Dhoni Comments: ఇది నా చివరి ఐపీఎల్ అని మీరే డిసైడయ్యారు.. నేను అనలేదు: ధోనీ
Dhoni Comments: ఇది నా చివరి ఐపీఎల్ అని మీరే డిసైడయ్యారు.. నేను అనలేదు అని ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ కు ముందు టాస్ సందర్భంగా మిస్టర్ కూల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Dhoni Comments: టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పి రెండున్నరేళ్లు అవుతోంది. దీంతో 2020 ఐపీఎల్ నుంచే ప్రతి ఏటా ధోనీకిదే చివరి సీజన్ అనే వార్తలు వస్తున్నాయి. 41 ఏళ్ల ధోనీ ఈ ఏడాది ఐపీఎల్ తో క్రికెట్ నుంచి తప్పుకోవడం ఖాయమని అభిమానులు కూడా ఫిక్సయిపోయారు. దీంతో ఇండియాలో అతడు ఎక్కడికెళ్లి ఆడినా అతనికి మద్దతుగా అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియాలకు తరలి వస్తున్నారు.
తాజాగా బుధవారం (మే 3) కూడా లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లోనూ స్థానిక లక్నో టీమ్ కంటే చెన్నై అభిమానులే ఎక్కువగా కనిపించారు. ఇదే విషయాన్ని టాస్ సందర్భంగా హోస్ట్ డానీ మోరిసన్ ప్రస్తావించాడు. ఇదే చివరి సీజన్ కదా.. ఎలా అనిపిస్తోంది అని అతడు ధోనీని అడిగాడు. దీనిపై ధోనీ స్పందిస్తూ.. ఇదే చివరి ఐపీఎల్ అని మీరే డిసైడయ్యారు అని అనడం విశేషం.
ఈ సమాధానం విని కంగుతిన్న డానీ మోరిసన్.. అయితే వచ్చే ఏడాది కూడా ఆడాతావన్నమాట.. అతడు వచ్చే ఏడాది కూడా వస్తాడట అంటూ అభిమానులకు చెప్పాడు. అతని మాటలు విని ధోనీ నవ్వాడు తప్ప.. కచ్చితంగా దానికి అవును లేదా కాదు అని చెప్పలేదు. దీంతో ధోనీ వచ్చే సీజన్ కూడా ఆడతాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ధోనీ వయసు 41 ఏళ్లయినా.. అతని ఫిట్‌నెస్ కు మాత్రం ఢోకా లేదు. ఇప్పటికే కుర్రాళ్లతో పోటీపడి మరీ టీ20 క్రికెట్ ఆడగలడు. ఆ లెక్కన వచ్చే ఏడాది కూడా కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అయితే తన సడెన్ నిర్ణయాలతో షాకిచ్చే అలవాటు ఉన్న ధోనీ.. ఎప్పుడు తన చివరి మ్యాచ్ ఆడేశానని చెబుతాడో ఎవరూ అంచనా వేయలేరు.
సంబంధిత కథనం