Same Sex Marriages: స్వలింగ వివాహాలకు చట్టబద్ధతపై అభిప్రాయాలు తెలపండి: రాష్ట్రాలకు కేంద్రం లేఖ-centre seeks states uts views on same sex marriages amid supreme court hearing ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Centre Seeks States Uts Views On Same Sex Marriages Amid Supreme Court Hearing

Same Sex Marriages: స్వలింగ వివాహాలకు చట్టబద్ధతపై అభిప్రాయాలు తెలపండి: రాష్ట్రాలకు కేంద్రం లేఖ

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 19, 2023 01:27 PM IST

Same Sex Marriages: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత విషయంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభిప్రాయాలను కేంద్రం కోరింది. 10 రోజుల్లో బదులివ్వాలని సూచించింది.

Same Sex Marriages: “స్వలింగ వివాహాలకు చట్టబద్ధతపై అభిప్రాయం తెలపండి” (HT Photo)
Same Sex Marriages: “స్వలింగ వివాహాలకు చట్టబద్ధతపై అభిప్రాయం తెలపండి” (HT Photo)

Same Sex Marriages: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే విషయంపై అభిప్రాయాలను తెలపాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ అంశంపై ఉద్దేశాన్ని తెలియజేయాలని కోరింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు(Supreme Court)లో విచారణ జరుగుతుండగా.. కేంద్రం ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభిప్రాయాలను కోరింది. బుధవారం కూడా సుప్రీంలో ఈ పిటిషన్లపై వాదనలు కొనసాగాయి. స్వలింగ వివాహాల చట్టబద్ధత కోసం దాఖలైన పిటిషన్లు విచారణకు అర్హమైనవి కాదని కేంద్రం వాదిస్తోంది. అయితే, ముందుగా వాదనలు వినేందుకే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్యంలోని ధర్మాసనం మొగ్గుచూపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను విచారణలో భాగం చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో కేంద్రం మరో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ విషయంలో మిశ్రమ దృక్పథాలు ముఖ్యమని న్యాయస్థానానికి తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

అప్పటి వరకు వాయిదా వేయండి

Same Sex Marriages: స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్ల విచారణలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను భాగస్వాములను చేయాలన్న కేంద్రం అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అయితే, రాష్ట్రాలు అభిప్రాయాలను తెలిపే వరకు, సంప్రదింపుల ప్రక్రియ ముగిసే వరకు విచారణను నిలుపుదల చేయాలని న్యాయస్థానం ఎదుట కేంద్రం వాదనలు వినిపించింది. ఈ విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలు చాలా ముఖ్యమని, అందుకే ఈ ప్రక్రియ ముగిసే వరకు విచారణ వాయిదా వేయాలని కోరింది. అయితే, కోర్టు మాత్రం విచారణను అలాగే కొనసాగించింది.

Same Sex Marriages: ఈ విషయంపై అభిప్రాయాలను తెలిపేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం 10రోజుల గడువు ఇచ్చింది. స్వలింగ వివాహాల చట్టబద్ధత విషయంపై నిర్ణయం తీసుకునే ముందు వివిధ ప్రాంతాల్లోని విభిన్న వర్గాల సంప్రదాయాలు, ఆచారాలు, నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది. అందుకే మిశ్రమ అభిప్రాయాలను సర్వోన్నత న్యాయస్థానం ముందు ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

Same Sex Marriages: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీం కోర్టు మంగళవారం ప్రారంభించింది. వాదనలు బుధవారం కూడా కొనసాగుతున్నాయి.

Same Sex Marriages: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కోసం పిటిషన్లు వేసిన వారి తరఫున సుప్రీం కోర్టులో న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. అందరికీ సమాన పౌరసత్వాన్ని ఎవరూ వ్యతిరేకించలేరని, ఇది వివాహాలకు కూడా వర్తిస్తుందని ముకుల్ వాదించారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. మరోవైపు, కేంద్రం ఈ పిటిషన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. స్వయంగా తమను తాను ఉన్నతస్థాయి నాగరికులుగా భావించుకునే కొందరు ఈ పిటిషన్లను వేశారని, స్వలింగ వివాహాల పట్ల అధిక మందిలో సానుకూలత లేదని కోర్టుకు తెలిపింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తే సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందనేలా అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.

IPL_Entry_Point