Coromandel Express accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం; పలువురి మృతి!-coromandel express collides with goods train in odisha several coaches derailed ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Coromandel Express Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం; పలువురి మృతి!

Coromandel Express accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం; పలువురి మృతి!

HT Telugu Desk HT Telugu
Jun 02, 2023 08:33 PM IST

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గూడ్స్ ట్రైన్ ను కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీ కొన్న ప్రమాదంలో కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 132 మంది గాయపడ్డారు.

గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీ కొన్న ప్రమాద దృశ్యం
గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీ కొన్న ప్రమాద దృశ్యం (Twitter / @SutirthaBiswas1)

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గూడ్స్ రైలును వేగంగా వెళ్తున్న 12841 కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీ కొనడంతో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లోని దాదాపు 8 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 132 మంది గాయపడ్డారని, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు బాలాసోర్ లోని ఎఫ్ఎం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

షాలిమార్ - చెన్నై కోరమాండల్ ఎక్స్ ప్రెస్

ఈ ప్రమాదంలో షాలిమార్ - చెన్నై కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లోని 8 బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం తెలియగానే, పోలీసులు, స్థానిక అధికారులు, రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలను ప్రారంభించారు. సహాయ చర్యలను పర్యవేక్షించడానికి బాలాసోర్ జిల్లా కలెక్టర్ కూడా ఘటనా స్థలానికి బయల్దేరారు. ఈ కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పశ్చిమబెంగాల్ లోని షాలిమార్ నుంచి చెన్నైలోని డాక్టర్ ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ కు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షాలిమార్ లో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన ట్రైన్ సాయంత్రం 6.30 గంటలకు బాలాసోర్ స్టేషన్ చేరుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం కోసం, బాధితుల వివరాల కోసం ప్రభుత్వం 033-26382217, 8972073925, 67822 62286, 9332392339 హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది.

ముఖ్యమంత్రుల దిగ్బ్రాంతి

ఈ ప్రమాదంపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయ చర్యలను పర్యవేక్షించడానికి రెవెన్య మంత్రి ప్రమీలను, స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సత్యబ్రత సాహు ను సీఎం నవీన్ పట్నాయక్ ఘటనాస్థలానికి పంపించారు. ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో చాలామంది పశ్చిమ బెంగాల్ వాసులు ప్రయాణిస్తున్నారని, అందువల్ల సహాయ చర్యల్లో ఒడిశా ప్రభుత్వంతో సమన్వయంతో పని చేస్తున్నామని పశ్చిమబెంగాల్ సీఎం మమత తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి రాష్ట్రం నుంచి ఒక బృందాన్ని పంపిస్తున్నామన్నారు.

రైలు ప్రమాద దృశ్యాలు
రైలు ప్రమాద దృశ్యాలు
రైలు ప్రమాద దృశ్యాలు
రైలు ప్రమాద దృశ్యాలు
IPL_Entry_Point