G20 foreign ministers meet: రెండు శిబిరాలుగా జీ 20 విదేశాంగ మంత్రుల సదస్సు
G20 foreign ministers meet: అగ్ర దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి వేదిక కావడంతో ఢిల్లీ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది న్యూస్ గా మారిపోయింది.
G20 foreign ministers meet: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ లో జరుగుతున్న జీ 20 (G20) సదస్సు కీలకంగా మారింది. జీ 20 విదేశాంగ మంత్రుల సమావేశానికి అటు అమెరికా, ఇటు రష్యా, పలు యూరోప్ దేశాల విదేశాంగ మంత్రులు హాజరవుతుండడంతో ఈ సదస్సుకు మరింత ప్రాముఖ్యత ఏర్పడింది.
G20 foreign ministers meet: ముఖాముఖి సమావేశాలు లేవు..
అయితే, రష్యాకు మద్దతిస్తున్న వర్గం ఒకవైపు, ఉక్రెయిన్ కు మద్దతిస్తున్న మరో వర్గం మరోవైపు నిలిచిన పరిస్థితి ఇప్పుడు ఢిల్లీ జీ 20 (G20) సమావేశంలో కనిపిస్తోంది. మొత్తం జీ 20 సభ్య దేశాలు రెండు శిబిరాలుగా చీలిపోయి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తో ముఖాముఖి సమావేశం కావడం లేదని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకిన్ (Antony Blinken) తేల్చి చెప్పారు. అంతేకాదు, చైనా విదేశాంగ మంత్రి క్విన్ గంగ్ (Qin Gang)ని కూడా ప్రత్యేకంగా కలవబోవడం లేదని స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో జరిగే జీ 20 విదేశాంగ మంత్రుల సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకిన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ (Sergei Lavrov) కలిసి పాల్గొననున్నారు. ఒకే సమావేశంలో వారిద్దరు కలిసి పాల్గొనడం గత జీ 20 (G20) సమావేశంలో బాలిలో జరిగింది. ‘యుద్ధాన్ని నిలిపేయాలని నిజాయితీగా రష్యా భావిస్తున్నట్లయితే, ఆ దిశగా సహకారం అందించడానికి అమెరికా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కానీ, రష్యాకు ఆ ఉద్దేశం ఉన్నట్లు కనిపించడం లేదు’ అని బ్లింకెన్ వ్యాఖ్యానించారు.
Delhi G20 foreign ministers meet: యూరోప్, అమెరికాల యుద్ధోన్మాదం
మరోవైపు, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం యూరోప్, అమెరికా ల యుద్ధోన్మాద ఫలితమేనని రష్యా ఆరోపిస్తోంది. ‘‘ప్రపంచంపై ఆధిపత్యం తమ చేతుల నుంచి చేజారిపోవడాన్ని జీర్ణించుకోలేక, ప్రతీకారం తీర్చుకోవడం కోసం కక్ష సాధింపుగా పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ ను ఉసి గొల్పాయి’’ అని రష్యా ప్రకటించింది. అమెరికా, దాని మిత్ర దేశాల విధ్వంసపూరిత విధానాల కారణంగా ప్రపంచం ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయిందని పేర్కొంది.
Delhi G20 foreign ministers meet: చైనా పై ఆగ్రహం
జీ 20 (G20) సదస్సు సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి Qin Gang తో కూడా ప్రత్యేకంగా భేటీ కావడం లేదని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ (Antony Blinken) స్పష్టం చేశారు. అమెరికా భూభాగంపైకి చైనా గూఢచర్యం కోసం బెలూన్లను (spy balloons) పంపించడంపై ఇప్పటికే ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయి ఉద్రిక్తత నెలకొని ఉంది. ఆ బెలూన్ల అమెరికా క్షిపణులు కూల్చేశాయి. ఆ నేపథ్యంలో చైనా పర్యటనను కూడా బ్లింకెన్ (Antony Blinken) రద్దు చేసుకున్నారు. అయితే, అమెరికా ఆరోపణలను చైనా కొట్టివేసింది. ఆ బెలూన్లు వాతావరణ పరిశోధనల కోసం పంపించినవని వివరణ ఇచ్చింది.