Sehwag on Kohli-Gambhir Fight: ఓడిన జట్టు నోరు మూసుకుని వెళ్లిపోవాలి.. సెహ్వాగ్ అంత మాట అనేశాడేంటి?
Sehwag on Kohli-Gambhir Fight: విరాట్ కోహ్లీ-గౌతమ్ గంభీర్ గొడవపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓడిన జట్టు సైలెంట్‌గా వెళ్లిపోవాలని, గెలిచిన జట్టు సంబరాలు చేసుకోవాలే తప్ప మాటలు విసురుకోకూడదని తెలిపారు.
Sehwag on Kohli-Gambhir Fight: విరాట్ కోహ్లీ-గౌతమ్ గంభీర్ మధ్య ఇటీవల జరిగిన గొడవ ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. వీరిద్దరు ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించిన కారణంగా జరిమానా కూడా విధించారు. అయినప్పటికీ వీరి మధ్య వైరం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. ఇరువురు తమ సోషల్ మీడియా పోస్టులు ద్వారా కామెంట్లు విసురుతున్నారు. దీంతో పలువురు మాజీలు సైతం కోహ్లీ-గంభీర్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సునీల్ గవాస్కర్ అయితే ఏకంగా వీరిని సస్పెండ్ చేయాలని స్పష్టం చేశారు. తాజాగా ఈ అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. గెలిచిన జట్టు సంబరాలు చేసుకోవడం, ఓడిన జట్టు సైలెంట్‌గా వెళ్లిపోవాలని సూచించారు. అంతేకానీ ఇలా గొడవలు పడటం సరికాదని తెలిపారు.
"ఒక్కసారి మ్యాచ్ అయిపోయిన తర్వాత నేను టీవీ స్విచ్ ఆఫ్ చేసి రిలాక్స్ అవుతాను. మ్యాచ్ తర్వాత ఏం జరిగిందో నాకు అస్సలు తెలియదు. మరుసటి రోజు నిద్ర లేచిన తర్వాత సోషల్ మీడియాలో జరిగిన విషయం తెలుసుకున్నాను. ఏదైతే జరిగిందో అది సరైంది కాదు. ఓడిన జట్టు ఓటమిని అంగీకరించి సైలెంట్‌గా వెళ్లిపోవాలి. గెలిచిన టీమ్ సెలబ్రేట్ చేసుకోవాలి. అంతేకానీ ఇరువురు ఎందుకు ఒకరికొకరు మాటలు అనుకోవాలి? నేను ఒక్క విషయం చెబుతాను.. వారిద్దరూ దేశానికి ఐకాన్ ప్లేయర్లు. వారి నోటి నుంచి ఏ మాట వచ్చిన లక్షలాది మంది పిల్లలు వాటిని అనుసరిస్తారు. అంతేందుకు నేను కూడా నా ఐకాన్‌ను ఫాలో అవుతాను. కాబట్టి కొన్ని విషయాలను మనసులో పెట్టుకుని మలచుకోవాలి" అని సెహ్వాగ్ స్పష్టం చేశారు.
ఆటగాళ్లపై బీసీసీఐ నిషేధం విధిస్తే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండానివారించవచ్చని సెహ్వాగ్ కూడా అన్నారు.
"ఎవరినైనా బీసీసీఐ నిషేధించాలని అనుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఏవి జరగకుండా నివారించవచ్చు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. డ్రెస్సింగ్ రూంలో ఏది కావాలనుకుంటే అది అనుకోవచ్చు. కానీ మైదానంలో అడుగుపెట్టిన తర్వాత ఇలాంటి గొడవలు చూసేందుకు బాగోవు. నా పిల్లలు అక్కడ ఏం జరిగిందో లిప్ రీడింగ్ బట్టి తెలుసుకోగలరు. బెన్ స్టోక్స్ మాట్లాడేది కూడా అర్థం చేసుకోగలరు. అలాంటప్పుడు నాకు బాధగా అనిపిస్తుంది. నా పిల్లలే లిప్ రీడ్ చేసినప్పుడు ఇతరుల పిల్లలు ఎందుకు చేయరు. రేపటి రోజున కోహ్లీ-గంభీర్ మాదిరిగా వాళ్లు కూడా మాట్లాడతారు." అని సెహ్వాగ్ తెలిపారు.
ఇటీవలే బెంగళూరు-లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాటర్ నవీన్ ఉల్ హఖ్‌పై కోహ్లీ పదే పదే కామెంట్లు చేశాడు. దీంతో విరాట్‌పై అమిత్ మిశ్రా ఫీల్డ్ అంపైర్‌కు కంప్లైట్ చేస్తున్న సమయంలో ఈ గొడవ జరిగింది. లక్నో బ్యాటర్ కైల్ మేయర్స్.. విరాట్ కోహ్లీతో ఏదో మాట్లాడుతున్నప్పుడు గంభీర్ వచ్చేసి కైల్ మేయర్స్‌ను లాక్కుని వెళ్లాడు. కోహ్లీతో మాట్లాడకుండా అతడిని గంభీర్ తీసుకెళ్లడం పరిస్థితిని తీవ్రతరం చేసింది. ఆ సమయంలో కోహ్లీ ఏదో అనడం, గంభీర్ తిరిగి అతడిపైకి వెళ్లడంతో సంఘర్షణ చోటు చేసుకుంది.