TarakaRatna Health Bulletin: గుండెపోటుకు గురైన సినీ నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ఎక్మో ట్రీట్‌మెంట్ విధానం ద్వారా అతడిని కృత్రిమ శ్వాసను అందిస్తోన్నట్లు ప్రత్యేక బులిటిన్‌లో డాక్టర్స్ వెల్లడించారు. మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్ కారణంగా షాక్‌కు లోనవ్వడంతో తారకరత్నకు గుండెపోటు వచ్చిందని, అందువల్లే అతడి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు బులిటిన్‌లో డాక్టర్స్ పేర్కొన్నారు. ,కార్డియాలజిస్ట్, ఇంటెన్సివిస్ట్‌లతో పాటు మల్టీ డిసిప్లినరీ క్లినికల్ టీమ్ నిరంతర పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్సను అందిస్తోన్నట్లు తెలిపారు. మరికొద్ది రోజుల పాటు ఇదే తరహా ట్రీట్‌మెంట్‌ను అందించబోతున్నట్లు పేర్కొన్నారు. వైద్యుల ప్రకటనతో నందమూరి అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నాడు. ,ఈ పాదయాత్రలో అస్వస్థతకు లోనైన అతడిని కుప్పం ఆసుపత్రికి తరలించారు. గుండెపోటు రావడంతో వైద్య చికిత్సను అందించారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో రోడ్డు మార్గం ద్వారా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తారకరత్నను తరలించారు. ,ప్రస్తుతం బెంగళూరులోని ఆసుపత్రిలో నందమూరి బాలకృష్ణ ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ వర్గాలు, నందమూరి కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రిని సందర్శించనున్నట్లు చెబుతున్నారు.