Ravishastri: ముకేశ్ అంబానీ, సుందర్ పిచాయ్‌లతో కలిసి లార్డ్స్‌లో మ్యాచ్ చూసిన రవిశాస్త్రి
Ravishastri: టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఇప్పుడు భారత కుబేరుడు ముకేశ్ అంబానీ, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్‌లతో కలిసి క్రికెట్ మ్యాచ్ చూసి ఫొటో వైరల్ అవుతోంది.

లండన్: టీమిండియా కోచ్ పదవి వదిలేసిన తర్వాత రవిశాస్త్రి మరోసారి తనకెంతో ఇష్టమైన కామెంట్రీ పని చేస్తున్నాడు. ప్రపంచంలో ఎక్కడ ఏ క్రికెట్ టోర్నీ అయినా వాలిపోతున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ 2022 టోర్నీలోనూ రవిశాస్త్రి కామెంట్రీ ఇస్తున్నాడు. ఈ సందర్భంగా రిలయెన్స్ అధినేత ముకేశ్ అంబానీ, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్‌లతో కలిసి అతడు మ్యాచ్ చూశాడు.
ఈ ఫొటోను అతడే తన ట్విటర్‌లో షేర్ చేశాడు. "హోమ్ ఆఫ్ క్రికెట్‌లో క్రికెట్‌ను ఎంతగానో ఇష్టపడే ఇద్దరు వ్యక్తులు ముకేశ్ అంబానీ, సుందర్ పిచాయ్‌ల కంపెనీలో ది హండ్రెడ్ టోర్నీ చూస్తున్నాను" అంటూ రవిశాస్త్రి ఈ ఫొటో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు ఇందులో ఈ ముగ్గురితోపాటు ఓ పిల్లాడు కూడా ఉన్నాడు.
అతడు ఎవరు అంటూ నెటిజన్లు రవిశాస్త్రిని అడగడం ప్రారంభించారు. ఆ నాలుగో వ్యక్తి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదేంటి అని ఓ యూజర్ ప్రశ్నించాడు. ముకేశ్ అంబానీ పక్కన ఉన్న ఆ పిల్లాడు ఎవరు అని మరో యూజర్ అడిగాడు. అయితే అతడు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తనయుడు కావచ్చని అంచనా వేస్తున్నారు.
ఇంగ్లండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ టోర్నీలో భాగంగా లార్డ్స్ గ్రౌండ్‌లో లండన్ స్పిరిట్, మాంచెస్టర్ ఒరిజినల్స్ మధ్య మ్యాచ్ చూడటానికి ముకేశ్ అంబానీ, సుందర్ పిచాయ్ వచ్చారు. ఈ మ్యాచ్‌తోనే వెస్టిండీస్ మాజీ క్రికెటర్ పొలార్డ్ తన 600వ టీ20 మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. ది హండ్రెడ్ టోర్నీ అనేది ఇంగ్లండ్‌లో పాపులర్ అవుతున్న 100 బాల్స్ క్రికెట్ టోర్నమెంట్. ఇంగ్లండ్ మొత్తంగా 8 పురుషుల, 8 మహిళల టీమ్స్ ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.