Vijay Deverakonda Donating Organs: ఈ మధ్యే లైగర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రౌడీ హీరో విజయ్ దేవరకొండకు చేదు అనుభవమే ఎదురైంది. ఈ సినిమా కోసం తాను ఎంత కష్టపడినా మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. సాదాసీదా కథ, స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాను డైరెక్టర్ పూరి జగన్నాథ్ చెడగొట్టాడంటూ అభిమానులు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.
లైగర్ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయ్ తాజాగా చిల్డ్రన్స్ డే నాడు తీసుకున్న నిర్ణయం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. బాలల దినోత్సవం రోజు పేస్ హాస్పిటల్స్, లివర్ పాంక్రియాస్ ఫౌండేషన్ ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించాయి. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం పీడియాట్రిక్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడంతోపాటు 24 గంటల హెల్ప్‌లైన్‌ను కూడా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ తాను తన అవయవాలను దానం చేయాలని నిర్ణయించినట్లు తెలిపాడు. తన మరణం తర్వాత కూడా మరొకరిలో జీవించడానికి తాను ఇష్టపడతానని, అందుకే అవయవ దానం చేస్తానని గతంలోనే సంతకం చేసినట్లు వివరించాడు.
తన అవయవాలను వృథాగా పోనివ్వడం తనకు ఇష్టం లేదని విజయ్ చెప్పాడు. అవయవ దానం చేస్తానన్న విజయ్ నిర్ణయాన్ని చాలా మంది అభిమానులు, నెటిజన్లు ప్రశంసించారు. రౌడీ హీరోగా పేరుగాంచినా.. అతని మనసు మాత్రం గొప్పదే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే విజయ్ ప్రస్తుతం తన తర్వాతి మూవీ ఖుషీ షూటింగ్‌లో ఉన్నాడు. సమంతతో కలిసి చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.