Ranveer Singh overtakes Kohli: సెలబ్రిటీల్లో విరాట్ కోహ్లిని మించిన రణ్‌వీర్ సింగ్.. బ్రాండ్ విలువ రూ.1500 కోట్లు
Ranveer Singh overtakes Kohli: సెలబ్రిటీల్లో విరాట్ కోహ్లిని మించిపోయాడు రణ్‌వీర్ సింగ్. అతని బ్రాండ్ విలువ రూ.1500 కోట్లు కావడం విశేషం. 2022 ఏడాదికిగాను మోస్ట్ వాల్యూడ్ సెలబ్రిటీగా నిలిచాడు.
Ranveer Singh overtakes Kohli: ఇండియాలో అటు క్రికెటర్లు, ఇటు బాలీవుడ్ స్టార్లను మించిన క్రేజ్ విరాట్ కోహ్లి సొంతం. అందుకే అతని బ్రాండ్ వాల్యూ ఎప్పుడూ ఆకాశాన్ని తాకుతుంది. అయితే 2022లో మాత్రం బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్.. ఈ విషయంలో విరాట్ కోహ్లిని మించిపోయాడు. తాజా సెలబ్రిటీ బ్రాండ్ వాల్యూయేషన్ రిపోర్ట్ ప్రకారం.. కోహ్లి రెండోస్థానానికి పడిపోయాడు.
రణ్‌వీర్ సింగ్ బ్రాండ్ వాల్యూ ఏకంగా 18.17 కోట్ల (సుమారు రూ.1500 కోట్లు) డాలర్లకు చేరడం విశేషం. అదే విరాట్ కోహ్లి బ్రాండ్ వాల్యూ రూ.1483 కోట్లుగా ఉంది. ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్సీ వదిలేసిన తర్వాత వరుసగా రెండేళ్లుగా కోహ్లి బ్రాండ్ విలువ తగ్గుతూ వస్తోంది. కోహ్లి బ్రాండ్ వాల్యూ 2020లో రూ.1963 కోట్లు, 2021లో రూ.1534 కోట్లుగా ఉంది.
2022లో ఇది మరింత తగ్గి రూ.1483 కోట్లకు చేరింది. ఇక మొత్తంగా ఇండియాలో సెలబ్రిటీల బ్రాండ్ వాల్యూ 2022లో 1600 కోట్ల డాలర్లు (సుమారు రూ.1.32 లక్షల కోట్లు)కు చేరింది. 2021లో ఇది 1400 కోట్ల డాలర్లుగా ఉండేది. మరోవైపు గతేడాది రణ్‌వీర్ సింగ్ సినిమాలు తక్కువ చేసినా.. తన సమయాన్ని ఎక్కువగా అడ్వర్‌టైజ్‌మెంట్లకే వెచ్చించాడు.
ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ ఖాతాలో ఏకంగా 40 బ్రాండ్లు ఉండటం విశేషం. ఈ మధ్యే పెప్సీ బ్రాండ్ అంబాసిడర్ గానూ నిలిచాడు. ఇక రణ్‌వీర్ సింగ్, విరాట్ కోహ్లి తర్వాత అక్షయ్ కుమార్, ఆలియా భట్ తమ మూడు, నాలుగు స్థానాలను నిలబెట్టుకున్నారు. ఇక రణ్‌వీర్ భార్య దీపికా పదుకోన్ 2022లో ఏడు నుంచి ఐదోస్థానానికి చేరింది. ఆమె బ్రాండ్ విలువ రూ.684 కోట్లుగా ఉంది.
2022 మొదట్లో కోహ్లి చెత్త ఫామ్ లో ఉన్నాడు. ఇది కూడా అతని బ్రాండ్ ఎండార్స్ మెంట్లపై ప్రభావం చూపింది. అయితే గతేడాది చివరి నుంచి అతడు మరోసారి చెలరేగుతున్నాడు. దీంతో ఈ ఏడాది మరోసారి కోహ్లి బ్రాండ్ విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి.
సంబంధిత కథనం