India on Russia Ukraine war : ‘శాంతికి సాయం చేస్తాము’- భారత్​-india on russia ukraine war ready to support de escalation efforts ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  India On Russia Ukraine War ''Ready To Support De-escalation Efforts'

India on Russia Ukraine war : ‘శాంతికి సాయం చేస్తాము’- భారత్​

Sharath Chitturi HT Telugu
Oct 10, 2022 10:10 PM IST

India on Russia Ukraine war : రష్యా ఉక్రెయిన్​ యుద్ధంపై భారత్​ స్పందించింది. ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేస్తామని పేర్కొంది.

కీవ్​లో రష్యా దాడుల తర్వాత పరిస్థితి..
కీవ్​లో రష్యా దాడుల తర్వాత పరిస్థితి.. (AP)

India on Russia Ukraine war : రష్యా ఉక్రెయిన్​ యుద్ధంలో తాజా పరిస్థితులపై భారత్​ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం ఎవరికీ మంచిది కాదని స్పష్టం చేసింది. ఉద్రిక్తతలను తగ్గించే విషయంలో సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పునరుద్ఘాటించింది.

ఉక్రెయిన్​పై సోమవారం మిసైళ్లతో విరుచుకుపడింది రష్యా. రాజధాని కీవ్​ నగరంతో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలు.. రష్యా దాడుల్లో దద్దరిల్లాయి. 84కుపైగా మిసైళ్లను రష్యా ప్రయోగించినట్టు ఉక్రెయిన్​ ఆరోపిస్తోంది. ఆయా ఘటనల్లో 10కిపైగా మంది మరణించినట్టు తెలుస్తోంది. తాజా పరిణామాలపై ఇండియా ఈ విధంగా స్పందించింది.

"ఉద్రిక్త వాతావరణం పెరగడం ఎవరికీ మంచిది కాదని మేము మళ్లీ చెబుతున్నాము. పౌరుల మృతిపట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. ఉద్రిక్త పరిస్థితులను తక్షణమే తగ్గించి, దౌత్యపరమైన చర్చలకు ఇరు దేశాలు ముందడుగు వేయాలి. ఇందుకోసం సాయం చేసేందుకు భారత్​ సిద్ధంగా ఉంది," అని విదేశాంగశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

యుద్ధం నేపథ్యంలో గతవారమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​, ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీలతో సంభాషించారు. శాంతికి సాయం చేస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు.. పుతిన్​తో 'యుద్ధానికి ఇది సమయం కాదు,' అని వ్యాఖ్యానించారు మోదీ.

'ఉక్రెయిన్​కు వెళ్లకండి..'

Russia Ukraine war latest news : ఉక్రెయిన్​లో తాజా పరిస్థితుల నేపథ్యంలో పౌరులకు సూచనలు జారీ చేసింది భారత ప్రభుత్వం. అవసరమైతే తప్ప.. ఉక్రెయిన్​లో పర్యటించకూడదని స్పష్టం చేసింది. భద్రతాపరమైన ఆదేశాలను పాటించాలని తేల్చిచెప్పింది.

"ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. ఉక్రెయిన్​కు, ఉక్రెయిన్​ లోపల ప్రయాణాలు మానుకోవాలని భారత పౌరులకు సూచిస్తున్నాము. స్థానిక యంత్రాంగం, ఉక్రెయిన్​ ప్రభుత్వం ఇస్తున్న సూచనలు కచ్చితంగా పాటించాలి," అని కీవ్​లోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఉక్రెయిన్​లో ఎవరైనా భారతీయులు ఉంటే.. తమ రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రభుత్వం తెలిపింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం