James Webb | సుదూర గ్ర‌హంలో నీటి జాడ‌; గుర్తించిన జేమ్స్ వెబ్‌-nasas james webb telescope detects water on distant planet ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  James Webb | సుదూర గ్ర‌హంలో నీటి జాడ‌; గుర్తించిన జేమ్స్ వెబ్‌

James Webb | సుదూర గ్ర‌హంలో నీటి జాడ‌; గుర్తించిన జేమ్స్ వెబ్‌

HT Telugu Desk HT Telugu
Jul 13, 2022 09:28 PM IST

James Webb | అమెరికా, యూరోప్‌, కెన‌డాలు సంయుక్తంగా ప్ర‌యోగించిన జేమ్స్ వెబ్ టెలీస్కోప్ అద్భుతాలు సృష్టిస్తోంది. మాన‌వాళి మునుపెన్న‌డు చూడ‌ని, చూడ‌గ‌ల‌మ‌న్న ఆలోచ‌న కూడా లేని అంత‌రిక్ష అద్భుతాల‌ను చూపిస్తూ క‌నువిందు చేస్తోంది. తాజాగా, మరో ఆవిష్క‌ర‌ణ‌ను మ‌న ముందుంచింది.

మ‌రో గ్ర‌హంపై మేఘం జాడ‌లు
మ‌రో గ్ర‌హంపై మేఘం జాడ‌లు (NASA)

James Webb | మ‌న సౌర వ్య‌వ‌స్థ‌కు ఆవ‌ల‌, దాదాపు వెయ్యి కాంతి సంవ‌త్స‌రాల దూరంలో, ఒక మ‌న సూర్యుడి వంటి న‌క్ష‌త్రాన్ని, దాని చుట్టూ ప‌రిభ్ర‌మిస్తున్న భూమి వంటి గ్ర‌హాన్ని గుర్తించింది.

James Webb | 1150 లైట్ ఈయ‌ర్స్ దూరంలో..

1150 కాంతి సంవ‌త్స‌రాల దూరంలో ఉన్న సూర్యుడి వంటి న‌క్ష‌త్రం చుట్టూ తిరుగుతున్న గ్ర‌హాన్ని ఆవ‌రించి మేఘాలు, పొగ‌మంచు, వేడి వాయువులతో కూడిన వాతావ‌ర‌ణాన్ని జేమ్స్ వెబ్ టెలీస్కోప్ గుర్తించిన‌ట్లు అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ నాసా బుధ‌వారం ప్ర‌క‌టించింది. దీన్ని బ‌ట్టి ఆ గ్ర‌హంపై నీటి ఆన‌వాళ్లు ఉండొచ్చ‌ని విశ్వ‌సిస్తున్నారు. సుదూర గ్ర‌హాల‌కు సంబంధించి అంత సునిశిత వాతావ‌ర‌ణ అంచ‌నా ఇప్ప‌టివ‌ర‌కు వెలువ‌డ‌లేదు. జేమ్స్ వెబ్ అత్యాధునిక సాంకేతిక‌త ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసింది. ఆ గ్ర‌హానికి వాస్ప్ -96బీ(WASP-96 b) గా నామ‌క‌ర‌ణం చేశారు. అలాంటి గ్ర‌హ న‌మూనా మ‌న సౌర వ్య‌వ‌స్థ‌లో లేద‌ని నిర్ధారించారు.

James Webb | జూపిట‌ర్‌తో పోలిక‌లు..

మ‌న గురు గ్ర‌హంతో ఆ WASP-96 b గ్ర‌హానికి కొన్ని పోలిక‌ల‌ను నాసా శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. గురు గ్ర‌హం బ‌రువుతో పోలిస్తే.. WASP-96 b స‌గం క‌న్నా త‌క్కువ బ‌రువే ఉంటుంద‌ని, అయినా, దాని వ్యాసం మాత్రం గురు గ్ర‌హం క‌న్నా 1.3 రెట్లు ఎక్కువ‌ని నిర్ధారించారు. మ‌న సౌర వ్య‌వ‌స్థ‌లోని గ్ర‌హాల‌న్నింటి క‌న్నా ఇది బొద్దుగా ఉంటుంద‌న్నారు. కానీ,ఈ WASP-96 b గ్ర‌హంపై ఉష్ణోగ్ర‌త 538 డిగ్రీ సెల్సియ‌స్ ఉంటుంద‌ని ముక్తాయించారు. అది ప‌రిభ్ర‌మించే సూర్యుడికి అతి ద‌గ్గ‌ర‌గా ఉండ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ని తేల్చారు. ఈ మ‌న సౌర వ్య‌వ‌స్థ‌కు వెలుప‌ల ఉన్న గ్ర‌హాల వాతావ‌ర‌ణంపై ప‌రిశోధ‌న‌లు జ‌ర‌ప‌డానికి ఈ గ్ర‌హం అత్యంత అనువైన‌ద‌ని నాసా వెల్ల‌డించింది. ఆ గ్ర‌హం ప‌రిభ్ర‌మిస్తున్న సూర్యుడి వంటి న‌క్ష‌త్రానికి ఆ గ్ర‌హానికి మ‌ధ్య దూరం మ‌న సౌర వ్య‌వ‌స్థ‌లో.. సూర్యుడికి, బుధ గ్ర‌హానికి మ‌ధ్య ఉన్న దూరంలో తొమ్మిద‌వ వంతుకు స‌మాన‌మ‌ని తెలిపింది. ప్ర‌స్తుతం ఆ గ్ర‌హ వాతావ‌ర‌ణంలోని వాయువుల వివ‌రాల‌ను సాధించ‌డానికి నాసా ప్ర‌య‌త్నిస్తోంది.

IPL_Entry_Point