Kaun Banega Crorepati: కేబీసీలో కోటి వచ్చినా.. భర్తకు మాత్రం ఇవ్వనన్న భార్య
బాలీవుడ్ పాపులర్ షో కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 14 షో లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో వీడియోలో ఓ మహిళ కోటి రూపాయల ప్రశ్న వరకు వస్తుంది. ఈ డబ్బుతో మీ ఆయనకు గిఫ్ట్ ఇస్తారా అని అమితాబ్ అడుగ్గా.. ఆమె ససెమీరా ఇవ్వనని తేల్చి చెబుతుంది.
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి షో గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగులో ఎవరు మీలో కోటీశ్వరుడు పేరుతో నాగార్జున, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్లు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే అమితాబ్ హోస్ట్‌గా చేసే షో హిందీలో బాగా ప్రాచుర్యం పొందింది. తాజాగా ఈ షో 14వ సీజన్ త్వరలోనే ప్రసారం కానుంది. తాజాగా ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్‌ను అమితాబ్ తన ప్రశ్నలకు కన్ఫ్యూజ్ చేశారు. గెలిచిన మొత్తాన్ని మీ భర్తకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు? అని ప్రశ్నించగా.. ఆమె ఇవ్వదలచుకోట్లేదని బదులిచ్చింది. తాజాగా ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ట్రెండింగ్ వార్తలు
డాక్టర్ అను వర్గీస్ అనే బెంగళూరుకు చెందిన మహిళ కౌన్ బనేగా కరోడ్ పతి 14వ సీజన్‌లో పాల్గొనడానికి అర్హత సాధించింది. తన భర్తతో పాటు ఈ షోకు హాజరైన ఈ మహిళ.. హాట్ సీట్లో కూర్చొని అద్భుతంగా ఆడింది. 50 లక్షలు, 75 లక్షల రూపాయల ప్రశ్నలకు కూడా సమాధానమిచ్చి ఆ మొత్తాన్ని గెల్చుకుంది. మొదటగా 50 లక్షలు గెల్చినప్పుడే అమితాబ్.. ఈ డబ్బుతో మీ భర్తకు ఎలాంటి బహుమతి కొందామనుకుంటున్నారు? అని ప్రశ్నిస్తారు. అయితే ఆమె మాత్రం కొనివ్వనని బదులిచ్చింది. దీంతో అందరూ నవ్వుకుంటారు. అనంతరం 75 లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పి ఆ మొత్తాన్ని గెల్చినతర్వాత కూడా అదే ప్రశ్నను అడుగుతారు బిగ్‌బీ. ఈ సారి కూడా ఆమె సమాధానంలో ఎలాంటి మార్పు ఉండదు. ఫలితంగా అక్కడున్నవారంతా నవ్వులు విసరడంతో పాటు ఆమెకు చప్పట్లతో అభినందనలు చెప్పారు.
ఇంతకంటే ఎక్కువ మొత్తం గెలిచినా కానీ మీ భర్తకు గిఫ్ట్ ఇవ్వరా? అని అడుగ్గా.. సర్ ఆయన ఎప్పుడూ నాకు బహుమతి ఇవ్వలేదు కాబట్టి ఇవ్వను అని సమాధానమిచ్చింది. అనంతరం అమితాబ్.. కోటి రూపాయల ప్రశ్నను అడగడంతో ప్రోమో పూర్తవుతుంది. ఈ సీజన్‌లో కేబీసీలో గెలిచేందుకు గరిష్ఠ మొత్తం రూ.7.5 కోట్లు.
అమితాబ్ బచ్చన్ ఇటీవల రెండోసారి కూడా కోవిడ్-19 బారినపడటంతో నూతన కేబీసీ ఎపిసోడ్‌ల చిత్రీకరణ నిలిపివేశారు. ఈ విషయాన్ని బిగ్‌బీ తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. కాస్త విరామం తీసుకుంటున్నానని తెలిపారు.
సంబంధిత కథనం