Covid-19: కొవిడ్ పరిస్థితిపై నేడు సమీక్షించనున్న ప్రధాని మోదీ.. మళ్లీ నిబంధనలు వస్తాయా!-prime minister narendra modi covid meet today after bf 7 omicron variant found in country ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Prime Minister Narendra Modi Covid Meet Today After Bf 7 Omicron Variant Found In Country

Covid-19: కొవిడ్ పరిస్థితిపై నేడు సమీక్షించనున్న ప్రధాని మోదీ.. మళ్లీ నిబంధనలు వస్తాయా!

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 22, 2022 10:55 AM IST

PM Narendra Modi meet on Covid Situation: దేశంలో కొవిడ్-19 పరిస్థితిపై నేడు సమావేశం నిర్వహించనున్నారు ప్రధాని మోదీ. వైరస్ కట్టడి చర్యల గురించి ఉన్నతాధికారులతో చర్చించనున్నారు.

Covid-19: కొవిడ్ పరిస్థితిపై నేడు సమీక్షించనున్న ప్రధాని మోదీ..
Covid-19: కొవిడ్ పరిస్థితిపై నేడు సమీక్షించనున్న ప్రధాని మోదీ..

PM Narendra Modi meet on Covid-19 Situation: కొవిడ్-19 కొత్త వేరియంట్‍తో మళ్లీ ఆందోళన మొదలైంది. చైనాలో మరోసారి కరోనా విలయానికి కారణమవుతోన్న ఒమిక్రాన్ బీఎఫ్.7 (Omicron BF.7) వేరియంట్ కేసులు ఇండియానూ నమోదవటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. దేశంలో కొవిడ్-19 పరిస్థితిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (డిసెంబర్ 22) సమీక్ష నిర్వహించనున్నారు. వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు, వైద్య నిపుణులతో సమావేశం కానున్నారు. కరోనా మళ్లీ వ్యాపించకుండా తీసుకువాల్సిన కట్టుదిట్టమైన చర్యలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే, ప్రజలు మాస్కులు ధరించాలనే నిబంధనను కేంద్రం తప్పనిసరి చేస్తుందా అన్న ఉత్కంఠ నెలకొని ఉంది. అంతర్జాతీయ ప్రయాణాలపై రూల్స్ ఏమైనా వస్తాయేమో చూడాలి.

కొత్త వేరియంట్ కేసులు

ఒమిక్రాన్ బీఎఫ్.7 (Omicron BF.7) వేరియంట్‍కు చెందిన రెండు కేసులు గుజరాత్‍లో, మరో రెండు ఒడిశాలో రిపోర్ట్ అయ్యాయి. జూలై, సెప్టెంబర్, నవంబర్ నెలల్లో ఈ వేరియంట్‍ కేసులు నమోదయ్యాయి. గుజరాత్‍లో ఆ వేరియంట్ బారిన పడిన వారు కోలుకున్నారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ఈ బీఎఫ్.7 ఒమిక్రాన్ వేరియంట్ ఇంకా వ్యాపించిందా అని గుర్తించేందుకు పాజిటివ్ కేసుల శాంపిళ్లను జినోమ్ సీక్వెన్సింగ్‍కు పంపాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవలే ఆదేశించింది. అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.

మాస్కులు ధరించండి

కేంద్ర వైద్యశాఖ మంత్రి మన్‍సుఖ్ మాండవియా.. కొవిడ్ పరిస్థితిపై బుధవారం సమీక్ష నిర్వహించారు. రద్దీ ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని సూచించారు. అయితే ఈ నిబంధనను కచ్చితం మాత్రం చేయలేదు. అలాగే, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

ప్రస్తుతం చైనాలో కొవిడ్ వేరియంట్ బీఎఫ్.7 విజృంభిస్తోంది. దీని కారణంగా లక్షలాది కేసులు నమోదవుతున్నాయని తెలుస్తోంది. అమెరికా, జపాన్‍తో పాటు బెల్జియమ్, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ లాంటి యూరోపియన్ దేశాల్లోనూ ఈ వేరియంట్ ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది.

IPL_Entry_Point