Anni Manchi Sakunamule Teaser: అన్నీ మంచి శకునములే టీజర్ వచ్చేసింది.. ఈ వేసవికి చల్లని చిరుగాలి లాంటి చిత్రం
Anni Manchi Sakunamule Teaser: సంతోష్ శోభన్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం అన్నీ మంచి శకునములే. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మే 18న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Anni Manchi Sakunamule Teaser: టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే సంక్రాంతికి అతడు కల్యాణం కమనీయం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇంతలోనే మరో సరికొత్త చిత్రంతో ఆడియెన్స్‌ను సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. అతడు నటించిన తాజా చిత్రం అన్నీ మంచి శకునములే. వైజయంతి ఫిల్మ్స్, స్వప్నా సినిమాస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమా టీజర్‍ను విడుదల చేసింది.
అన్నీ మంచి శకునములే టీజర్‌ను సీతా రామంతో సూపర్ హిట్ అందుకున్న దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఫ్యామిలీ డ్రామాతో పాటు క్యూట్ లవ్ స్టోరీ కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది.
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ తమ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అలరించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. అలాగే రాజేంద్ర ప్రసాద్, గౌతమి, నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. అలా మొదలైంది, కల్యాణ వైభోగమే, ఓ బేబీ లాంటి సూపర్ హిట్లు అందుకున్న నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మరోసారి ఆమె మంచి కథతో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
వైజయంతీ ఫిల్మ్స్ దాని అనుబంధ ప్రొడక్షన్ హౌస్ స్వప్నా సినిమాస్ సంయుక్తంగా అన్నీ మంచి శకునములే సినిమాను రూపొందించారు. సన్నీ కూరపాటి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ తన మ్యూజిక్‌తో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాడు. వేసవి కానుకగా మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.