Google CEO Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన గూగుల్ సీఈవో పిచాయ్.. ఏ అంశాలపై చర్చించారంటే!
Google CEO Sundar Pichai Meets PM Modi: గూగుల్ పేరెంట్ కంపెనీ అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్.. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు.
Google CEO Sundar Pichai Meets PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కలిశారు. ఢిల్లీకి వచ్చిన గూగుల్, అల్ఫాబెట్ బాస్ పిచాయ్.. మోదీతో సోమవారం సమావేశమయ్యారు. ఏ అంశాలపై చర్చించారో ట్విట్టర్ ద్వారా పిచాయ్ వెల్లడించారు. దేశంలో టెక్నాలజీ రంగ అభివృద్ధి, అందరికీ ఇంటర్నెట్, భారత జీ20 ప్రెసిడెన్సీ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలిపారు. వివరాలు ఇవే.
టెక్ మార్పులు స్ఫూర్తివంతం..
Google CEO Sundar Pichai Meets PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన తర్వాత గూగుల్ బాస్ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. మోదీ నాయకత్వంలో సాంకేతిక రంగంలో మెరుపు వేగంతో మార్పులు వస్తున్నాయని, ఇది ఎంతో స్ఫూర్తివంతంగా ఉందని పిచాయ్ అభిప్రాయపడ్డారు. భారత్ చేపట్టిన జీ20 అధ్యక్షత గురించి కూడా ప్రస్తావించారు. “నేటి గొప్ప మీటింగ్ పట్ల ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. ఆయన నాయకత్వంలో టెక్నాలజీ రంగంలో అత్యంత వేగంగా మార్పులు వస్తున్నాయి. ఇది చూస్తుంటే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. మా బలమైన భాగస్వామ్యం కొనసాగుతుంది. భారత జీ20 ప్రెసిడెన్సీకి పూర్తి మద్దతునిస్తున్నాం. అందరికీ అడ్వాన్స్ ఓపెన్ ఇంటర్నెట్ అందేలా తీసుకునే చర్యలకు సపోర్ట్ అందిస్తాం” అని సుందర్ పిచాయ్ ట్వీట్‍లో పేర్కొన్నారు.
ఇండోనేషియా నుంచి జీ20 ప్రెసిడెన్సీని ఇండియా ఈనెల 1వ తేదీన అందుకుంది. వచ్చే ఏడాది భారత్‍లో జీ20 సదస్సు జరగనుంది.
రాష్ట్రపతితో సమావేశం
Google CEO Meets President Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు గూగూల్ సీఈవో సుందర్ పిచాయ్. భారతీయ టాలెంట్, వివేకానికి సుందర్ పిచాయ్ నిదర్శనంగా ఉన్నారని రాష్ట్రపతి ప్రశంసించారు. భారత్‍లో యునివర్సల్ డిజిటల్ లిటరసీకి కృషి చేయాలని పిచాయ్‍ను కోరారు.
భారత మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషన్‍ను ఇటీవలే అందుకున్నారు సుందర్ పిచాయ్. శాన్‍ఫ్రాన్సిస్కోలో ఈ అవార్డును పిచాయ్‍కు అందించారు అమెరికాలో భారత రాయబారి తరణ్‍జీత్ సింగ్ సంధు. “గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‍కు పద్మభూషణ్ అందించడం చాలా సంతోషంగా ఉంది. మధురై నుంచి మౌంటైన్ వ్యూ వరకు ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం” అని అవార్డు అందించిన సందర్భంగా తరణ్‍జీత్ ట్వీట్ కూడా చేశారు. పద్మభూషణ్‍తో సత్కరించిన భారత ప్రభుత్వానికి సుందర్ పిచాయ్ కూడా ధన్యవాదాలు తెలిపారు.
2004లో గూగుల్‍లో చేరారు సుందర్ పిచాయ్. అనేక ఉన్నతస్థానాల్లో విధులు నిర్వర్తించారు. 2015లో ఆ సంస్థకు సీఈవో అయ్యారు. ప్రస్తుతం గూగుల్ పేరెంట్ సంస్థ అల్ఫాబెట్‍కు కూడా సీఈవోగా ఉన్నారు.