Juhi Kore viral post: గొప్ప ప్రేరణ ఇచ్చే తాతా మనవరాలి కథ-oxford graduate dedicates her success to late grandfather social media post goes viral ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Oxford Graduate Dedicates Her Success To Late Grandfather, Social Media Post Goes Viral

Juhi Kore viral post: గొప్ప ప్రేరణ ఇచ్చే తాతా మనవరాలి కథ

juhi kore: తన తాత కథను పంచుకున్న జూహీ
juhi kore: తన తాత కథను పంచుకున్న జూహీ (linkedin)

Juhi Kore viral post about his grandfather: తన తాతను ఒకప్పుడు స్కూళ్లో చదువుకోనివ్వలేదు.. కానీ తాను ఆక్స్‌ఫర్డ్‌లో మాస్టర్స్ చదివింది. ఈ అద్భుతమైన స్ఫూర్తిగాథ మీరూ చదవండి.

Juhi Kore viral post about his grandfather: న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి కంపారిటివ్ సోషల్ పాలిటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన జూహీ కోరె తన లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌లో రాసిన తాత, మనవరాలి కథ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

హృదయాన్ని హత్తుకునే ఈ ప్టోస్ వైరల్ అయ్యింది. దీనిలో ఆమె తన తాత చదువుకోవడం, అతని కల ఎలా సాకారం అయ్యింది అనే విషయాల గురించి వివరించింది.

జూహీ కోరె పోస్టు ఇదీ..

‘1947లో భారతదేశం స్వేచ్ఛా, స్వతంత్ర దేశంగా ప్రకటితమైన సంవత్సరం. అయితే ప్రతి పౌరుడూ స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించడానికి అనుమతి లభించలేదు.. వారిలో ఒక బాలుడు నిమ్న వర్గానికి చెందిన కుటుంబంలోని పాఠశాల వెళ్లే వయస్సులో ఉన్న బిడ్డ. మహారాష్ట్రలోని ఓ గ్రామంలో చదువుకునే వయస్సులో ఉన్న బాలుడు అయినప్పటికీ, అతని కుటుంబం రెండు ప్రాథమిక కారణాల వల్ల అతను పాఠశాలకు వెళ్లడానికి ఇష్టపడలేదు. నలుగురు పిల్లల్లో పెద్దవాడిగా, అతని కుటుంబ పోషణ కోసం వ్యవసాయ పనులకు వెళ్లాల్సి రావడం మొదటి భయం. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎలా ప్రవర్తిస్తారో అని భయపడడం రెండో కారణం..

దృఢ సంకల్పానికి శ్రమ తోడైతే ఇది సాధ్యమవుతుంది. తెల్లవారుజామున 3 గంటల నుండి మరెవరికి ఇంకా మెలకువ రాకముందే పొలంలో పనిచేయాలని, ఉదయం రెండో సగం పాఠశాలకు వెళ్లాలని తన తల్లిదండ్రులతో ఆ బాలుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు తల్లిదండ్రుల రెండో భయం నిజమైంది. పాఠశాలకు ఎటువంటి మంచి పాదరక్షలు లేకుండా ఒకటిన్నర గంటల నడక తర్వాత అతను తరగతి గదిలో కూర్చోవడానికి కూడా అనుమతి దక్కలేదు.

అయినప్పటికీ, అతను పట్టుదలతో ఉన్నాడు. అతని వ్యవసాయ పనులకు డబ్బు లభ్యమయ్యేది కాదు. కేవలం ఆహారం మాత్రమే దక్కేది. అతను పాత పుస్తకాలు తనలా "బహిష్కృతులైన" (షెడ్యూల్డ్ కులం) విద్యార్థుల నుండి అరువుగా తీసుకొని రాత్రి పూట గ్రామంలోని ఏకైక దీపం స్తంభం క్రింద చదువుకునేవాడు. తన అగ్రవర్ణ సహచరుల నుండి బెదిరింపులు, అతని అగ్రవర్ణ ఉపాధ్యాయుల నుండి వివక్ష, తరగతి గదిలో కూర్చోవడానికి అనుమతించనప్పటికీ, అతని దృఢ సంకల్పం అతడిని పరీక్షలలో ఉత్తీర్ణత సాధించకుండా ఆపలేదు. అతని సహవిద్యార్థులందరినీ మించిపోయేలా చేసింది!

ప్రతి హీరో ప్రయాణంలో ఒక తెలివైన గురువు లేదా ఛాంపియన్ ఉంటాడు. ఇక్కడి అతని పాఠశాల ప్రిన్సిపాల్. ఈ బాలుడి సామర్థ్యాన్ని గుర్తించిన వ్యక్తి. కొన్ని సంవత్సరాల తర్వాత అతను తన చదువులో రాణించడాన్ని గమనించి, పెద్ద నగరమైన బొంబాయిలో అతని పాఠశాల విద్యకు, జీవనానికి డబ్బు సమకూర్చాడు..’ అని జూహి కోరె రాసుకొచ్చారు.

జూహీ తాత ప్రభుత్వ భవనంలో పూర్తి సమయం క్లీనర్‌గా పనిచేస్తూనే.. ఇంగ్లీష్ నేర్చుకుని, న్యాయ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. వయస్సు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని చెబుతూ జూహీ ఇలా చెప్పుకొచ్చారు. ‘చాలా సంవత్సరాల తరువాత, అదే ప్రభుత్వ భవనంలో ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారిగా పదవీ విరమణ చేసిన తర్వాత, అతడు 60 ఏళ్ల వయస్సులో తన మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు..’ అని వివరించింది.

తను ఎంత గర్వంగా ఉందో తెలియజేస్తూ.. ‘నాలో విద్య యొక్క ప్రాముఖ్యతను నింపిన ఆ బాలుడు (తన తాత), నా తల్లితండ్రుల గురించి నేను చాలా గర్వపడుతున్నాను! నేను ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్‌ పూర్తి చేశాను అని గర్వంగా ప్రకటిస్తున్నాను..’ అని రాశారు.

తన మాస్టర్స్ డిగ్రీ రాగానే తన తాత పొందిన ఉత్సాహాన్ని వివరించింది. ‘తన పరిసరాల్లోని ప్రతి కూరగాయలు అమ్మేవారు, ప్రతి షాపు వర్కరూ ఈ వార్త విన్నారు..’ అని తెలిపింది.

దురదృష్టవశాత్తూ జూహీ తన తాతను ఒక సంవత్సరం క్రితం కోల్పోయింది. దీనిని ప్రస్తావిస్తూ, ఆమె ఇలా రాసుకొచ్చింది. ‘అతను నా ఆక్స్‌ఫర్డ్ గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరు కావాలనే మా కలను మేం సాకారం చేసుకోలేకపోయాం. కానీ అతను దూరం నుంచి నన్ను ఎంతో ప్రేమగా చూస్తున్నాడని నాకు తెలుసు. కేవలం రెండు తరాలలో, అతను తన కలను సాకారం చేసుకున్నాడు. తనను పాఠశాలలో కూర్చోనివ్వని పరిస్థితుల నుంచి.. తన మనవరాలు ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయ భవనంలోని గదుల్లో నడవగలిగింది. నేను అతని గురించి చాలా గర్వపడుతున్నాను. అతను తన వారసత్వం గురించి గర్వపడుతున్నాడని నేను ఆశిస్తున్నాను..’ అని పోస్ట్ చేశారు.

పోస్ట్‌ను అప్‌లోడ్ చేసిన వెంటనే, నెటిజన్లు పోస్ట్‌పై కామెంట్‌లతో ముంచెత్తారు. ఒక తాత, అతని మనవరాలి ఈ మధురమైన కథ నెటిజన్లను హత్తుకుంది. ప్రేరణ ఇస్తోంది. ఆ పోస్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

WhatsApp channel