Khelo India | ఖేలో ఇండియా ప్రోగ్రామ్‌.. గ్రామీణ అథ్లెట్లకు వరం-khelo india encouraging young athletes to shine on international platforms ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Khelo India | ఖేలో ఇండియా ప్రోగ్రామ్‌.. గ్రామీణ అథ్లెట్లకు వరం

Khelo India | ఖేలో ఇండియా ప్రోగ్రామ్‌.. గ్రామీణ అథ్లెట్లకు వరం

Hari Prasad S HT Telugu
Dec 22, 2021 06:04 PM IST

Khelo India.. దేశంలో నైపుణ్యం ఉన్న క్రీడాకారులకు కొదవ లేకపోయినా.. ఆ నైపుణ్యాన్ని ప్రదర్శించే సరైన వేదిక లేకపోవడం అసలు సమస్య. దీనికి పరిష్కారం చూపే దిశగా 2018లో కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. చిన్న వయసు నుంచే పెద్ద వేదికలపై తలపడే అవకాశాన్ని ఈ కార్యక్రమం యువ అథ్లెట్లకు ఇస్తోంది.

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో భాగంగా జరుగుతున్న ఫుట్‌బాల్‌ మ్యాచ్‌
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో భాగంగా జరుగుతున్న ఫుట్‌బాల్‌ మ్యాచ్‌

 

Khelo India.. ఖేలో ఇండియా ప్రోగ్రామ్‌.. మూడేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం ఇది. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమం మూడేళ్లలో మంచి సక్సెస్‌ సాధించిందనే చెప్పాలి. వంద కోట్లకుపైగా జనాభా ఉన్న దేశం వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకూ సాధించిన పతకాలు ఎన్ని అంటే వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి వచ్చిందే ఈ ఖేలో ఇండియా. 

దేశంలో నైపుణ్యం ఉన్న క్రీడాకారులకు కొదవ లేకపోయినా.. ఆ నైపుణ్యాన్ని ప్రదర్శించే సరైన వేదిక లేకపోవడం అసలు సమస్య. దీనికి పరిష్కారం చూపే దిశగా 2018లో కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. చిన్న వయసు నుంచే పెద్ద వేదికలపై తలపడే అవకాశాన్ని ఈ కార్యక్రమం యువ అథ్లెట్లకు ఇస్తోంది. 

వాళ్ల టాలెంట్‌ను గుర్తించి, ఇండియాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే సత్తా ఉన్న అథ్లెట్లను ప్రోత్సహించే పని స్పోర్ట్స్‌ అథారిటీలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడేళ్లలో ఈ ఖేలో ఇండియా సాధించిన సక్సెస్‌ ఎంత? ఈ కార్యక్రమం కోసం ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలన్న ఆసక్తికర అంశాలు ఇప్పుడు చూద్దాం.

ఖేలో ఇండియాకు పెరుగుతున్న క్రేజ్‌

తొలిసారి 2018లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఖేలో ఇండియా స్కూల్‌ గేమ్స్‌గా పిలిచేవారు. తొలి గేమ్స్‌లో దేశవ్యాప్తంగా అండర్‌-17 కేటగిరీలో 3507 మంది అథ్లెట్లు, 16 క్రీడల్లో పాల్గొన్నారు. ఆ తర్వాతి ఏడాది నుంచి ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌గా ఈ కార్యక్రమం పేరు మారింది. 2019లో ఈ గేమ్స్‌లో పాల్గొన్న వారి సంఖ్య 5925కు, క్రీడల సంఖ్య 18కి చేరింది. ఇది 2020లో మరింత పెరిగి 20 క్రీడలు, 10 వేల మందికిపైగా అథ్లెట్లు పాల్గొనే స్థాయికి చేరింది.

ఖేలో ఇండియా ఆర్థిక సాయం

ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుండటంతో ప్రభుత్వం కూడా ఖేలో ఇండియాకు కేటాయించే నిధులు పెరుగుతూ వచ్చాయి. తొలి ఏడాది ఈ కార్యక్రమం కోసం రూ. 324 కోట్లు కేటాయించగా.. ఆ తర్వాతి ఏడాది రూ. 500 కోట్లు, గతేడాది రూ. 890 కోట్లు కేటాయించారు. ఈ ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా కొన్ని ఎంపిక చేసిన స్పోర్ట్స్‌లో అద్భుతమైన నైపుణ్యం కనబరిచిన అథ్లెట్లకు 8 ఏళ్లపాటు ఏడాదికి రూ. 5 లక్షలు ఇస్తుండటం గమనార్హం. యువ అథ్లెట్లకు అత్యాధునిక శిక్షణ ఇవ్వడానికి తెలంగాణ సహా కర్ణాటక, అరుణాచల్‌ప్రదేశ్‌, కేరళ, మణిపూర్‌, మిజోరం, ఒడిశా, నాగాలాండ్‌ వంటి 8 రాష్ట్రాల్లో ఎక్సెలెన్స్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేసింది. దేశంలో స్పోర్ట్స్‌ వైపు యువతను ఆకర్షించడానికి ఈ ఖేలో ఇండియా ప్రోగ్రామ్‌ ఉపయోగపడిందనే చెప్పాలి.

ఖేలో ఇండియా టు ఒలింపిక్స్‌

ఇండియా గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి టోక్యో ఒలింపిక్స్‌లో అత్యధికంగా 7 పతకాలు గెలిచింది. ఇదే ఓ అద్భుతం అనుకుంటే.. ఈ ఒలింపిక్స్‌కు వెళ్లిన వారిలో ఖేలో ఇండియాలో పాల్గొన్న అథ్లెట్లు కూడా ఉండటం మరో విశేషం. మను బాకర్‌, సౌరబ్‌ చౌదరి, అన్షు మాలిక్‌, శ్రీహరి నటరాజ్‌ వంటి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్లు ఈ ఖేలో ఇండియా ద్వారా వెలుగులోకి వచ్చిన వాళ్లే. వీళ్లు మెడల్స్‌ గెలవకపోయినా.. ఒలింపిక్స్‌ వంటి అంతర్జాతీయ వేదికపై తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం దక్కింది. భవిష్యత్తులో విజయాలు సాధించడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని వారికి అందించింది.

యూత్‌ ఒలింపిక్స్‌లో రికార్డు

2018లో జరిగిన యూత్‌ ఒలింపిక్స్‌లో ఇండియా రికార్డు స్థాయిలో 13 మెడల్స్ గెలవడంలోనూ ఈ ఖేలో ఇండియా కీలక పాత్ర పోషించింది. ఆ ఏడాది ఖేలో ఇండియా ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ఎంతో మంది అథ్లెట్లు యూత్‌ ఒలింపిక్స్‌లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. ఇక భవిష్యత్తులో దేశానికి గర్వకారణంగా నిలుస్తారనుకున్న అథ్లెట్లను కూడా ఈ ఖేలో ఇండియా కార్యక్రమం గుర్తించింది. బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్‌, తస్నిమ్‌ మీర్‌, ఆర్చరీలో కోమలికా బారి, అథ్లెటిక్స్‌లో అంకితా ధ్యాని, షూటింగ్‌లో మెహూలీఘోష్‌ వంటి అథ్లెట్లను ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇలాగే విజయవంతంగా కొనసాగితే సమీప భవిష్యత్తులోనే ఒలింపిక్స్‌లో భారత్‌ రెండంకెల మెడల్స్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఖేలో ఇండియా రిజిస్ట్రేషన్‌

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో పాల్గొనాలనుకుంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం అధికారిక వెబ్‌సైట్‌ అయిన https://kheloindia.gov.in/ కి వెళ్లాలి. హోమ్‌పేజ్‌లో Play India Youth Games in 2021 Registration Form లింకుపై క్లిక్‌ చేస్తే సంబంధిత రిజిస్ట్రేషన్‌ ఫామ్‌ వస్తుంది. అందులో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.

 

WhatsApp channel

సంబంధిత కథనం