఆడిన ఇన్నింగ్స్‌ ఇప్పటి వరకూ బెస్ట్‌గా నిలిచిందని, అయితే పాక్‌తో మ్యాచ్‌ అంతకంటే బెస్ట్‌ అని కోహ్లి చెప్పాడు. ఆ మ్యాచ్‌లోనూ కోహ్లి 51 బాల్స్‌లో 82 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు. సూపర్‌ 10 స్టేజ్‌లో సెమీఫైనల్‌ చేరాలంటే ఆస్ట్రేలియాపై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 160 రన్స్‌ చేసింది. అయితే అప్పుడు కూడా చేజింగ్‌లో ఇండియా 49 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో ఆసీస్‌పై ఆడటానికి ఎంజాయ్‌ చేసే విరాట్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. చివరి 3 ఓవర్లలో 38 అవసరం కాగా.. జేమ్స్ ఫాక్‌నర్‌, నేథన్‌ కూల్టర్‌ నైల్‌ వేసిన ఓవర్లలో చితకబాదాడు. ఆ రెండు ఓవర్లలోనే అతడు 7 ఫోర్లు బాదడంతో మ్యాచ్‌లో ఇండియా గెలిచింది.

94 నాటౌట్‌ vs వెస్టిండీస్‌, 2019

హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్‌ విశ్వరూపం చూపించాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో కోహ్లి 50 బాల్స్‌లోనే 94 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు. విండీస్‌ విధించిన 208 రన్స్‌ టార్గెట్‌ కూడా కోహ్లి ధాటికి సులువుగా తలవంచింది. తొలి 20 బంతుల్లో 20 రన్స్‌ చేసిన విరాట్.. ఆ తర్వాత గేరు మార్చాడు. తర్వాతి 30 బంతుల్లో ఏకంగా 74 రన్స్‌ చేయడం విశేషం. విరాట్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఆరు సిక్స్‌లు ఉన్నాయి. దీంతో ఇండియా అంత భారీ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే చేజ్‌ చేసింది.

70 నాటౌట్‌ vs వెస్టిండీస్‌, 2019

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ ముగిసిన నాలుగు రోజుల్లోనే మరోసారి విండీస్‌ బౌలర్లకు విరాట్ చుక్కలు చూపించాడు. ముంబైలో మూడు టీ20ల సిరీస్‌ విజేతను తేల్చే మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 29 బాల్స్‌లోనే 70 రన్స్‌ చేశాడు. అంతకుముందు రోహిత్, రాహుల్‌ కూడా 135 రన్స్‌ పార్ట్‌నర్‌షిప్‌తో చెలరేగగా.. 12వ ఓవర్లో క్రీజులో అడుగుపెట్టిన విరాట్ కూడా విండీస్‌ బౌలర్లతో ఆడుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో తన ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ (21 బాల్స్‌లో)ని అందుకున్నాడు. కోహ్లి మెరుపులతో ఇండియా 240 రన్స్‌ చేసింది. చివరికి 67 రన్స్‌తో గెలిచిన టీమిండియా.. సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది.

72 నాటౌట్‌ vs సౌతాఫ్రికా, 2014 టీ20 వరల్డ్‌కప్‌

తనను చేజ్‌ మాస్టర్‌ అని ఎందుకంటారో మరోసారి విరాట్‌ కోహ్లి నిరూపించిన మ్యాచ్‌ ఇది. 2014 టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో సౌతాఫ్రికాపై ఈ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇండియా గెలవాలంటే 10 ఓవర్లలో 93 రన్స్‌ చేయాల్సిన సమయంలో కోహ్లి క్రీజులోకి వచ్చాడు. 44 బాల్స్‌లోనే 72 రన్స్‌ చేసి ఇండియాను ఒంటిచేత్తో ఫైనల్‌కు తీసుకెళ్లాడు.

49 vs పాకిస్థాన్‌, ఆసియా కప్‌ 2016

పాకిస్థాన్‌పై ఆసియాకప్‌ 2016లో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్‌ను కూడా ఫ్యాన్స్‌ ఎవరూ అంత త్వరగా మరచిపోరు. ఈ వరల్డ్‌కప్‌లో ఆడినట్లు ఆ ఇన్నింగ్స్‌లో భారీ షాట్లు, మెరుపులు ఏమీ లేవు. అయినా ఆ ఇన్నింగ్స్‌ చాలా స్పెషల్‌. ఎందుకంటే బంగ్లాదేశ్‌లోని మిర్పూర్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ కేవలం 83 రన్స్‌కే కుప్పకూలింది.

అయితే ఆ తర్వాత ఇండియా పరిస్థితి కూడా అలాగే అయింది. పాక్‌ బౌలర్‌ మహ్మద్‌ ఆమిర్‌ ధాటికి కేవలం 8 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో విరాట్‌ ఎంతో సమయోచితంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. చివరికి 51 బాల్స్‌లో 49 రన్స్‌ చేసి ఔటైనా.. ఈ మ్యాచ్‌లో ఇండియా 5 వికెట్లతో గెలిచింది. పాక్‌తో మ్యాచ్‌లో ఉండే ఒత్తిడిని అధిగమిస్తూ చేజింగ్‌లో విరాట్‌ ఆడిన 49 రన్స్ ఇన్నింగ్స్‌ టీమ్‌కు ఎంతో మేలు చేసింది.

WhatsApp channel