Chennai rains : దంచికొడుతున్న వర్షాలు.. చెన్నై ఉక్కిరిబిక్కిరి!
Chennai rains today : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తమిళనాడు అల్లాడిపోతోంది. ముఖ్యంగా చెన్నై ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నెల 5 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది.
Chennai rains today : ఈశాన్య రుతుపవనాల రాకతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు.. చెన్నైతో పాటు ఇతర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఫలితంగా అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఎదురైంది.
స్కూళ్లు మూసివేత..
చెన్నైలో మంగళవారం ఉదయం నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. జీసీసీ(గ్రేటర్ చెన్నై కార్పొరేషన్) అధికారులు.. నగరంలోని అనేక ప్రాంతాలను సమీక్షించి.. తాజా పరిస్థితులను పరిశీలించారు. వరద ముప్పు ప్రాంతాల్లో మానిటరింగ్ కెమెరాలు ఏర్పాటు చేసి, నిత్యం పరిస్థితులను సమీక్షిస్తున్నారు. చెన్నై మెట్రో రెండో దశ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో.. అనేక ప్రాంతాల్లోని రోడ్ల మీద బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.
Tamil Nadu rains latest updates : చెన్నైతో పాటు తిరువల్లూర్, చెంగల్పేట్, తంజావూర్, తిరువరూర్, నాగపట్టినం, కంచీపురం ప్రాంతాల్లోని స్కూళ్లకు, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు.
తమిళనాడులో భారీ వర్షాలపై మరికొన్ని గంటల్లో సీఎం ఎంకే స్టాలిన్ ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించనున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది.
ఐఎండీ హెచ్చరికలు..
IMD rain alert : ఈ నెల 5వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ(భారత వాతావరణశాఖ) హెచ్చరించింది. ఈ మేరకు ఈ నెల 4 వరకు రాష్ట్రానికి యెల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ చేసింది. ఇక మంగళవారం.. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది.
తమిళనాడుతో పాటు కోస్తా ఆంధ్ర, కేరళ-మాహే, దక్షిణ కర్ణాటక ప్రాంతాలకు కూడా ఈ నెల 3 వరకు వర్ష సూచనను ఇచ్చింది భారత వాతావరణ శాఖ. వరదలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.