Rohit Sharma on Virat Kohli: హ్యాట్సాఫ్ విరాట్.. ఎమోషనల్ అయిన రోహిత్-rohit sharma on virat kohli says this is the best innings he played for india ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Rohit Sharma On Virat Kohli Says This Is The Best Innings He Played For India

Rohit Sharma on Virat Kohli: హ్యాట్సాఫ్ విరాట్.. ఎమోషనల్ అయిన రోహిత్

Hari Prasad S HT Telugu
Oct 23, 2022 07:18 PM IST

Rohit Sharma on Virat Kohli: హ్యాట్సాఫ్ విరాట్ కోహ్లి అంటూ ఎమోషనల్ అయ్యాడు కెప్టెన్‌ రోహిత్ శర్మ. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ గెలవగానే పరుగెత్తుకుంటూ వెళ్లి విరాట్‌ను ఎత్తుకున్న రోహిత్‌.. అతని గురించి చెప్పడానికి మాటలు రావడం లేదని అన్నాడు.

మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లిని ఎత్తుకున్న రోహిత్ శర్మ
మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లిని ఎత్తుకున్న రోహిత్ శర్మ (AFP)

Rohit Sharma on Virat Kohli: టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌పై మ్యాచ్‌ను విరాట్‌ కోహ్లి గెలిపించిన తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 160 రన్స్‌ చేజింగ్‌లో 31 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయమనుకున్న తరుణం నుంచి కింగ్‌ కోహ్లి మ్యాచ్‌ను మలుపు తిప్పిన విధానం చూసి రోహిత్‌ నోట మాట రాలేదు.

మ్యాచ్‌ గెలవగానే అతడు గ్రౌండ్‌లోకి పరుగెత్తుకుంటూ వెళ్లి విరాట్‌ను భుజాన ఎత్తుకొని చుట్టూ తిరిగాడు. అతన్ని హగ్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత మ్యాచ్‌ ప్రెజెంటేషన్‌లో మాట్లాడుతూ.. హ్యాట్సాఫ్‌ విరాట్‌ అంటూ ఎమోషనల్ అయ్యాడు. అసలు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని రోహిత్‌ అన్నాడు.

"నేను డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్నాను. నాకు మాటలు రావడం లేదు. ఇలాంటి మ్యాచ్‌లో ఇలాంటిది జరుగుతుందని అనుకోవాలి. సాధ్యమైనంత వరకూ మ్యాచ్‌లోనే ఉండాలని అనుకున్నాం. ఆ కీలకమైన భాగస్వామ్యం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. పిచ్‌లో ఏదో ఉంది. కాస్త స్వింగ్‌, సీమ్‌ ఉంది. బౌలింగ్‌ పరంగా బాగుంది. పాకిస్థాన్‌ చివర్లో బాగా బ్యాటింగ్‌ చేసింది" అని రోహిత్ అన్నాడు.

"ఈ టార్గెట్‌ను చేజ్‌ చేయాలంటే చెమటోడ్చాల్సిందే అని అనిపించింది. ఆ ఇద్దరికీ మంచి అనుభవం ఉంది. ఆందోళనకు గురికాకుండా ఉంటూ మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లడం కీలకం. ఇది మా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఎప్పుడైనా ఇలాంటి విజయంతో ప్రారంభించడం చాలా అవసరం. అసలు ఈ మ్యాచ్‌ గెలిచే పరిస్థితుల్లో లేనే లేము. అయినా మేము గెలిచిన తీరుపై చాలా సంతోషంగా ఉంది. హ్యాట్సాఫ్‌ విరాట్‌. ఇండియాకు అతడు ఆడిన బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఇదే. అందరికీ థ్యాంక్స్‌ చెప్పాలనుకుంటున్నాను" అని రోహిత్‌ అన్నాడు.

ఈ మ్యాచ్‌లో విరాట్, హార్దిక్‌ ఐదో వికెట్‌కు 113 రన్స్‌ జోడించారు. హార్దిక్‌ 37 బాల్స్‌లో 40 రన్స్‌ చేసి ఔటైనా.. విరాట్‌ 53 బాల్స్‌లో 82 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు. ఈ సంచలన ఇన్నింగ్స్‌ తనకు టీ20 కెరీర్‌లో బెస్ట్‌ అని మ్యాచ్‌ తర్వాత విరాట్‌ అన్నాడు.

WhatsApp channel