RBI rate hike : వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని తగ్గించనున్న ఆర్బీఐ.. ప్రజలకు ఉపశమనం!
RBI rate hike : ఇప్పటివరకు భారీగా వడ్డీ రేట్లను పెంచిన ఆర్బీఐ.. ఆ వేగాన్ని కాస్త తగ్గించే సూచనలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు పలు కారణాలని చెబుతున్నారు.
RBI rate hike : ద్రవ్యోల్బణం కట్టడికి ప్రపంచ దేశాల బ్యాంకులు 'వడ్డీ రేట్ల పెంపు' అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. ఆర్బీఐ సైతం.. ఇప్పటికే పలుమార్లు వడ్డీ రేట్లను పెంచింది. ఈ నెల చివర్లోనూ వడ్డీ రేట్లను పెంచనుంది. అయితే.. గతంతో పోల్చుకుంటే.. ఈసారి వడ్డీ రేట్ల పెంపు తీవ్రత తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణుల నుంచి విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే.. ఆర్బీఐ నిర్ణయాలపై అమెరికా 'ఫెడ్' ప్రభావం కూడా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వడ్డీ రేట్ల పెంపు వేగం తగ్గొచ్చు..!
వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని ఆర్బీఐ తగ్గించేందుకు పలు కారణాలు ఉన్నాయని ఎకనామిస్ట్లు చెబుతున్నారు. జూన్ త్రైమాసికంలో భారత జీడీపీ.. అంచనాల కన్నా తక్కువ నమోదు కావడం ప్రధాన కారణం అని అంటున్నారు.
"ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో భారత దేశ జీడీపీ 13.5శాతంగా నమోదైంది. ఆర్బీఐ అంచనాల(16.2శాతం) కన్నా ఇది చాలా తక్కువ. అందువల్ల.. ఈసారి వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని ఆర్బీఐ తగ్గిస్తే.. మేము ఆశ్చర్యపోము. 25-35బేసిస్ పాయింట్ల మధ్య వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని మేము భావిస్తున్నాము," అని డ్యుయిష్ బ్యాంక్ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ కౌషిక్ దాస్ అభిప్రాయపడ్డారు.
RBI rate hike news : ఆగస్టులో వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మొత్తం మీద ఈ ఏడాది మే నుంచి 140 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇక ఈ నెల 30న మరోమారు వడ్డీ రేట్లను పెంచనుంది ఆర్బీఐ. అయితే.. ఆర్బీఐ మొనేటరీ పాలసీ సభ్యుల్లోని చాలా మంది.. వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని తగ్గించాలని అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది.
ద్రవ్యోల్బణంతో ఉక్కిరిబిక్కిరి అయిన భారతీయులపై.. వడ్డీ రేట్ల పెంపుతో మరింత భారం పడింది. ఇళ్లు, వాహనాల లోన్లతో పాటు అనేక విషయాలు మరింత ఖరీదైన వ్యవహారంగా మారాయి. ఇప్పుడు.. వడ్డీ రేట్ల పెంపు తీవ్రతను ఆర్బీఐ తగ్గిస్తే.. ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్టు అవుతుంది!
ఫెడ్ ఎఫెక్ట్..
FED rate hike : మరోవైపు.. అమెరికా ఫెడ్ తీసుకునే నిర్ణయాలపైనా ఆర్బీఐ చర్యలు ఆధారపడి ఉంటాయి. ద్రవ్యోల్బణం కట్టడికి భారీగా వడ్డీ రేట్లను పెంచుతామని ఫెడ్ ఛైర్మన్ పావెల్ ఇప్పటికే తేల్చిచెప్పారు. ఆర్థిక వ్యవస్థ క్షీణించినా పర్లేదని అన్నారు. ఈ క్రమంలో.. ఈ నెల 23న సమావేశం కానున్న ఫెడ్ సభ్యులు.. వడ్డీ రేట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? అనే విషయాన్ని ఆర్బీఐ పరిశీలించనుంది.
అయితే.. దాని కన్నా ముందు.. ఈ నెల 13న.. యూఎస్ సీపీఐ(ద్రవ్యోల్బణం డేటా) వెలువడనుంది. ద్రవ్యోల్బణం తగ్గితే లేదా పెరిగితే.. ఫెడ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు సైతం అమెరికా సీపీఐ డేటా కోసం ఎదురుచూస్తున్నాయి.
ఇక భారత్ విషయానికొస్తే.. ఈ నెల 12న సీపీఐ డేటా వెలువడనుంది. ఆర్బీఐపై ఈ ప్రభావం కూడా ఉంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
సంబంధిత కథనం