Southwest monsoon : రుతుపవనాల కోసం కొనసాగుతున్న ఎదురుచూపులు.. కేరళను తాకేదెప్పుడు?
Southwest monsoon in Kerala : నైరుతి రుతుపవనాలు కేరళను ఇంకా తాకలేదు. జూన్ 7లోపు అవి కేరళలోకి ప్రవేశిస్తాయని వాతావరణశాఖ చెబుతోంది.
Southwest monsoon in Kerala : నైరుతి రుతుపవనాల కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఆదివారం నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. కానీ అలా జరగలేదు. ఇక ఇప్పుడు.. జూన్ 7లోపు నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. అంటే ఇంకో మూడు రోజుల సమయం ఉంది.
ట్రెండింగ్ వార్తలు
"రుతుపవనాలు ఆదివారం కేరళను తాకలేదు. మరో మూడు- నాలుగు రోజుల్లో అవి కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉంది. లక్షద్వీప్‌తో పాటు దక్షిణ అరేబియా సముద్రం నుంచి రుతుపవనాలు కేరళవైపు కదిలేందుకు సానుకూల వాతావరణం ఏర్పడింది. అందుకే జూన్ 5,7 మధ్యలో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకొచ్చు. ఈ నేపథ్యంలో కేరళవ్యాప్తంగా మంగళవారం ఉరుములతో కూడిన భారీ వర్షం పడొచ్చు," అని ఐఎండీ పేర్కొంది.
ఆలస్యం ఎందుకు..?
సాధారణంగా.. నైరుతి రుతుపవనాలు ప్రతియేటా జూన్ 1కి అటు ఇటుగా కేరళను తాకుతాయి. గతేడాది మే 29నే కేరళలోకి రుతుపవనాలు వచ్చేశాయి. 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న, 2019లో జూన్ 8న, 2018లో మే 29.. రాష్ట్రాన్ని తాకాయి. ఈసారి జూన్ 4న రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ భావించింది. మళ్లీ ఇప్పుడు ఆ డేట్‌ను మార్చింది. రుతుపవనాల కారణంగా అరేబియా సముద్రంలో వర్షాలు పడుతున్నాయి. కానీ వాటి ప్రభావం కేరళలో పెద్దగా కనిపించడం లేదు. అయితే ఆదివారం తర్వాత పరిస్థితులు మెరుగుపడ్డాయని వాతావరణశాఖ అభిప్రాయపడింది. కాగా.. ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది.
Southwest monsoon latest updates : 2023 నైరుతి రుతుపవనాలు.. జూన్ 3 నాటికి లక్షద్వీప్‌కు పశ్చిమ భాగాన్ని తాకాయి. అక్కడి నుంచి కేరళవైపు కదిలేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడలేదు. అందుకే అవి ఆదివారం నాటికి కేరళలోకి ప్రవేశించలేదని వాతావరణశాఖ తెలిపినట్టు స్థానిక మీడియా సంస్థ పేర్కొంది.
మరోవైపు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ- మాహే ప్రాంతాల్లో ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ ఆదివారం హెచ్చరించింది. కోంకణ్- గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, యానాం, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటకలోనూ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
సంబంధిత కథనం