Crime news: కన్న కొడుకునే చంపాలని కుట్ర; కాంట్రాక్ట్ కిల్లర్స్ కు సుపారీ ఇచ్చిన తండ్రి
Crime news: కన్న కొడుకునే చంపడానికి ఒక తండ్రి కుట్ర పన్నాడు. కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకుని కుమారుడిని హత్య చేయడానికి సుపారీ ఇచ్చాడు. సమాచారం తెలియడంతో పోలీసులు ఆ తండ్రిని, ఆ కాంట్రాక్ట్ కిల్లర్స్ ను అరెస్ట్ చేశారు. ఆయుధాలు, నకిలీ వాహన ప్లేట్ ను స్వాధీనం చేసుకున్నారు.
తన కుమారుడిని హత్య చేసేందుకు ఐదుగురు కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకున్న వ్యక్తిని పుణె నగర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి కుమారుడైన ధీరజ్ అర్గాడే శివాజీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది.
కొడుకునే చంపాలని..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దినేశ్ చంద్ర అలియాస్ బాబాసాహెబ్ శంకరరావు అర్గాడే కుమారుడు ధీరజ్ అర్గాడే. దినేశ్ చంద్ర రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నాడు. దినేశ్ చంద్రకు, ఆయన కుమారుడు ధీరజ్ అర్గాడే కు మధ్య కోట్ల రూపాయల విలువైన ఆస్తికి సంబంధించిన యాజమాన్య వివాదాలు ఉన్నాయి. దాంతో, తన కుమారుడిని హత్య చేయించాలని దినేశ్ చంద్ర అర్గాడే నిర్ణయించుకున్నాడు.
కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ..
తన కుమారుడు ధీరజ్ ను హత్య చేయడానికి కాంట్రాక్ట్ కిల్లర్లను సంప్రదించాడు. ఈ హత్య చేస్తే రూ. 75 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో రూ. 20 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చాడు. సమాచారం తెలియడంతో ప్రధాన నిందితుడు దినేశ్ చంద్రతో పాటు కాంట్రాక్ట్ కిల్లర్లు ప్రవీణ్ అలియాస్ పర్యా తుకారాం కుడ్లే, యోగేష్ దామోదర్ జాదవ్, చేతన్ అరుణ్ పోక్లే, ప్రశాంత్ విలాస్ గాడ్గే, అశోక్ లక్ష్మణ్ థోంబ్రే లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నాటు తుపాకీ, లైవ్ రౌండ్, ఫుడ్ డెలివరీ బాయ్ టీషర్టులు (అరెస్టు నుంచి తప్పించుకోవడానికి), నకిలీ వాహన నంబర్ ప్లేట్ తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్రూడ్ ప్రాంతంలో కుడ్లే అనే నేరస్థుడిపై తొమ్మిది కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గత నెలలో నిందితుడు తన కొడుకును కత్తితో చంపడానికి ప్రయత్నించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై శివాజీనగర్ పోలీస్ స్టేషన్ లో 307, ఆయుధ చట్టంలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులకు ఏప్రిల్ 30 వరకు పోలీసు కస్టడీ విధించారు.