ICC T20 Rankings: టీ20 ర్యాంకుల్లో మళ్లీ టాప్‌ 10లోకి దూసుకొచ్చిన విరాట్ కోహ్లి-icc t20 rankings released as virat kohli back into top 10 after melbourne innings ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Icc T20 Rankings: టీ20 ర్యాంకుల్లో మళ్లీ టాప్‌ 10లోకి దూసుకొచ్చిన విరాట్ కోహ్లి

ICC T20 Rankings: టీ20 ర్యాంకుల్లో మళ్లీ టాప్‌ 10లోకి దూసుకొచ్చిన విరాట్ కోహ్లి

Hari Prasad S HT Telugu
Oct 26, 2022 03:50 PM IST

ICC T20 Rankings: టీ20 ర్యాంకుల్లో మళ్లీ టాప్‌ 10లోకి దూసుకొచ్చాడు విరాట్ కోహ్లి. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో పాకిస్థాన్‌పై ఆడిన సంచలన ఇన్నింగ్స్‌తో తాజా ర్యాంకింగ్స్‌లో విరాట్ సత్తా చాటాడు.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (AFP)

ICC T20 Rankings: టీ20 ర్యాంకుల్లో విరాట్‌ కోహ్లి మరోసారి తన మార్క్‌ చాటుకున్నాడు. ఆ మధ్య ఫామ్‌ కోల్పోయి ర్యాంకుల్లోనూ దిగజారిన అతడు.. ఇప్పుడు ఒకే ఒక సంచలన ఇన్నింగ్స్‌తో మళ్లీ టాప్‌ 10లోకి వచ్చాడు. తాజాగా ఐసీసీ బుధవారం (అక్టోబర్‌ 26) రిలీజ్‌ చేసిన ర్యాంకుల్లో కోహ్లి ఆరు స్థానాలు ఎగబాకి 9వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

టీ20ల్లో ఒకప్పుడు టాప్‌ ర్యాంక్‌లో ఉన్న విరాట్‌.. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో వైఫల్యంతో నవంబర్‌లో రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో టాప్‌ 10 నుంచి బయటకు వెళ్లిపోయాడు. మళ్లీ ఫిబ్రవరిలో టాప్‌ 10లోకి వచ్చినా.. కొన్నాళ్ల తర్వాత మళ్లీ అతని ర్యాంక్ దిగజారింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో అతడు ఏకంగా 35వ ర్యాంక్‌కు దిగజారిపోయాడు. ఆసియా కప్‌ కంటే ముందు 2022లో నాలుగు టీ20లు ఆడిన విరాట్‌ కేవలం 81 రన్స్ చేశాడు.

అయితే ఆసియా కప్‌ నుంచి మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి.. నిలకడగా ఆడుతున్నాడు. ఆ టోర్నీలోనే ఆఫ్ఘనిస్థాన్‌పై అంతర్జాతీయ టీ20ల్లో తొలి సెంచరీ కూడా నమోదు చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లలోనూ తన ఫామ్‌ కొనసాగించాడు. మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తన టీ20 కెరీర్‌లోనే బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ మ్యాచ్‌ 19వ ఓవర్లో హరీస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో విరాట్‌ బాదిన రెండు సిక్స్‌లు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి. దీంతో తాజా ర్యాంకుల్లో అతడు మరోసారి టాప్‌ 10లో చోటు సంపాదించడం విశేషం.

మరోవైపు ఈ ఏడాదంతా టాప్‌ ఫామ్‌లో కొనసాగుతూ వచ్చి పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విఫలమైన సూర్యకుమార్‌ యాదవ్‌ మాత్రం తాజా ర్యాంకుల్లో మూడో ర్యాంక్‌కు పడిపోయాడు. అతని స్థానంలో న్యూజిలాండ్‌ బ్యార్‌ డెవోన్‌ కాన్వే రెండో ర్యాంక్‌ అందుకున్నాడు. తొలి స్థానంలో పాక్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ కొనసాగుతుండగా.. బాబర్‌ ఆజం నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. ఇండియన్‌ టీమ్‌ తరఫున టాప్‌ 10లో సూర్యతోపాటు విరాట్ మాత్రమే ఉన్నాడు.

WhatsApp channel