Veera Simha Reddy First Single: మరోసారి రానున్న జై బాలయ్య.. వీరసింహారెడ్డి ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్
Veera Simha Reddy First Single: నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన జై బాలయ్య అనే సాంగ్ ప్రోమోను విడుదల చేసింది. ఈ పూర్తి పాటను నవంబరు 25న రిలీజ్ చేయనుంది.
Veera Simha Reddy First Single: నందమూరి నటసింహం బాలకృష్ణ గతేడాది అఖండ సినిమాతో అద్భుత విజయాన్ని అందుకుని మంచి జోష్ మీదున్నారు. అంతేకాకుండా అన్‌స్టాపబుల్ షోతో ఆయన తన క్రేజ్‌ను అమాంతం పెంచేసుకున్నారు. ప్రస్తుతం అన్‌స్టాపబుల్-2 నడుస్తోంది. దీంతో పాటు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అదే వీరసింహారెడ్డి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో సరికొత్త అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ప్రోమోను విడుదల చేసింది.

జై బాలయ్య అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అంతేకాకుండా రాజసం నీ ఇంటి పేరు అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీని పూర్తి పాటను నవంబరు 25న ఉదయం 10.29 గంటలకు విడుదల చేయనుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ లుక్ బాలయ్య అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో ట్రాక్టర్ నడుపుతూ కనిపించిన బాలకృష్ణ రాయల్ లుక్‌లో అదరగొట్టారు.
ఇప్పటికే అఖండ చిత్రంలో జై బాలయ్య అంటూ తమన్ స్వరపరిచిన గీతం ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా వీరసింహారెడ్డిలోనూ జై బాలయ్య పేరుతో రానున్న ఈ సాంగ్ కూడా ఆకట్టుకుంటుందని అభిమానులు అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఇది మరో మాస్ బోనాంజా అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం వీరసింహారెడ్డి షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమాను నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేస్తోంది. తమన్ సంగీతాన్ని సమకురుస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ అందించగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్ మాస్టార్లుగా రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.