CAT Results 2022: ‘క్యాట్’లో మెరిసిన మెకానిక్ కుమారుడు.. 99.78 శాతంతో సత్తా-air conditioner mechanic son razin mansuri got 99 78 percent in cat 2022 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Air Conditioner Mechanic Son Razin Mansuri Got 99 78 Percent In Cat 2022

CAT Results 2022: ‘క్యాట్’లో మెరిసిన మెకానిక్ కుమారుడు.. 99.78 శాతంతో సత్తా

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 22, 2022 12:09 PM IST

CAT Results 2022: దేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టెస్ట్ ‘క్యాట్’లో ఓ మెకానిక్ కుమారుడు సత్తాచాటాడు. ఏకంగా 99.78 శాతం సాధించాడు. అతడి ఇన్‍‍స్పిరేషనల్ జర్నీ ఇదే.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

CAT Results 2022: కామన్ అడ్మిషన్ టెస్ట్ (Common Admission Test - CAT)లో ఓ ఏసీ మెకానిక్‍ కుమారుడు సత్తాచాటాడు. ఏకంగా 99.78 శాతం సాధించి.. దేశంలోనే టాప్ విద్యాసంస్థల్లో సీటు సాధించే అర్హతను పొందాడు. ఈ ఘనత సాధించింది 22 సంత్సరాల వయసు ఉన్న రాజిన్ మన్సూరి (Razin Mansuri). అతడి తండ్రి ఎయర్‌కండీషనర్ల మెకానిక్‍గా పని చేస్తున్నారు. అంతకు ముందు క్యాట్ పరీక్ష రాసి మంచి శాతమే సాధించినా.. మరింత మెరుగైన ఫలితాల కోసం ఈసారి కూడా మన్సూరీ ప్రయత్నించాడు. ఈ ఏడాది ఏకంగా 99.78 శాతం సాధించాడు. ఐఐఎం-అహ్మదాబాద్, ఐఐఎం-బెంగళూరు లాంటి టాప్ ఇన్‍స్టిట్యూట్‍లో సీటు సాధించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. రాజీన్ మన్సూరీ జర్నీ ఇదే.

ఫలించిన మరో ప్రయత్నం

గుజరాత్‍లోని అహ్మదాబాద్‍లో రాజిన్ మన్సూరీ ఉంటాడు. అహ్మదాబాద్ యూనివర్సిటీలో ఐటీ ఇంజినీరింగ్ పూర్తి చేసిన అతడు.. ముందుగా 2021 క్యాట్ పరీక్షలో 96.2 శాతం స్కోర్ చేశాడు. ఐఐఎం ఉదయ్‍పూర్‌లో సీటు కోసం అర్హత సాధించాడు. మన్సూరీ అంతటితో సంతృప్తి చెందలేదు. మరోసారి ప్రయత్నించాలని అనుకున్నాడు. మళ్లీ క్యాట్ 2022 పరీక్ష రాశాడు. ఈసారి 99.78 శాతం సాధించి సత్తాచాటాడు. ఇప్పుడు ఐఐఎం-అహ్మదాబాద్, ఐఐఎం-బెంగళూరు లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీటు పొందే ఛాన్స్‌ను మెరుగుపరుచుకున్నాడు.

తండ్రి సంపాదన రూ.25వేలు

అహ్మదాబాద్‍లోని జుహపురాలో రాజిన్ మన్సూరి కుటుంబం ఉంటోంది. అతడి తండ్రి ఇర్ఫాన్ మన్సూరీ ఏసీల మెకానిక్‍గా పని చేస్తూ నెలకు రూ.25వేలు సంపాదిస్తున్నారు. రాజిన్ తల్లి సహిబా, తమ్ముడు రెహాన్. వీరంతా కలిసి ఓ సింగిల్ బెడ్‍రూమ్ ఇంట్లో ఉంటున్నారు.

స్కాలర్‌షిప్‍లతోనే..

తన కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, పాఠశాల నుంచి చాలావరకు తాను స్కాలర్‌షిప్‍లతోనే చదువుతున్నానని రాజిన్ మన్సూరి చెప్పాడు. సీఎన్ విద్యాలయలో చదువు పూర్తయ్యాక.. అహ్మదాబాద్ యూనివర్సిటీ నుంచి ఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశానని రాజిన్ మన్సూరీ చెప్పాడు. తన పర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉండటంతో అహ్మదాబాద్ యూనివర్సిటీలోనూ స్కాలర్‌షిప్ పొందానని వెల్లడించాడు.

రూ.6లక్షల జీతంతో ఉద్యోగం వచ్చినా..

ఇంజినీరింగ్ పూర్తి చేశాక.. రూ.6లక్షల వార్షిక వేతనంతో ఉద్యగం వచ్చినా తాను వద్దనుకున్నానని రాజిన్ మన్సూరి చెప్పాడు. ఐఐఎం-అహ్మదాబాద్, ఐఐఎం-బెంగళూరు లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదవాలన్నదే తన కల అని, అందుకే క్యాట్‍కు ప్రిపేర్ అయ్యా అని చెప్పాడు. ఐఐఎం పూర్తయిన తర్వాత తాను సమాజానికి ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నానని, చాలా మంది విద్యార్థుల చదువు కోసం సాయం చేస్తానని రాజిన్ మన్సూరి అన్నాడు.

CAT 2022 Results: క్యాట్ 2022 ఫలితాలు వెల్లడయ్యాయి. iimcat.ac.in లో అభ్యర్థులు ఐఐఎం క్యాట్ స్కోర్ కార్డును డౌన్‍లోడ్ చేసుకోవచ్చు.

IPL_Entry_Point