Ind vs Aus 3rd ODI: వరల్డ్ రికార్డుకు 2 పరుగుల దూరంలో కోహ్లి-రోహిత్.. సచిన్, గంగూలీ రికార్డుపై కన్ను
Ind vs Aus 3rd ODI: వరల్డ్ రికార్డుకు 2 పరుగుల దూరంలో ఉన్నారు కోహ్లి-రోహిత్. వీళ్లు సచిన్, గంగూలీ రికార్డుపై కన్నేశారు. ఆస్ట్రేలియాతో బుధవారం (మార్చి 22) చెన్నైలో జరగబోయే మూడో వన్డేలోనూ ఈ రికార్డు బ్రేకయ్యే అవకాశాలు ఉన్నాయి.
Ind vs Aus 3rd ODI: ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సెంచరీలు బాదారు. అదే ఫామ్ వన్డే సిరీస్ లోనూ కొనసాగిస్తారని ఆశగా ఎదురు చూసిన అభిమానులకే నిరాశే ఎదురైంది. తొలి వన్డేలో ఆడని రోహిత్.. రెండో వన్డేలో విఫలమయ్యాడు. ఇటు విరాట్ కోహ్లి కూడా రెండు వన్డేల్లో పెద్దగా స్కోర్లు చేయలేకపోయాడు.
టాపార్డర్ వైఫల్యంతో రెండో వన్డేలో ఓడిన ఇండియన్ టీమ్ సిరీస్ గెలవాలంటే కచ్చితంగా చెన్నైలో బుధవారం (మార్చి 22) జరగబోయే మూడో వన్డేలో గెలవాలి. లేదంటే 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన అపవాదు మూటగట్టుకుంటుంది. ఇప్పుడు సిరీస్ 1-1తో సమం అయిన నేపథ్యంలో మూడో వన్డేలో రోహిత్, కోహ్లిలపై అందరి కళ్లూ ఉన్నాయి.
పదేళ్లుగా ఇండియన్ క్రికెట్ భారాన్ని మోస్తున్న ఈ ఇద్దరే మూడో వన్డేలో ముందుండి నడిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇదే మూడో వన్డేలో వీళ్లు ఓ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఇద్దరూ ఇప్పటికే వన్డేల్లో ఎవరికి వారు ఎన్నో రికార్డులను తిరగరాశారు. అయితే ఈ మ్యాచ్ లో మాత్రం కలిసి ఓ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ రానుంది.
వన్డేల్లో అత్యంత వేగంగా 5 వేల పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డుకు వీళ్లు కేవలం 2 పరుగుల దూరంలో ఉన్నారు. ఇప్పటి వరకూ విరాట్, రోహిత్ 85 ఇన్నింగ్స్ లో 4998 రన్స్ జోడించారు. సగటు 62.47. వన్డే క్రికెట్ లో 60కి పైగా సగటుతో 4 వేలకుపైగా రన్స్ చేసిన ఏకైక జోడీ వీళ్లదే. ఈ ఇద్దరూ వన్డేల్లో ఇప్పటి వరకూ 18 సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పారు.
ప్రస్తుతం వన్డేల్లో 97 ఇన్నింగ్స్ లో 5 వేల పరుగుల భాగస్వామ్యంతో వరల్డ్ రికార్డు వెస్టిండీస్ బ్యాటర్లు గార్డన్ గ్రీనిడ్జ్, డెస్మండ్ హేన్స్ పేరిట ఉంది. ఇక ఇండియా తరఫున ధావన్ తో కలిసి రోహితే 112 ఇన్నింగ్స్ లో 5 వేల రన్స్ జోడించాడు. ఇప్పుడు కోహ్లితో ఈ రికార్డు అందుకుంటే.. వన్డేల్లో ఓపెనింగ్ జోడీ కాకుండా 5 వేల రన్స్ జోడించిన తొలి జోడీ వీళ్లదే అవుతుంది.
వన్డేల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం రికార్డు సచిన్, గంగూలీ పేరిట ఉంది. ఈ లెజెండరీ క్రికెటర్లు వన్డేల్లో 176 ఇన్నింగ్స్ లో ఏకంగా 8227 రన్స్ జోడించారు. ఈ రికార్డుకు రోహిత్, కోహ్లి ఇంకా చాలా దూరంలో ఉన్నారు.
సంబంధిత కథనం