Manjrekar on Virat Kohli: సచిన్ సాధించిన ఆ రికార్డును మాత్రం కోహ్లి బ్రేక్ చేయలేడు: మంజ్రేకర్
Manjrekar on Virat Kohli: సచిన్ సాధించిన ఆ రికార్డును మాత్రం కోహ్లి బ్రేక్ చేయలేడని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ఈ మధ్య సచిన్, విరాట్‌లలో ఎవరు గొప్ప అన్న చర్చ నడుస్తున్న నేపథ్యంలో మంజ్రేకర్ ఓ ఆసక్తికరమైన రికార్డు గురించి చెప్పాడు.
Manjrekar on Virat Kohli: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడే రోజుల్లో అతడు సాధిస్తున్న రికార్డులు చూసి ఇవి ఎప్పటికైనా బ్రేక్ చేయడం అసలు సాధ్యమేనా అని చాలా మంది అనుకున్నారు. అతన్ని తరచూ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ బ్యాటర్ డాన్ బ్రాడ్‌మన్‌తో పోలుస్తూ.. అభినవ బ్రాడ్‌మన్ అనేవాళ్లు. ఆ తర్వాత విరాట్ కోహ్లి మంచి నీళ్లు తాగినంత సులువుగా సెంచరీలు బాదేస్తుంటే.. సచిన్ రికార్డును ఈజీగా దాటేస్తారనీ అన్నారు.
ట్రెండింగ్ వార్తలు
కానీ మధ్యలో మూడేళ్ల పాటు ఫామ్ కోసం తంటాలు పడిన కోహ్లి.. సెంచరీల స్పీడును తగ్గించాడు. గతేడాది ఆసియా కప్‌లో టీ20ల్లో తొలి సెంచరీ చేసిన తర్వాత వన్డేలు, టెస్టుల్లోనూ మూడంకెల స్కోరు అందుకున్నాడు. దీంతో మరోసారి సచిన్ రికార్డును కోహ్లి బ్రేక్ చేస్తాడన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా వన్డేల్లో విరాట్ 45 సెంచరీలు పూర్తి చేశాడు. మాస్టర్ కంటే కేవలం 4 సెంచరీల దూరంలో మాత్రమే ఉన్నాడు.
అయితే మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాత్రం విరాట్ అందుకోలేని సచిన్ రికార్డు వన్డేలలో కాదు కానీ.. టెస్టుల్లో ఉన్నట్లు చెప్పాడు. టెస్టుల్లో సచిన్ 51 సెంచరీలు చేశాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 29 సెంచరీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడతని వయసు 34. ఈ సమయంలో టెస్టుల్లో మరో 22 సెంచరీలు చేయడం అంత సులువు కాదు. ఇదే విషయాన్ని మంజ్రేకర్ చెబుతున్నాడు.
"సచిన్ టెస్టు సెంచరీల రికార్డును బ్రేక్ చేయడమే విరాట్ కోహ్లికి అసలైన సవాలు. వన్డేల్లో విరాట్ ఆల్‌టైమ్ గ్రేట్. అంతమాత్రాన టెస్టుల్లో గ్రేట్ కాదని కాదు. టెండూల్కర్ అసలు గొప్పతనం అతని 51 టెస్ట్ సెంచరీల్లో ఉంది. ఇదే విరాట్‌కు అసలైన పెద్ద కొండ. అయితే అతడు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తూ ఆ రికార్డును కూడా అందుకోవాలని కోరుకుంటున్నా" అని శ్రీలంకతో రెండో వన్డే సందర్భంగా మంజ్రేకర్ అన్నాడు.
నిజానికి సచిన్‌తో విరాట్ ఐదేళ్ల పాటు కలిసి ఆడాడు. ఆ సమయంలో కోహ్లి మెరుపులు పెద్దగా లేవు. సచిన్ 2013లో రిటైరైన తర్వాత విరాట్‌లోని అసలుసిసలు బ్యాటర్ బయటకు వచ్చాడు. సెంచరీల మీద సెంచరీలు, టన్నుల కొద్దీ రన్స్ చేశాడు. అయినా ఇప్పటికీ వన్డేల్లో సచిన్ సాధించిన పరుగులు, వంద సెంచరీల రికార్డులను బ్రేక్ చేయడం కోహ్లికి అంత సులువైన పని కాదు.
సంబంధిత కథనం