Saha Record Fifty: లక్నోపై విధ్వంసం సృష్టించిన సాహా.. రికార్డు హాఫ్ సెంచరీతో విజృంభణ-wriddhiman saha record fifty in ipl 2023 against lucknow ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Saha Record Fifty: లక్నోపై విధ్వంసం సృష్టించిన సాహా.. రికార్డు హాఫ్ సెంచరీతో విజృంభణ

Saha Record Fifty: లక్నోపై విధ్వంసం సృష్టించిన సాహా.. రికార్డు హాఫ్ సెంచరీతో విజృంభణ

Saha Record Fifty: లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా రికార్డు అర్ధశతకంతో అదరగొట్టాడు. ఈ సీజన్‌లో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన మూడో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

వృద్ధిమాన్ సాహా రికార్డు హాఫ్ సెంచరీ (IPL Twitter)

Saha Record Fifty: లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా అదరగొట్టాడు. ఈ ఐపీఎల్‌లో తన ఫామ్‌ను కొనసాగిస్తూ రికార్డు అర్ధ శతకంతో దుమ్మురేపాడు. ఫలితంగా గుజరాత్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సాహా విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 43 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

అంతేకాకుండా సాహా 20 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. ఫలితంగా ఈ సీజన్‌లో అత్యంత వేగవంతంగా అర్ధ సెంచరీ చేసిన మూడో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌లో జాస్ బట్లర్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్ వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్లుగా రికార్డుకెక్కారు. ఈ ముగ్గురు కూడా 15 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నారు. అనంతరం చెన్నై బ్యాటర్ అజింక్య రహానే 19 బంతుల్లో హాఫ్ సెంచరీని సాధించాడు. తాజాగా సాహా కూడా ఆ జాబితాలో చేరి సత్తా చాటాడు.

ఈ మ్యాచ్‌లొ తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు నష్టపోయి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్ భారీ అర్ధశతకాలతో విధ్వంసం సృష్టించారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శుభ్‌మన్ గిల్ 94 పరుగులతో.. సాహాతో కలిసి అదరగొట్టాడు. సాహా 51 బంతుల్లో 94 పరుగులు చేయగా.. అందులో 2 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.

ఈ ఓపెనర్లు ఇద్దరూ భారీ ఆరంభాన్ని అందించారు. అయితే దూకుడు మీదున్న సాహాను ఆవేశ్ ఖాన్ ఔట్ చేసి 142 పరుగుల భాగస్వామ్యానికి అడ్డుకట్ట వేశాడు. అనంతరం హార్దిక్ పాండ్య 25 పరుగులతో ఆకట్టుకోగా.. మోహ్సిన్ ఖాన్ అతడిని ఔట్ చేశాడు. లక్నో బౌలర్లలో ఆవేష్ ఖాన్, మోహ్సిన్ ఖాన్ చెరో వికెట్ మాత్రమే తీశారు.