Anurag Thakur to Pakistan Cricket Board: బీసీసీఐ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మధ్య ఆసియాకప్ 2023 విషయమై నెలకొన్న వివాదంపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన పాక్ బోర్డుకు కఠినమైన సందేశాన్ని పంపించారు. ఇండియా క్రికెట్‌లోనే కాదు.. ఏ విషయంలో అయినా ఎవరి మాటా వినే పరిస్థితుల్లో లేదని తేల్చి చెప్పారు.,వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగబోయే ఆసియాకప్ కోసం ఇండియన్ టీమ్ అక్కడికి వెళ్లే ప్రసక్తే లేదని, ఆ టోర్నీనే తటస్థ వేదికకు మారుస్తామని బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు కూడా అయిన జై షా చెప్పడంతో వివాదం మొదలైంది. దీనిపై పాక్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. అలా అయితే తాము ఇండియాలో జరగబోయే వరల్డ్‌కప్‌తోపాటు ఇతర టోర్నీల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుందని హెచ్చరించింది.,ఈ వార్నింగ్‌పైనే తాజాగా కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. "అది బీసీసీఐ వ్యవహారం. వాళ్లే స్పందిస్తారు. ఇండియా ఒక క్రీడా శక్తి. ఇక్కడ ఎన్నో వరల్డ్‌కప్‌లు జరిగాయి. వచ్చే ఏడాది కూడా ఇండియాలోనే వన్డే వరల్డ్‌కప్ జరుగుతుంది. ఇందులో ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద టీమ్స్ పాల్గొంటాయి. ఏ ఆటలో అయినా ఇండియాను విస్మరించలేరు.,క్రీడలకు ముఖ్యంగా క్రికెట్‌కు ఇండియా ఎంతో చేసింది. అందువల్ల ఇండియా వచ్చే ఏడాది వరల్డ్‌కప్‌ను నిర్వహిస్తుంది. అది ఒక చారిత్రక ఈవెంట్ అవుతుంది. పాకిస్థాన్‌లో భద్రతాపరమైన ఆందోళనలు ఉండటంతో హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుంది. క్రికెట్‌లోనే కాదు. ఏ విషయంలో అయినా ఎవరి మాటా వినే పరిస్థితుల్లో ఇండియా లేదు" అని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.,ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రకటన సందర్భంగా అనురాగ్ ఈ అంశంపై స్పందించారు. 2023లో ఆసియా కప్ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ దగ్గర ఉన్నాయి. అయితే ఆ దేశానికి ఇండియన్ టీమ్ వెళ్లే ప్రసక్తే లేదని ఈ మధ్యే బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేశారు. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన జారీ చేసింది.