LTTE Prabhakaran: “ఎల్‍టీటీఈ చీఫ్ ప్రభాకరన్ జీవించే ఉన్నారు.. త్వరలో వస్తారు”: తమిళ నేత షాకింగ్ వ్యాఖ్యలు-ltte chief prabhakaran alive and healthy tamil leader pazha nedumaran claim
Telugu News  /  National International  /  Ltte Chief Prabhakaran Alive And Healthy Tamil Leader Pazha Nedumaran Claim
LTTE Prabhakaran: “ఎల్‍టీటీఈ చీఫ్ ప్రభాకరన్ (ఫైల్ ఫొటో)
LTTE Prabhakaran: “ఎల్‍టీటీఈ చీఫ్ ప్రభాకరన్ (ఫైల్ ఫొటో) (HT Photo)

LTTE Prabhakaran: “ఎల్‍టీటీఈ చీఫ్ ప్రభాకరన్ జీవించే ఉన్నారు.. త్వరలో వస్తారు”: తమిళ నేత షాకింగ్ వ్యాఖ్యలు

13 February 2023, 16:37 ISTChatakonda Krishna Prakash
13 February 2023, 16:37 IST

LTTE Chief Prabhakaran: ఎల్‍టీటీఈ చీఫ్ ప్రభాకరన్ జీవించే ఉన్నారని తమిళనాడుకు చెందిన రాజకీయ నేత పెళ నెడుమారన్ (Pazha Nedumaran) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన త్వరలోనే అందరి ముందుకు వస్తారని అన్నారు.

LTTE Chief Prabhakaran: లిబరేషన్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE) అధినేత వెలుపిళ్లై ప్రభాకరన్ (Velupillai Prabhakaran) జీవించే ఉన్నారని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తమిళనాడుకు చెందిన రాజకీయ నేత, కాంగ్రెస్ మాజీ నాయకుడు పళ నెడుమారన్ (Pazha Nedumaran) షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రభాకరన్ మృతి చెందినట్టు ప్రకటన వెలువడిన 14 సంవత్సరాల తర్వాత.. నేడు (ఫిబ్రవరి 13) నెడుమారన్ ఇలా మాట్లాడారు. వివరాలివే..

LTTE Chief Prabhakaran: శ్రీలంక (Sri Lanka)లో తమిళులకు ప్రత్యేక స్వతంత్ర రాష్ట్రం ఇవ్వాలని ఎల్‍టీటీఈని స్థాపించి తీవ్రంగా పోరాటం చేశారు ప్రభాకరన్. 2009 మే 18వ తేదీన శ్రీలంక ఆర్మీ.. ప్రభాకరన్‍ను హతమార్చిందని ఆ దేశం ప్రకటించింది. ముల్లివైకల్ ప్రాంతంలో ఆయనను చంపినట్టు అధ్యక్షుడు మహిందా రాజపక్స నేతృత్వంలోని అప్పటి శ్రీలంక ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఇది జరిగిన 14 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నెడుమారన్ ఆశ్చర్యపరిచే వ్యాఖ్యలు చేశారు.

“ప్రభాకరన్ త్వరలోనే ప్రజల ముందుకు”

LTTE Chief Prabhakaran: “ఎల్‍టీటీఈ చీఫ్ ప్రభాకరన్ జీవించే ఉన్నారు. త్వరలోనే బయటికి వస్తారు. ఈ విషయాన్ని ప్రపంచానికి ప్రకటించేందుకు చాలా సంతోషంగా ఉంది. తమిళ్ ఈలం కోసం ప్రణాళికను ప్రభాకరన్ ప్రకటిస్తారు” అని నెడుమారన్ అన్నారు. వరల్డ్ తమిళ్స్ కాన్ఫడరేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన తంజావూరులో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభాకరన్‍కు తమిళనాడు ప్రభుత్వం, తమిళ ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు.

ప్రపంచానికి తెలుస్తుంది

LTTE Chief Prabhakaran: “ప్రభాకరన్ ఎక్కడున్నారనే విషయం తెలుసుకోవాలని నాతో పాటు అందరూ అనుకుంటున్నారు. అయితే ఆయన అతిత్వరలోనే అందరి ముందుకు రానున్నారు. ప్రపంచానికి ఈ విషయం త్వరలోనే తెలుస్తుంది.” అని నెడుమారన్ అన్నారు. ప్రభాకరన్ కుటుంబంతో తాను మాట్లాడానని, వాళ్లు చెప్పిన సమాచారం ఆధారంగానే ఇది చెబుతున్నానని అన్నారు. ప్రభాకరన్ కుటుంబ సభ్యుల ఆమోదంతోనే ఈ సమాచారాన్ని బయటికి చెబుతున్నానని స్పష్టం చేశారు.

పెళ నెడుమారన్ గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సహాయకుడిగా పని చేశారు. కాంగ్రెస్ నేతగానూ చాలా కాలం ఉన్నారు.

LTTE Chief Prabhakaran: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రభాకరన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. శ్రీలంకలోనూ చాలా దాడి ఘటనల్లో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఎల్‍టీటీఈని శ్రీలంక నిషేధిత ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. మరోవైపు శ్రీలంక ఆర్మీ.. తీవ్రంగా మానవ హక్కులను ఉల్లంఘించిందన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం ప్రభాకరన్ పోరాడారు.

ప్రభాకరన్‍ను హతమార్చినట్టు 2009లో శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు ప్రభాకరన్ వయసు 54 సంవత్సరాలు. ప్రభాకరన్ మృతదేహం ఫొటోలు అంటూ కొన్ని చిత్రాలను శ్రీలంక సర్కార్ అప్పట్లో కొన్నింటిని విడుదల చేసింది. వాటిపై కూడా అప్పట్లో అనుమానాలు వ్యక్తం అయ్యాయి.