US midterm election : రష్యా ఉక్రెయిన్​ యుద్ధంపై.. అమెరికా ఎన్నికల ప్రభావం ఎంత?-how us midterm election results could impact russia ukraine war ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  How Us Midterm Election Results Could Impact Russia-ukraine War

US midterm election : రష్యా ఉక్రెయిన్​ యుద్ధంపై.. అమెరికా ఎన్నికల ప్రభావం ఎంత?

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 08, 2022 07:21 AM IST

US midterm election : అమెరికాలో నేడు మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఇవి డెమొక్రాట్లకే కాకుండా.. ఉక్రెయిన్​కు కూడా కీలకంగా మారాయి! ఎన్నికల్లో రిపబ్లికెన్లు గెలిస్తే.. ఉక్రెయిన్​కు మరిన్న కష్టాలు తప్పవు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రష్యా ఉక్రెయిన్​ యుద్ధంపై.. అమెరికా ఎన్నికల ప్రభావం ఎంత?
రష్యా ఉక్రెయిన్​ యుద్ధంపై.. అమెరికా ఎన్నికల ప్రభావం ఎంత? (AFP)

US midterm election : అమెరికాలో రసవత్తర పోరుకు తెరలేచింది. డెమొక్రాట్లు, రిపబ్లికెన్ల మధ్య ఆధిపత్య పోరుకు సర్వం సిద్ధమైంది. పలు సెనేట్​ స్థానాలతో పాటు ప్రతినిధుల సభకు అగ్రరాజ్యంలో మంగళవారం మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ దఫా ఎన్నికలు అమెరికాకే కాకుండా.. ఉక్రెయిన్​కు కూడా కీలకంగా మారాయి! కాంగ్రెస్​పై రిపబ్లికెన్లు పట్టు సాధిస్తే.. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్​కు మరిన్ని కష్టాలు తప్పవన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ఉక్రెయిన్​కు అమెరికా సాయం తగ్గిపోతుందా?

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్​పై రష్యా యుద్ధానికి దిగింది. అప్పటి నుంచి ఉక్రెయిన్​ వెన్నంటే ఉండి అన్ని విధాలుగా సాయం చేస్తోంది అమెరికా. అధ్యక్షుడు జో బైడెన్​ బృందం.. ఆయుధాలతో పాటు భారీ మొత్తంలో నగదు సాయం చేస్తోంది. రానున్న రోజుల్లో కూడా ఉక్రెయిన్​కు సాయం కొనసాగించేందుకు ప్రణాళికలు రచించింది.

Russia Ukraine war latest news : ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. అమెరికా మధ్యంతర ఎన్నికల సర్వేలు.. డెమొక్రాట్లను, ఉక్రెయిన్​ను భయపెడుతున్నాయి. ఈసారి ప్రతినిధుల సభలో రిపబ్లికెన్లు పట్టు సాధించవచ్చని సర్వేలు సూచిస్తున్నాయి.

ఇదే నిజమైతే.. ఉక్రెయిన్​కు అమెరికా చేసే సాయం తగ్గిపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రిపబ్లికెన్​ పార్టీలోని పలువురు అగ్రనేతలు.. ఉక్రెయిన్​కు ఇస్తున్న సాయాన్ని తగ్గిస్తామని ఇప్పటికే వ్యాఖ్యలు చేశారు. సొంత దేశంలో ద్రవ్యోల్బణంతో ప్రజలు విలవిలలాడిపోతుంటే.. ఇతర దేశానికి భారీగా సాయం చేయడం ఏంటి? అని జో బైడెన్​ను తప్పుబడుతున్నారు.

US Midterm elections 2022 : "ఉక్రెయిన్​కు మేము బ్లాంక్​ చెక్​లు ఇస్తూ కూర్చోము," అని ఘాటుగా స్పందించారు రిపబ్లికెన్​ నేత కెవిన్​ మెక్​కేర్తి. "ఉక్రెయిన్​ యుద్ధంతో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదు," అని మరో రిపబ్లికెన్​ సెనేటర్​ వ్యాఖ్యానించారు.

అంటే.. ప్రతినిధుల సభపై డెమొక్రాట్లు పట్టుకోల్పోతే.. ఉక్రెయిన్​కు సాయం విషయంలో అధ్యక్షుడు జో బైడెన్​కు పరిస్థితులు అత్యంత క్లిష్టంగా మారతాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. ఖర్చులపై తీర్మానాలన్నీ ప్రతినిధుల సభలోనే మొదలవ్వాల్సి ఉండటం ఇందుకు కారణం.

అయితే.. రిపబ్లికెన్​ పార్టీలోని నేతలందరు ఈ విషయాన్ని వ్యతిరేకించడం లేదు. గతంలో ఉక్రెయిన్​కు 40మిలియన్​ డాలర్ల సాయం బిల్లుకు వ్యతిరేకంగా.. ప్రతినిధుల సభలో 57మంది, సెనేట్​ 11మంది మాత్రమే ఓట్లు వేశారు. ఇది డెమొక్రాట్లకు కాస్త ఊరటనిచ్చే విషయం.

రిపబ్లికెన్లు గెలిచినప్పటికీ.. ఉక్రెయిన్​కు చేస్తున్న సాయాన్ని అగ్రరాజ్యం పూర్తిగా నిలిపివేయకపోవచ్చు. కానీ నిధులను, ఆయుధాల సరఫరాను భారీ మొత్తంలో తగ్గించే అవకాశం లేకపోలేదు.

'ఎన్నికలతో సంబంధం లేదు..'

Ukraine America help : అమెరికా ఎన్నికల ఫలితాలతో 'సాయం' విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని ఉక్రెయిన్​ ధీమాగా ఉంది. ఎవరు గెలిచినా.. అమెరికా తమకు సాయం చేస్తూనే ఉంటుందని ఉక్రెయిన్​ రక్షణమంత్రి ఒలెక్సి రెజ్నికోవ్​ అన్నారు. ఈ మేరకు అమెరికా నుంచి తమకు సంకేతాలు వచ్చినట్టు తెలిపారు.

మరోవైపు.. అమెరికా ప్రజలు కూడా ఉక్రెయిన్​ ప్రజలకు మద్దతిస్తున్నారు. ఉక్రెయిన్​కు అగ్రరాజ్యం సాయాన్ని కొనసాగించాలని.. ఈ నెలలో నిర్వహించిన ఓ సర్వేలో 73శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం