Veera Simha Reddy Movie Review: వీరసింహారెడ్డి మూవీ రివ్యూ - బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమా ఎలా ఉందంటే
Veera Simha Reddy Movie Review: బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా గురువారం (నేడు) రిలీజైంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే...
Veera Simha Reddy Movie Review: రాయలసీమ నేపథ్య కథాంశాలు బాలకృష్ణ (Balakrishna) కెరీర్‌కు అచ్చొచ్చాయి. ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సమరసింహారెడ్డి, నరసింహానాయుడు సినిమాలు భారీ కమర్షియల్ హిట్స్‌గా నిలవడమే కాకుండా బాలకృష్ణకు మాస్‌లో తిరుగులేని ఇమేజ్‌ను తీసుకొచ్చాయి. లాంగ్ గ్యాప్ తర్వాత సీమ బ్యాక్‌డ్రాప్‌లో బాలకృష్ణ చేసిన తాజా చిత్రం వీరసింహారెడ్డి.
ట్రెండింగ్ వార్తలు
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వం వహించాడు. శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి కానుకగా ఈ గురువారం (నేడు) వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ ఘన విజయం తర్వాత బాలకృష్ణ నటించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించిందా? సీమ ఫార్ములా మరోసారి బాలకృష్ణ కు కలిసివచ్చిందా? భారీ పోటీ మధ్య సంక్రాంతి బరిలో నిలిచిన వీరసింహారెడ్డి విజేతగా నిలిచాడా? లేదా? అన్నది చూద్ధాం…
Veera Simha Reddy Movie Story - వీరసింహారెడ్డి పోరాటం...
రాయలసీమలోని పులిచర్ల ప్రాంత ప్రజలు వీరసింహారెడ్డిని (బాలకృష్ణ) దేవుడిలా కొలుస్తుంటారు. ఫ్యాక్షన్, పగలు, ప్రతీకారాలు లేకుండా సీమలో శాంతి నెలకొనాలన్నది వీరసింహారెడ్డి సంకల్పం. ప్రజలందరి తరఫున తాను ఒక్కడే కత్తి పట్టి పోరాటం చేస్తుంటాడు. వీరసింహారెడ్డిని చంపాలని అతడు చెల్లెలు భానుమతితో (వరలక్ష్మి శరత్‌కుమార్) పాటు ఆమె భర్త ప్రతాప్‌రెడ్డి (దునియా విజయ్) ప్రయత్నిస్తుంటారు.
తాను ప్రాణంగా ప్రేమించిన మీనాక్షి (హనీరోజ్)తో పాటు తన కూమారుడు జై (బాలకృష్ణ)ని కలవడానికి ఇస్తాంబుల్ వెళ్లిన వీరసింహారెడ్డిని ప్లాన్ ప్రకారం చంపేస్తారు భానుమతి,ప్రతాప్‌రెడ్డి. వీరసింహారెడ్డిపై భానుమతి పగను పెంచుకోవడానికి కారణమేమిటి? చెల్లిలి అంటే ప్రాణమిచ్చే వీరసింహారెడ్డి ఆమె చేతిలోనే ఎందుకు చనిపోవాల్సివచ్చింది? తాను పెళ్లి చేసుకోవాలని అనుకున్న మీనాక్షికి వీరసింహారెడ్డి ఎందుకు దూరమయ్యాడు? తండ్రికి ఇచ్చిన మాటను జై సింహారెడ్డి ఎలా పూర్తిచేశాడు? తాను ప్రేమించిన ఈషాను (శృతిహాసన్) జై పెళ్లి చేసుకున్నాడా లేదా అన్నదే వీరసింహారెడ్డి కథ.
బాలకృష్ణ ఇమేజ్ ...
రాయలసీమ నేపథ్యానికి అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి దర్శకుడు గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించాడు. పూర్తిగా బాలకృష్ణ ఇమేజ్‌ను నమ్ముకొని పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను మలిచాడు. అభిమానులు బాలకృష్ణను ఎలా చూడాలని అనుకుంటున్నారో ఆ హంగులన్నీ సినిమాలు ఉండేలా చూసుకున్నాడు గోపీచంద్ మలినేని.
బాలకృష్ణ కనిపించే ప్రతి సీన్‌లో పవర్‌ఫుల్ డైలాగ్, ప్రతి పది నిమిషాలకు యాక్షన్ సీన్ తో కథ, కథనాల్ని అల్లుకున్నారు. కథ కంటే హీరోయిజం, ఎలివేషన్స్‌కు అధికంగా ప్రాముఖ్యతనిస్తూ వీరసింహారెడ్డి (Veera Simha Reddy Movie Review) సినిమాను రూపొందించారు.
ఇంటర్వెల్ ట్విస్ట్…
బాలకృష్ణ, శృతిహాసన్ రొమాంటిక్ లవ్ ట్రాక్‌తో రొటీన్‌గా సినిమా మొదలవుతుంది. ఫోర్స్‌డ్ కామెడీ ట్రాక్ పెద్దగా వర్కవుట్ కాలేదు. వీరసింహారెడ్డి ఎంట్రీ తర్వాతే అసలు కథలోకి వెళ్లారు దర్శకుడు. వీరసింహారెడ్డి, ప్రతాప రెడ్డి పగ, ప్రతీకారాలతో ఫస్ట్ హాప్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్‌తో సాగుతుంది.
వీరసింహారెడ్డి మరణంలో విరామంలో ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. అన్నయ్యపై భానుమతి పగ పెంచుకోవడానికి గల కారణాల్ని చూపిస్తూ సెకండాఫ్ నడుస్తుంది. ద్వితీయార్థంలో యాక్షన్ కంటే కుటుంబ బంధాలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు డైరెక్టర్.
రొటీన్ ఫార్ములా కథ...
వీరసింహారెడ్డి సినిమా రొటీన్ ఫార్ములా కథతోనే తెరకెక్కించారు దర్శకుడు గోపీచంద్ మలినేని. తెలుగు తెరపై ఈ పాయింట్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామాకు ఫ్యాక్షన్ నేపథ్యాన్ని మేళవించి కొత్తదనాన్ని అద్దాలని ప్రయత్నించారు డైరెక్టర్.
అన్నాచెల్లెళ్ల ప్రతీకారం అనే చిన్న క్లాన్‌ఫ్లిక్ట్ తీసుకొని దానిని పూర్తిగా కమర్షియలైజ్ చేసుకుంటూ (Veera Simha Reddy Movie Review) సినిమాను తెరకెక్కించారు. మెయిన్ పాయింట్‌లో డెప్త్ మిస్సయింది. వీరసింహారెడ్డి నేపథ్యం, అతడిపై వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ బాలకృష్ణ గతంలో నటించిన సినిమాల్ని గుర్తుకుతెస్తాయి.
రెండు పాత్రల్లో...
వీరసింహారెడ్డిగా, జై గా రెండు పాత్రల్లో చక్కటి వేరియేషన్ చూపించాడు బాలకృష్ణ. ఒక క్యారెక్టర్ పూర్తిగా మాస్ కోణంలో సాగితే మరో క్యారెక్టర్‌ను స్టైలిష్‌గా డిజన్ చేశాడు డైరెక్టర్. ఫ్యాక్షన్ నాయకుడి పాత్రలో హీరోయిజాన్ని పండించిన తీరు ఫ్యాన్స్‌ను మెప్పిస్తుంది.
నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్‌లో వరలక్ష్మి శరత్‌కుమార్ చెలరేగిపోయింది. కళ్లతోనే విలనిజాన్ని పడించింది. ప్రతాప రెడ్డిగా దునియా విజయ్ విలనిజంలో కొత్తదనం లేదు. శృతిహాసన్ కేవలం పాటలకు మాత్రమే పరిమితమైంది. ఆమెకు స్క్రీన్ స్పేస్ పెద్దగా దక్కలేదు. ఆమె కంటే సినిమాలో హనీ రోజ్ ఎక్కువగా కనిపిస్తుంది.
వైసీపీకి వ్యతిరేకంగా...
సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్‌గా నిలిచాయి. బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టుగా సినిమాలోని ప్రతి డైలాగ్ రాశాడు. ఈ పవర్‌ఫుల్ డైలాగ్స్ అన్ని అభిమానులను మెప్పిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
సినిమా పరంగానే కాకుండా పొలిటికల్‌గా ఏపీ ప్రభుత్వంపై డైలాగ్స్ ద్వారా చురకలు వేశారు. పని చేయడం అభివృద్ధి, పనులు ఆపడం కాదు, జీతాలు ఇవ్వడం అభివృద్ధి బిచ్చం వేయడం కాదు లాంటి డైలాగ్స్ వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాసినట్లుగానే అనిపిస్తాయి. తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరో పెద్ద ప్లస్‌గా నిలిచింది. యాక్షన్ ఎపిసోడ్స్‌లోని ఫీల్‌ను బీజీఎమ్ ఎలివేట్ చేసింది.
Veera Simha Reddy Movie Review- బాలయ్య ఫ్యాన్స్‌కు మాత్రమే...
వీరసింహారెడ్డి పూర్తిగా బాలకృష్ణ అభిమానులను మాత్రమే సంతృప్తి పరిచే రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమాగా చెప్పవచ్చు. బాలయ్య ఫ్యాన్స్‌కు విజువల్ ఫీస్ట్‌గా ఉంటుంది. మిగిలిన ప్రేక్షకుల్ని మెప్పించడం కష్టమే.
రేటింగ్: 2.75/5